నానికి పెద్దాయ‌న మాటిచ్చాడ‌ట‌గా!

Update: 2016-02-10 19:30 GMT
పాత్ర డిమాండ్ చేసింది కాబ‌ట్టి కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌లో నాని చేతికి జై బాల‌య్య అని టాటూ వేయించుకొన్నాడు కానీ... వ్య‌క్తిగ‌తంగా టాటూ వేయించాల‌నుకొంటే మాత్రం క‌చ్చితంగా మ‌ణిర‌త్నం పేరు రాయించుకొంటాడేమో! ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం అంటే నానికి అంత ఇష్టం మ‌రి!   ఆయ‌నతో ఎప్పుడు మాట్లాడినా మణిర‌త్నం ప్ర‌స్తావ‌న త‌ప్ప‌కుండా వ‌స్తుంటుంది. చిన్న‌ప్పట్నుంచే మ‌ణిర‌త్నం సినిమాల్ని పిచ్చ‌పిచ్చగా చూసేవాడ‌ట నాని. ఆయ‌న్ని స్ఫూర్తిగా తీసుకొనే ద‌ర్శ‌కుడిగా మారాల‌నుకొన్నాడట‌.

స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప్ర‌యాణం కొన‌సాగిస్తూనే అనుకోకుండా క‌థానాయ‌కుడ‌య్యాడు నాని. హీరో అయిన‌ప్ప‌ట్నుంచి మ‌ణిర‌త్నం సినిమాలో న‌టించాల‌నేది నా క‌ల అని చెబుతూ వ‌స్తున్నాడు.  కానీ తొలి నాళ్ల‌లో ఆ మాట విన్న‌వాళ్లంతా మ‌ణిర‌త్నం దృష్టి నానిపై ఎప్పుడు ప‌డాల్లే అని లైట్‌ గా తీసుకొనేవాళ్లు. అయితే అనూహ్యంగా ఓకే బంగారం సినిమాకి డ‌బ్బింగ్ చెప్పే అవ‌కాశం నానికి రావ‌డంతో ఆయ‌న‌కి మ‌ణిర‌త్నంతో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ్డాయి. నాని గురించి, ఆయ‌న న‌ట‌న గురించి తెలుసుకొన్న మ‌ణిర‌త్నం మ‌నిద్ద‌రం క‌లిసి త‌ప్ప‌కుండా ఓ సినిమా చేద్దాం అని చెప్పాడ‌ట‌. మ‌ణిగారు మాటిచ్చారు కాబ‌ట్టి ఎప్ప‌టికైనా ఆయ‌న‌తో సినిమా ఉంటుందంతే అని ధీమాగా చెబుతున్నాడు నాని. ఒక‌వేళ నాని ఆ అవ‌కాశం అందుకొంటే మాత్రం ఆయ‌న స్థాయి మ‌రికొంచెం పెరుగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News