ట్రైలర్ టాక్ : 'మర్డర్' చేయించడం తప్పా...?

Update: 2020-07-28 05:45 GMT
కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ వాస్తవ సంఘటల ఆధారంగా సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో 'మర్డర్' అనే సినిమా తీస్తున్నానని.. ఇది 'కుటుంబ కథా చిత్రమ్‌' అని పేర్కొన్నారు వర్మ. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ తాజాగా ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్ రిలీజ్ చేసారు. అగ్ర కులానికి చెందిన అమ్మాయి కులాంతర వివాహం చేసుకున్న తదనంతర పరిస్థితులను ఈ చిత్రంలో వర్మ చూపిస్తున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. కూతురిపై ప్రేమ - సమాజంలో పరువు గురించి ఆలోచిస్తూ వాటి మధ్య నలిగిపోయిన తండ్రి మానసిక వేదనే ఈ మూవీ అని తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో యావత్ భారతదేశానికి షాక్ ఇచ్చిన ఒక ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమని వర్మ చెప్పుకొచ్చాడు. ''పిల్లల్ని ప్రేమించడం తప్పా?.. తప్పు చేస్తే దండించడం తప్పా?.. వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా?.. పిల్లల్ని కనగలం గాని వారి మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి'' అనే ప్రశ్నలను సందిస్తున్నాడు.

''మర్డర్'' సినిమా ఏ ఇన్సిడెంట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో వర్మ వెల్లడించనప్పటికీ రెండేళ్ల క్రితం తెలంగాణాలో చోటు చేసుకున్న దుర్ఘటన ఆధారంగా రూపొందిన సినిమా అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మిర్యాలగూడకు చెందిన కూతురు అమృత.. ప్రణయ్‌ అనే వ్యక్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవడం వల్ల తన పరువు పోయిందని అల్లుడిని దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. అయితే మారుతీరావు కూడా ఆ మధ్య ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇప్పుడు ఇదే రామ్ గోపాల్ వర్మకి కథా వస్తువు అయింది. ఇప్పటికే వివాదాస్పద చిత్రాలు తెరకెక్కించే డైరెక్టర్ అనే పేరున్న వర్మ మరో వివాదానికి తెరలేపాడని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. కాగా 'మర్డర్' చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు క్విటీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. శ్రీకాంత్ అయ్యంగార్ - సాహితి - భార్గవి ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో ఈ చిత్రం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది.Full View
Tags:    

Similar News