యూనిక్ లుక్: `రామాయణం` కోసం రణబీర్ భారీ ప్రయోగం!
భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన `రామాయణ` చిత్రంలో శ్రీరాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ మేకోవర్ సంచలనం సృష్టిస్తోంది.;
భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన `రామాయణ` చిత్రంలో శ్రీరాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ మేకోవర్ సంచలనం సృష్టిస్తోంది. అతడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. యానిమల్ చిత్రంలో లుక్ కి ఇప్పటికి చాలా ఛేంజ్ కనిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు. అయితే ఇదేమీ ఆషామాషీగా రాలేదు. దానికోసం అతడు చాలా కసరత్తులు చేసాడు. ఈ కసరత్తులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 43 ఏళ్ల వయస్సులో రణబీర్ తన శరీరాకృతిని మార్చుకోవడానికి కేవలం సాధారణ జిమ్ వర్కవుట్లపై ఆధారపడకుండా, `హోలిస్టిక్ ఫిట్‌నెస్` అనే కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడితో పాటు పరశురాముడి పాత్రలోనూ కనిపించాల్సి ఉండటంతో అందుకు తగిన బలం, చురుకుదనం, మానసిక దృఢత్వం కోసం అతడు కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌లో రణబీర్ లుక్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
రణబీర్ కోచ్ నమ్-వుక్ కాంగ్ పర్యవేక్షణలో ఈ శిక్షణ సాగుతోంది. ఇందులో ప్రధానంగా `కాలిస్థెనిక్స్` అనే బాడీవెయిట్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా గాలిలో వేలాడుతూ చేసే మిడ్-ఎయిర్ కాలిస్థెనిక్స్ రొటీన్ ద్వారా రణబీర్ తన శరీర సమతుల్యతను , కండరాల సమన్వయాన్ని పెంచుకుంటున్నారు. దీనికి తోడు `క్లాప్ పుల్-అప్స్` వంటి అడ్వాన్స్‌డ్ వ్యాయామాల ద్వారా ఎగువ శరీరంలో అసాధారణమైన శక్తిని, వేగాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇవి కేవలం చూడటానికి బాగుండటమే కాకుండా.. శరీరానికి నిజమైన బలాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
శక్తి సామర్థ్యాలను పెంచుకోవడంలో భాగంగా రణబీర్ `రోమన్ రింగ్ మజిల్-అప్స్` వంటి కఠినమైన కసరత్తులు చేస్తున్నారు. ఇవి ఛాతీ, భుజాలు, కోర్ కండరాలపై ఏకకాలంలో ప్రభావం చూపుతాయి. అలాగే `కెటిల్‌బెల్` వర్కవుట్లను తన దినచర్యలో భాగం చేసుకున్నారు. సంప్రదాయ బరువుల కంటే కెటిల్‌బెల్స్ వాడటం వల్ల శరీర స్థిరత్వం పెరగడమే కాకుండా.. నిమిషానికి 20 కేలరీల వరకు ఖర్చవుతాయి. ఇది కొవ్వును తగ్గించి, శరీరాన్ని దృఢంగా మార్చడానికి ఎంతగానో దోహదపడుతుంది.
జిమ్ లోపల చేసే వ్యాయామాలకే పరిమితం కాకుండా రణబీర్ అవుట్‌డోర్ ట్రైనింగ్‌కు కూడా సమాన ప్రాధాన్యతనిస్తున్నారు. గుండె ఆరోగ్యం , స్టామినా కోసం క్రమం తప్పకుండా రన్నింగ్, సైక్లింగ్‌ను అనుసరిస్తున్నారు. అలాగే ఎత్తుపల్లాలతో కూడిన కఠినమైన ప్రాంతాల్లో హైకింగ్ చేయడం ద్వారా మానసిక దృఢత్వాన్ని.. కింది శరీరం లో బలాన్ని పెంచుకుంటున్నారు. కఠినమైన శిక్షణ తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి .. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడానికి స్విమ్మింగ్‌ను ఒక రికవరీ వ్యాయామంగా రణబీర్ వాడుతున్నారు.
మొత్తానికి రణబీర్ కపూర్ ఫిట్‌నెస్ ప్లాన్ అనేది కేవలం కండలు పెంచడం కోసం కాకుండా.. శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా .. శక్తివంతంగా మార్చుకోవడం కోసం రూపొందించారు. బలం (కాలిస్థెనిక్స్), ఓర్పు (రన్నింగ్, హైకింగ్), పవర్ (బాటిల్ రోప్స్) , రికవరీ (స్విమ్మింగ్) వంటి అన్ని అంశాలను కలగలిపి అతడు చేస్తున్న ఈ ప్రయోగం నిజంగా ప్రశంసనీయం. ఈ స్థాయి అంకితభావం చూస్తుంటే.. వెండితెరపై రాముడి పాత్రలో రణబీర్ తన నటనతో.. లుక్‌తో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.