'వందేమాతరం' 150 ఏళ్ల వేడుక‌: ల‌ఘు చిత్రాల‌కు రూ.15 లక్షల బహుమానం

భారతీయ స్వాతంత్య్ర‌ సంగ్రామంలో జాతిని ఉప్పెనలా ఉర్రూతలూగించిన `వందేమాతరం` గేయం పురుడుపోసుకుని 150 వసంతాలు పూర్తయ్యాయి.;

Update: 2026-04-28 04:22 GMT

భారతీయ స్వాతంత్య్ర‌ సంగ్రామంలో జాతిని ఉప్పెనలా ఉర్రూతలూగించిన `వందేమాతరం` గేయం పురుడుపోసుకుని 150 వసంతాలు పూర్తయ్యాయి. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ 1875 నవంబర్ 7న (అక్షయ నవమి) రచించిన ఈ అద్భుత గీతం.. మాతృభూమిని దైవస్వరూపంగా ఆరాధించే స్ఫూర్తిని రగిలించింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ `వందేమాతరం ఫ్రేమ్స్` (VM FRAMES) పేరుతో జాతీయ స్థాయి ఫిల్మ్ మేకింగ్ పోటీలను నిర్వహిస్తోంది. నవభారత స్ఫూర్తిని ప్రతిబింబించేలా చిత్రాలను రూపొందించే సృష్టికర్తలను ఈ పోటీ ఆహ్వానిస్తోంది.

ఈ పోటీని ప్రధానంగా మూడు విభాగాల్లో నిర్వహిస్తున్నారు. మొదటిది `రీల్ మేకింగ్` విభాగం. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే విద్యార్థులు- యువత కోసం ఉద్దేశించిన ఈ విభాగంలో ఒక్క నిమిషం కంటే తక్కువ నిడివితో ప్రభావవంతమైన విజువల్ స్టోరీటెల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అత్యుత్తమ రీల్స్‌కు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు బహుమతి లభిస్తుంది. చాలా ప‌రిమిత స‌మ‌యం రూపంలో బలమైన భావోద్వేగాన్ని లేదా సందేశాన్ని పండించడమే ఈ విభాగం ప్రధాన ఉద్దేశ్యం.

రెండవది `ఏఐ (AI) ఆధారిత చిత్రాలు`. సాంకేతికత- సృజనాత్మకత కలయికను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. స్క్రిప్ట్ రాయడం నుండి విజువల్ జనరేషన్.. యానిమేషన్.. సౌండ్ డిజైన్ వరకు కృత్రిమ మేధను ఒక సాధనంగా వాడుకుంటూ 3 నుండి 5 నిమిషాల నిడివి గల చిత్రాలను రూపొందించాలి. ఏఐ సాంకేతికతను కథాంశానికి ఎలా అన్వయించారనే అంశంపై విజేతలను ఎంపిక చేస్తారు. ఈ విభాగంలో విజేతలకు గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ప్రైజ్ మనీ అందుతుంది.

మూడవది .. అత్యంత ప్రతిష్టాత్మకమైనది `షార్ట్ ఫిల్మ్స్` విభాగం. ఇది కేవలం వృత్తిపరమైన ఫిల్మ్ మేకర్ల కోసం కేటాయించారు. 15 నిమిషాల నిడివి వరకు ఉండే ఈ చిత్రాలలో లోతైన విశ్లేషణ, ఉన్నతమైన నిర్మాణ విలువలు - సినిమాటిక్ అనుభూతికి ప్రాధాన్యత ఇస్తారు. కథనంలో లోతు, దర్శకత్వ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. ఈ విభాగంలో ప్రథమ విజేతలకు ఏకంగా రూ.15 లక్షల భారీ బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పోటీలో పాల్గొనదలచిన వారు తమ ఎంట్రీలను 7 మే 2026 లోపు `వందేభార‌తం150 డాట్ ఇన్‌` వెబ్‌సైట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. దేశభక్తిని, ఆధునిక సాంకేతికతను మేళవించి సరికొత్త దృశ్యకావ్యాలను ఆవిష్కరించేందుకు ఇదొక అద్భుతమైన వేదిక. `వందేమాతరం` 150 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా మన జాతీయ వారసత్వానికి గౌరవం అందించడమే కాకుండా... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం కూడా కలుగుతుంది.

ఉత్సాహం ఉన్నా ప్ర‌య‌త్నించ‌క‌పోతే..

క్రియేటివ్ రంగంలో రాణించాల‌ని చాలా మందికి ఉత్సాహం - ఆశ ఉంటాయి. కానీ ప్రాక్టిక‌ల్ గా అవ‌కాశం ల‌భించినప్పుడు నిరూపించ‌క‌పోతే అలాంటి వారికి అవ‌కాశాలు మృగ్యం. ప్ర‌తి ల‌ఘు చిత్ర పోటీలో త‌మ సినిమా ఎంట్రీ ఉంటే, అది ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో క్రాస్ చెక్ చేసుకోవ‌చ్చు. కానీ చాలా మంది ఉబ‌లాట‌పడినంత‌గా ప్రాక్టికాలిటీ లేక సృజ‌నాత్మ‌క రంగంలో ఎలాంటి రిజ‌ల్ట్ లేకుండా మిగిలిపోతున్నార‌ని చెప్పొచ్చు.

Tags:    

Similar News