'పొలిమేర 3' గ్లింప్స్: కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ
| ‘పొలిమేర 3’ స్పెషల్ గ్లింప్స్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో సత్యం రాజేష్ కొమరయ్యగా కనిపించగా, అర్జున్ సర్జా విరావి అనే యోధుడి పాత్రలో పరిచయమయ్యారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఓటీటీలో మా ఊరి పొలిమేర తెచ్చుకున్న రెస్పాన్స్, ఆ తర్వాత థియేటర్లలో పొలిమేర 2 సాధించిన సక్సెస్ తో ఈ ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఏర్పడింది. తక్కువ బడ్జెట్ తో మొదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టిన ఈ సిరీస్ ఇప్పుడు మరో కథతో సిద్ధమవుతోంది. దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని అంతకంటే భారీ స్కేల్ లో సిద్ధం చేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా పొలిమేర 3 నుంచి వదిలిన స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.
వీడియో ప్రారంభంలో ఒక పాత గుడి గోపురం చుట్టూ కాకులు తిరగడం, ఆకాశంలో అమావాస్య సూర్యగ్రహణం కనిపించి మిస్టీరియస్ వైబ్ సెట్ చేశారు. ఆ వెంటనే గాల్లో తేలివచ్చే ఈక, విష్ణువు నుంచి శివుడి రూపానికి మారే మార్ఫింగ్ విజువల్స్ చూపించారు. అనంతరం శేషశయనుడైన అనంత పద్మనాభ స్వామి భారీ విగ్రహం తెరపైకి వస్తుంది.
గత రెండు భాగాల్లో కథను నడిపించిన కొమరయ్య పాత్ర ఇందులోనూ కొనసాగుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఒంటిపై బట్టలు లేకుండా నేలపై ముగ్గుల మధ్య కూర్చుని, పుర్రె ముందు దీపాలు వెలిగించి చేతబడులు చేస్తూ సత్యం రాజేష్ కనిపించిన తీరు పాత సినిమాల ఫ్లేవర్ ను గుర్తుచేసింది. ఈ మూడో పార్ట్ లో కొమరయ్య ఎలాంటి తాంత్రిక పూజలు చేయబోతున్నాడనే దానిపై ప్రేక్షకుల్లో ఆలోచనలు రేకెత్తించేలా ఆ షాట్ కుదిరింది.
ఈ వీడియోలో అసలైన సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా నిలిచింది యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఎంట్రీ. విరావి అనే పవర్‌ఫుల్ యోధుడు పాత్రలో ఆయనను పరిచయం చేశారు. నుదుటిపై తిరునామం, రక్తపు మరకలు, పిల్లి కళ్లతో పొడవాటి జుట్టుతో ఉన్న ఆయన రగ్గడ్ అవతారం చాలా కొత్తగా ఉంది. చేతిలో కత్తులు పట్టుకుని అడవిలో శవాల గుట్టల మధ్య నడుస్తూ వచ్చే సీన్ అర్జున్ క్యారెక్టర్ డెప్త్‌ను క్లియర్ గా చాటిచెప్పింది.
టెక్నికల్ పరంగా చూస్తే పొలిమేర ప్రపంచం చాలా పెద్దగా విస్తరించినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కృష్ణ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సిద్ధార్థ్ కెమెరా పనితనం గ్లింప్స్ కు మంచి థ్రిల్లింగ్ ఫీల్ తెచ్చాయి. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈసారి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. తాంత్రిక శక్తులు, దైవిక అంశాల నేపథ్యంతో సాగే కథకు అర్జున్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నటుడు తోడవడంతో సినిమాపై బజ్ పెరిగింది. ఇక దర్శకుడు అనిల్ ఈసారి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో వేచి చూడాలి.