టాక్ ఆఫ్ ది టౌన్: ముంబైలో అల్లు అర్జున్ ఆఫీస్‌కి ద‌గ్గ‌ర‌గా అట్లీ 38కోట్ల విలాసం!

ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఏకంగా రూ. 38 కోట్ల విలువైన సీ-ఫేసింగ్ (సముద్ర అభిముఖ) విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను అట్లీ కొనుగోలు చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Update: 2026-07-29 10:11 GMT

కోలీవుడ్‌లో వరుస హిట్లు సాధించి.. ఆ తర్వాత షారూఖ్ ఖాన్‌తో `జవాన్` వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు అట్లీ ఇప్పుడు వినోద పరిశ్రమలో అత్యంత ప్రాముఖ్య‌త‌ కలిగిన ఫిలిం మేకర్స్‌లో ఒకరు. సినిమా లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ అత‌డు తన స్థాయిని మరింత పెంచుకుంటున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఏకంగా రూ. 38 కోట్ల విలువైన సీ-ఫేసింగ్ (సముద్ర అభిముఖ) విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను అట్లీ కొనుగోలు చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

సినీ ప్రముఖులకు నిలయమైన బాంద్రాలోని ఒక ప్రతిష్టాత్మకమైన హై-రైజ్ టవర్‌లో ఈ ఇల్లు ఉంది. అట్లీ ఆయన భార్య ప్రియ.. వారి పిల్లలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ ఇల్లు కుటుంబానికి ఒక అద్భుతమైన నివాసంగా నిలవనుంది. ప్రముఖ నటి పూజా హెగ్డే స‌హా ప‌లువురు బాలీవుడ్ దిగ్గజాలు నివసించే పరిసరాల్లోనే ఈ అపార్ట్‌మెంట్ ఉండటం విశేషం. అయితే అల్లు అర్జున్ ఆఫీస్ జుహూ లో ఉండ‌గా, అట్లీ ఇంటికి 22 కిలోమీట‌ర్ల‌ ప్ర‌యాణ దూరం ఉందని తెలుస్తోంది. ఈ సరికొత్త ఇల్లు అట్లీ సాధించిన అపూర్వమైన విజయాలకు...అత‌డు పెరిగిన బ్రాండ్ వ్యాల్యూకు ప్రతిరూపంగా నిలుస్తోంది.

ఈ డ్రీమ్ హోమ్‌లో అడుగడుగునా అత్యాధునిక ప్రపంచ స్థాయి వసతులు ఉన్నాయి. ఇక్కడ నుండి అరబ్బీ సముద్రం కనిపించేలా విశాలమైన పనోరమిక్ డెక్ బాల్కనీలు ఈ కొత్త ఇంటికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. వీటితో పాటు అత్యున్నత స్థాయి సెక్యూరిటీ సిస్టమ్..ఇంటికి నేరుగా చేరుకునేందుకు వీలుగా ప్రైవేట్ ఎలివేటర్ (లిఫ్ట్) సదుపాయం కూడా ఈ నివాసం ప్రత్యేకతలలో ఒకటిగా ప్రచారంలో ఉంది.

విజయ్ కాంబినేషన్‌లో తేరి, మెర్సల్, బిగిల్ వంటి సినిమాలతో తమిళ చిత్రసీమను ఏలిన అట్లీ `జవాన్` విజయంతో బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం అత‌డు తన పనుల కోసం చెన్నై - ముంబై నగరాల మధ్య సమయాన్ని వెచ్చించాల్సి వ‌స్తోంది. ఈ క్రమంలోనే ముంబైలో ఇంతటి విలాసవంతమైన నివాసం ఏర్పాటు చేసుకోవడం అత‌డి ప్రొఫెషనల్ గ్రోత్‌కు ఒక ముఖ్యమైన ముంద‌డుగుగా చెప్పవచ్చు.

ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అట్లీ ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ `రాకా` పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్-ఫాంటసీ వినోదాత్మక చిత్రానికి సాయి అభ్యంగ్కర్ సంగీతం అందిస్తున్నారు. ఒకవైపు భారీ పాన్-ఇండియా సినిమాలను ప్లాన్ చేస్తూనే.. మరోవైపు ముంబైలో ఇలాంటి అత్యంత ఖరీదైన నివాసాన్ని సొంతం చేసుకోవడం అట్లీ రేంజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది.

Tags:    

Similar News