బ్రూస్‌లీ నీడ నుంచి బయటపడిన ఏకైక యాక్షన్ హీరో!
1973లో మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్ లీ మరణం తర్వాత.. చిత్ర పరిశ్రమలో ఒక వింతైన ధోరణి మొదలైంది.;
1973లో మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్ లీ మరణం తర్వాత.. చిత్ర పరిశ్రమలో ఒక వింతైన ధోరణి మొదలైంది. దీనిని `బ్రూస్‌ప్లోయిటేషన్` అని పిలిచారు. హాంకాంగ్, తైవాన్ దేశాల్లో దర్శకులు బ్రూస్ లీ పోలికలున్న నటుల కోసం వెతుకుతూ.. అతడి శైలిని అనుకరించే సినిమాలు తీయడం ప్రారంభించారు. అయితే ఆ సమయంలో స్టంట్ మెన్‌గా కెరీర్ ప్రారంభించిన జాకీ చాన్ మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ``నేను మరో బ్రూస్ లీ అవ్వాలని అనుకోలేదు.. మొదటి జాకీ చాన్ అవ్వాలనుకున్నాను`` అని ప్రకటించారు. బ్రూస్ లీ వెండితెరపై అజేయమైన శక్తికి, గంభీరతకు ప్రతీకగా నిలిస్తే.. జాకీ చాన్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా తనకంటూ ఒక సొంత మార్గాన్ని ఏర్పరచుకున్నారు.
తొలినాళ్లలో `న్యూ ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ`వంటి సినిమాలతో జాకీ చాన్ ను బ్రూస్ లీ లాగా మార్చాలని పరిశ్రమ ప్రయత్నించింది. కానీ ఆ గంభీరమైన పాత్రలు జాకీ చాన్ నైజానికి నప్పలేదు. బ్రూస్ లీ పాత్రలు దెబ్బలు తగిలినా చలించని స్థితప్రజ్ఞతను చూపిస్తే... జాకీ చాన్ మాత్రం దెబ్బ తగిలినప్పుడు నొప్పితో విలవిల్లాడటం.. భయపడటం, తడబడటం వంటివి చేస్తూ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించేవారు. ఈ బలహీనతలే ఆయనకు అతిపెద్ద బలంగా మారాయి. 1978లో విడుదలైన `స్నేక్ ఇన్ ది ఈగిల్స్ షాడో`, `డ్రంకెన్ మాస్టర్` సినిమాలతో మార్షల్ ఆర్ట్స్‌కు హాస్యాన్ని జోడించి.. యాక్షన్ కామెడీ అనే కొత్త జానర్‌కు ఆయన శ్రీకారం చుట్టారు.
జాకీ చాన్ సృష్టించిన `ఎవ్రీమేన్ హీరో` ఇమేజ్ ఆయనను ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలకు దగ్గర చేసింది. ఆయన పాత్రలు ఎప్పుడూ అజేయంగా ఉండవు.. తరచుగా ప్రత్యర్థుల కంటే తక్కువ ఎనర్జీతో అసమర్థంగా కనిపిస్తూనే.. పట్టుదల, తెలివితేటలతో విజయం సాధిస్తాయి. ఈ క్రమంలో అతడు చేసిన సాహసాలు సాటిలేనివి. 1980లో `ది యంగ్ మాస్టర్` నుంచి మొదలుపెట్టి `పోలీస్ స్టోరీ`, `ప్రాజెక్ట్ ఏ` వంటి సినిమాల్లో ప్రాణాలకు తెగించి స్వయంగా స్టంట్స్ చేశారు. భవనాలపై నుంచి దూకడం.. క్లాక్ టవర్ నుంచి వేలాడటం వంటి సీన్లలో సీజీఐ వాడకుండా అతడు చూపించిన అంకితభావం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
జాకీ చాన్ సినిమాల్లో హాస్యం అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. అది యాక్షన్‌లో అంతర్భాగం. బ్రూస్ లీ యుద్ధ తంత్రానికి ప్రాధాన్యత ఇస్తే..జాకీ చాన్ గందరగోళం - ఆశువుగా దొరికిన వస్తువులను ఆయుధాలుగా మార్చుకోవడంపై దృష్టి పెట్టారు. నిచ్చెనలు, కుర్చీలు, టేబుల్స్ వంటి రోజువారీ వస్తువులతో ఆయన చేసే ఫైట్స్ ఒక అందమైన కొరియోగ్రఫీలా సాగుతాయి. 1998లో క్రిస్ టక్కర్‌తో కలిసి నటించిన `రష్ అవర్` సినిమాతో ఈ ఫార్ములాను అమెరికన్ ప్రేక్షకులకు పరిచయం చేసి.. హాలీవుడ్‌లో తనకంటూ ఒక తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు.
జాకీ చాన్ కేవలం ఒక నటుడిగానే కాకుండా.. తూర్పు- పశ్చిమ దేశాల సంస్కృతులను కలిపే ఒక వారధిగా నిలిచారు. బ్రూస్ లీ పాశ్చాత్య దేశాలకు మార్షల్ ఆర్ట్స్ తలుపులు తెరిస్తే.. జాకీ చాన్ ఆ తలుపుల గుండా హాస్యం, మానవీయ కోణాలను మోసుకొచ్చారు. నేటి సూపర్ హీరో సినిమాల్లో కూడా పోరాటాల మధ్య జోకులు వేయడం.. పాత్రలు వైఫల్యాలను ఎదుర్కోవడం వంటి అంశాలు జాకీ చాన్ సృష్టించిన ఆ మూస నుంచే వచ్చాయని చెప్పవచ్చు. అనుకరణను కాదని.. తనలోని అసలైన నటుడిని నమ్ముకోవడం వల్లే ఆయన ఒక ప్రపంచ స్థాయి ఆదర్శనటుడిగా ఎదిగారు.