హీరోయిన్ల రెమ్యూనరేషన్లు తగ్గుతున్నాయా? కారణమేంటి?
టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్లపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.;
టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్లపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో ఒకటి లేదా రెండు చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన కొందరు హీరోయిన్లు.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వీరి హీట్ పుట్టించే ఫోటోలు, గ్లామర్ పోస్టులు తరచుగా కనిపిస్తూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వీరి కెరీర్ గ్రాఫ్ పై, అలాగే పారితోషికాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. అయితే గతంలో ఒకటి రెండు హిట్లు సాధించిన కొంతమంది హీరోయిన్లు, నిర్మాతలు సంప్రదించినప్పుడు ఒక్క సినిమాకు కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి మారిపోవడంతో, నిర్మాతలు అంత భారీ మొత్తాలు చెల్లించడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో వారికి కొత్త అవకాశాలు తగ్గుతున్నాయని తెలుస్తోంది.
నిజానికి ఒక హీరోయిన్ కు మార్కెట్ ఉండాలంటే వరుసగా సినిమా అవకాశాలు రావడం చాలా ముఖ్యం. కానీ ఎక్కువ పారితోషికం ఆశిస్తూ అవకాశాలను వదులుకుంటే, తర్వాత అవకాశాలు దొరకని పరిస్థితి వస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కొంత మంది నిర్మాతలు తక్కువ బడ్జెట్ సినిమాలపై దృష్టి పెట్టడంతో, హీరోయిన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా గణనీయంగా తగ్గించాలనే ఆలోచనలో ఉన్నారట.
మరోవైపు ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి వచ్చే ఆదాయం కూడా గతంతో పోలిస్తే తగ్గినట్లు సమాచారం. థియేటర్లలో కూడా కలెక్షన్లు ఆశించినంతగా రాకపోవడంతో, నిర్మాతలు ఖర్చు తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రభావం మొదటగా హీరోయిన్ల పారితోషికాలపై పడుతుందని వినికిడి. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఒక్కో హీరోయిన్ కు 8 నుంచి 15 లక్షల మధ్యే పారితోషికం ఇవ్వాలని భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న హీరోయిన్ల కు అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మరాఠీ, కన్నడ వంటి ఇతర భాషల నుంచి వచ్చిన కొత్త వాళ్ళు తక్కువ పారితోషికంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. దీంతో వారు ఒకేసారి మూడు నుంచి నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో, ఓ హీరో లేదా నిర్మాత అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ పారితోషికం ఇచ్చి హీరోయిన్ ను తీసుకుంటారని, కానీ అది తాత్కాలికమేనని చెప్పాలి.
అలాంటి ఒకటి రెండు అవకాశాలు వచ్చినా, అదే పరిస్థితి మళ్లీ రిపీట్ అవ్వొచ్చు. మొత్తానికి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఖర్చులను నియంత్రించే దిశగా మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పుల్లో భాగంగా హీరోయిన్ల పారితోషికాలు కూడా తగ్గే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ డిమాండ్లను మార్చుకుంటేనే హీరోయిన్లు వరుస అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశముంది. మరేం జరుగుతుందో చూడాలి.