తరతరాల భారానికి ముగింపు.. రష్మిక మందన్న ఘాటు వ్యాఖ్యలు
తల్లిదండ్రుల పెంపకం, పిల్లలపై ఉండే అంచనాలు.. భావోద్వేగ వారసత్వంపై నటి రష్మిక మందన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు సమాజంలో కొత్త చర్చకు దారితీశాయి.;
తల్లిదండ్రుల పెంపకం, పిల్లలపై ఉండే అంచనాలు.. భావోద్వేగ వారసత్వంపై నటి రష్మిక మందన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు సమాజంలో కొత్త చర్చకు దారితీశాయి. పిల్లలు పుట్టడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు... అది మనం తీసుకునే ఒక `స్వార్థపూరిత నిర్ణయం` అని ఆమె పేర్కొన్నారు. మన వారసత్వాన్ని కొనసాగించడం కోసం మనం పిల్లలకు జన్మనిస్తామని..అంతేకానీ మన అంచనాలను వారిపై రుద్ది వారిని మానసిక ఒత్తిడికి (ట్రామా) గురిచేయకూడదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు కేవలం సెలబ్రిటీ మాటలుగా కాకుండా.. ప్రతి ఇంట్లో కనిపించే పెను ఉత్పాతాన్ని ప్రశ్నించడంగానే చూడాలి.
చాలా సందర్భాల్లో పిల్లలు తమ తల్లిదండ్రుల నెరవేరని కలలకు ప్రతిరూపాలుగా మారుతుంటారు. తల్లిదండ్రులు తాము సాధించలేని విషయాలను పిల్లల ద్వారా సాధించాలని చూడటం లేదా తమకు ఎదురైన కష్టాలను పిల్లలు కూడా అర్థం చేసుకోవాలని ఆశించడం సహజమైపోయింది. అయితే రష్మిక చెప్పినట్లుగా పిల్లలు తల్లిదండ్రుల భావోద్వేగ భారాలను మోయడానికి పుట్టరు. వారు ఒక స్వతంత్ర వ్యక్తిత్వంతో పెరుగుతారని..వారిని ఒక సాధించే వస్తువుగా చూడకూడదనే స్పృహ నేటి తరంలో పెరుగుతోంది.
సాంప్రదాయ పెంపకంలో పిల్లలకు విలువల పేరుతో తరచుగా తమ ఇష్టాయిష్టాలను త్యాగం చేయాలని బోధిస్తారు. కానీ.. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు ఎదుర్కొన్న గత కాలపు బాధలు.. అభద్రతాభావాలు తెలియకుండానే పిల్లలకు బదిలీ అవుతుంటాయి. దీనినే `జనరేషనల్ ట్రామా` అంటారు. అంటే ఒక తరం అనుభవించిన బాధలను పరిష్కరించుకోకుండా అలాగే ఉంచితే.. అవి తర్వాతి తరానికి భారంగా మారుతాయి. రష్మిక మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మనం మన గాయాలను నయం చేసుకున్న తర్వాతే.. పిల్లలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని ఇవ్వాలనేది రష్మిక ఉద్ధేశం.
పితృత్వం లేదా మాతృత్వాన్ని కేవలం ఒక బాధ్యతగా కాకుండా ఒక ఎంపికగా చూడాలని రష్మిక వాదించారు. ``పిల్లలు పుట్టమని అడగరు.. మనమే వారిని ఈ లోకంలోకి తీసుకువస్తాము`` అన్న మాట నిజానికి తల్లిదండ్రులపై ఉండే జవాబుదారీతనాన్ని గుర్తుచేస్తోంది. పిల్లలను తమ సొంత ఆశయాలు లక్ష్యాల పొడిగింపుగా కాకుండా.. వారి ఇండివిడ్యువాలిటీని గౌరవించినప్పుడే ఒక ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రేమ అనేది విజయాల ద్వారా పొందే బహుమతి కాకూడదు.. అది సహజంగా లభించే హక్కు కావాలి అని రష్మిక సూచించారు.
రష్మిక మందన్న వ్యక్తం చేసిన అభిప్రాయం సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. పిల్లలను కనడం అనేది కేవలం వంశాభివృద్ధి మాత్రమే కాదు.. అది ఒక కొత్త జీవితానికి ఇచ్చే స్వేచ్ఛ కావాలి. తల్లిదండ్రుల ఎమోషన్స్ అన్నిటికీ చికిత్స చేసే డాక్టర్లుగా పిల్లలు మారాల్సిన అవసరం లేదు. ప్రతి బిడ్డ తనదైన రీతిలో ఎదిగేందుకు.. తన సొంత కలలను నిజం చేసుకునేందుకు అవసరమైన మానసిక ప్రశాంతతను అందించడం తల్లిదండ్రుల బాధ్యత. ఈ తరంతోనే పాత తరం బాధలు ముగిసిపోవాలని ఆకాంక్షించడమే నిజమైన మార్పు.
రష్మిక మందన్న ఇటీవలే స్టార్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట నడుమ అన్యోన్యత అనురాగం అభిమానుల్లో చర్చకు వస్తున్నాయి. ఈ జంట ఇకపై కుటుంబాన్ని పెంచి పోషించేందుకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో పిల్లలు పుట్టడం అనే ఎంపికపై రష్మిక వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. రష్మిక ప్రస్తుతం విజయ్ తో కలిసి `రణబలి` అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.