'కల్ట్' మూవీ రివ్యూ

Update: 2026-10-30 13:24 GMT

‘కల్ట్’ మూవీ రివ్యూ

నటీనటులు: విశ్వక్సేన్- గాయత్రి భరద్వాజ్-తారక్ పొన్నప్ప- మురళీ శర్మ- శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సంగీతం: రవి బస్రూర్

ఛాయాగ్రహణం: అరవింద్ విశ్వనాథన్

మాటలు: తరుణ్ భాస్కర్

నిర్మాత: సందీప్ కాకరాల

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: విశ్వక్సేన్

విశ్వక్సేన్ టాలెంటెడ్ యాక్టరే కాదు.. డైరెక్టర్ కూడా. అతను ఇప్పటికే ‘ఫలక్ నుమా దాస్’.. ‘దాస్ కా ధమ్కీ’ అనే రెండు సినిమాలు తీశాడు. అవి ఒక మోస్తరు ఫలితాలను అందుకున్నాయి. ఇప్పుడు హీరోగా వరుస ఫెయిల్యూర్లు ఎదురవుతున్న దశలో అతను స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘కల్ట్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి తన ఫ్లాప్ స్ట్రీక్ కు ‘కల్ట్’ బ్రేకులేసేలా ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ:

గోవాలో ‘కల్ట్’ అనే క్లబ్బులో మినిస్టర్ కొడుకైన ఎల్విన్ (తారక్ పొన్నప్ప).. తన పుట్టిన రోజుకు భారీ పార్టీ ఇస్తుంటాడు. స్పెషల్ పాసులు ఉంటే తప్ప ఇందులోకి ప్రవేశం దక్కదు. ఎల్విన్ స్నేహితులతో పాటు పాసులు సంపాదించిన వాళ్లంతా ఆ పార్టీకి హాజరవుతారు. కానీ అందరూ ఒకచోట చేరాక.. డోర్లకు తాళాలు పడిపోతాయి. ఎవ్వరూ బయటికి అడుగుపెట్టలేని విధంగా బయట ఆర్డీఎక్స్ పెట్టిన ఒక అజ్ఞాత వ్యక్తి తన మనుషులతో లోపలున్న వాళ్లలో ఒక్కొక్కరిని కిరాతకంగా చంపించడం మొదలుపెడతాడు. దీంతో ఎల్విన్ తో పాటు అతడి మిత్ర బృందాన్ని ఎలా కాపాడాలో తెలియక బయట మినిస్టర్.. పోలీసులు తలలు పట్టుకుంటారు. అప్పుడే క్లబ్బు లోపల సస్పెండైన డీఎస్పీ సంకల్ప్ (విశ్వక్సేన్) ఉన్నట్లు పోలీసులకు తెలుస్తుంది. ఎలాగోలా కష్టపడి అతణ్ని కాంటాక్ట్ చేసి అందరినీ కాపాడే బాధ్యతను తన మీద పెడతారు పోలీసులు. మరి సంకల్ప్.. ఎల్విన్ అతడి మిత్ర బృందాన్ని కాపాడాడా.. ఇంతకీ ఈ హత్యలన్నీ చేయిస్తోందెవరు.. దానికి కారణమేంటి.. ఆ మిస్టరీని సంకల్ప్ ఛేదించాడా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

తెర మీద ఒక వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగితే.. అది చూసి మనం కదిలిపోవాలి. తన బాధ చూసి మనకు కసి రగలాలి. అతను పగతీర్చుకుంటుంటే మనకు కిక్కు రావాలి. ఈ రకమైన ఎమోషన్ ప్రేక్షకుల్లోకి ఎక్కితే.. తెర మీద ఎంత వయొలెన్స్ చూపించినా.. ఎన్ని తలలు తెగిపడినా రీజనబుల్ గానే అనిపిస్తుంది. ఆడియెన్సుని కన్విన్స్ చేయకుండా తెర మీద విచ్చలవిడిగా హింసను చూపిస్తే.. డోకు వస్తుంది తప్ప ఎమోషన్ పండదు. ‘కల్ట్’ సినిమాలో అదే జరిగింది. ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ ఫిలిం అంటూ ప్రమోట్ చేసిన ‘కల్ట్’లో భరించలేని అల్ట్రా వయొలెంట్ సీన్లున్నాయి. సినిమా నిండా కత్తులు పట్టుకుని మనుషుల్ని ఖండఖండాలుగా నరికే సన్నివేశాలే కనిపిస్తాయి. హద్దులు దాటిన హింసలో ‘ది ప్యారడైజ్’ 2ఎక్స్ అనుకుంటే.. ఇది 10ఎక్స్ అన్నమాట. కానీ ఆ వయొలెన్స్ వెనుక ఎమోషన్ మాత్రం మినిమం లెవెల్లో కూడా పండకపోవడంతో ‘కల్ట్’ చూస్తున్నంతసేపు కడుపులో దేవుతున్న ఫీలింగే కలుగుతుంది.

‘కల్ట్’ ప్రోమోలు చూసినపుడే ఇది కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా అని అర్థమైపోతుంది. ఐతే ‘స్క్విడ్ గేమ్’లో వయొలెన్స్ వెనుక బలమైన రీజన్ ఉంటుంది. అక్కడ ఆడే గేమ్ ఎంతో ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది. తెర మీద క్యారెక్టర్ల తరహాలోనే మనమూ భయపడతాం. వాళ్ల తాలూకు ఉత్కంఠనూ మనమూ అనుభవిస్తాం. ఈ క్రమంలో వచ్చే వయొలెన్స్ కూడా ఎబ్బెట్టుగా అనిపించదు. కానీ ‘స్క్విడ్ గేమ్’ కాన్సెప్టును తెలుగైజ్ చేస్తూ విశ్వక్సేన్ తీసిన ‘కల్ట్’లో మాత్రం ఎక్కడా ఎమోషన్ అన్నదే లేదు. ఉత్కంఠకూ ఛాన్స్ లేదు. ఒక క్లబ్బులో ఇరుక్కుపోయిన వ్యక్తుల్లో ఒక్కొక్కరిని దారుణాతి దారుణంగా చంపేస్తుంటే.. ఏదో తమాషా గేమ్ నడుస్తున్నట్లు ఉంటుందే తప్ప.. భయం-ఉత్కంఠకు అవకాశం లేకపోయింది. అవయవాలు తెగిపడే సీన్లు చాలా కృత్రిమంగా.. జుగుప్ప కలిగేలా తీయడం.. కథ ఏమాత్రం ముందుకు కదలకుండా ఎంతసేపూ ఆ సీన్లే రిపీట్ అవుతుండడంతో ‘కల్ట్’ తొలి గంటలో తీవ్ర అసహనం కలిగిస్తుంది. చాలా లేటుగా హీరో పాత్ర ఎంట్రీ ఇచ్చాక కొంత ఉత్సాహం వస్తుంది కానీ.. కాసేపు ఎంగేజ్ చేసే ఆ పాత్ర కూడా తర్వాత గుంపులో గోవిందయ్యలా తయారవుతుంది. గేమ్ లో ఒక్కో రౌండు వస్తుంటుంది. మనుషులు రకరకాలుగా చస్తుంటారు. తెరంతా రక్తంతో తడిసిపోతుంటుంది. ఆ ఘోరాలన్నీ చూడలేక కాసేపు కళ్లు మూసుకుని మళ్లీ తెరిచినా కథ మాత్రం ముందుకు కదలదు. అక్కడే ఉంటుంది.

ఇంటర్వెల్ తర్వాత కూడా చాలాసేపు ఇలాగే ఫ్రస్టేట్ చేశాక చివరి ముప్పావు గంటలో అసలు కథలోకి తీసుకెళ్లాడు విశ్వక్సేన్. ట్విస్టులు ఒక్కొక్కటి రివీల్ చేయడం మొదలుపెట్టాక ‘కల్ట్’ కొంచెం ఎంగేజ్ చేస్తుంది. దశల వారీగా చూపించిన సైకో క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఓకే అనిపిస్తుంది. హత్యలు చేసే వాళ్లను హీరో కౌంటర్ చేసే ఎపిసోడ్ కూడా బాగానే డీల్ చేశారు. కానీ ఈ హత్యల వెనుక అసలు కారణం తెలిశాక మాత్రం అందులో ఎంతమాత్రం లాజిక్ కనిపించదు. ఒక పాత్రకు జరిగిన నష్టం ఎంత.. అతను బదులుగా చేస్తున్న నష్టం ఎంత అని ఆలోచించి చూస్తే ఈ కథ అర్థరహితంగా అనిపిస్తుంది. ప్రతీకారం తీర్చుకునే పాత్ర మీద ప్రేక్షకులకు ఆపేక్ష కలగనపుడు.. తనతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడనపుడు పేఆఫ్ సీన్లు పండవు. ‘కల్ట్’లో కూడా అదే జరిగింది. చివరి ముప్పావు ‘కల్ట్’ కొంచెం ఎంగేజింగ్ గానే నడిచినప్పటికీ.. అంతకుముందు కలిగిన అసహనాన్ని భర్తీ చేసే స్థాయిలో అయితే సినిమా లేదు. బలమైన ఎమోషన్ లేకపోయినా అల్ట్రా వయొలెంట్ సీన్లను ఎంజాయ్ చేస్తాం అనుకున్న వాళ్లే ‘కల్ట్’ వైపు చూడాలి. బాబోయ్ హింస అనుకునేవాళ్లు దీనికి దూరంగా ఉండాల్సిందే.

నటీనటులు:

టిపికల్ పోలీసాఫీసర్ పాత్రలో విశ్వక్సేన్ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అగ్రెసివ్ క్యారెక్టర్లలో విశ్వక్ ఎప్పుడూ బాగానే చేస్తాడు కాబట్టి.. ఇది అతడికి కొట్టిన పిండే. యాటిట్యూడ్ చూపించే సీన్లలో విశ్వక్ అదరగొట్టాడు. తన లుక్ బాగుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ పొన్నప్ప రొటీన్ గా అనిపిస్తాడు. సినిమాలో చాలా వరకు అతను పిచ్చి అరుపులు అరవడం తప్ప ఏం చేయడు. ఆఖరి సన్నివేశాల్లో మాత్రం తారక్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గాాయత్రి భరద్వాజ్.. ఇటు నటనలో అటు గ్లామర్ విషయంలో.. ఏ రకంగానూ ఆకట్టుకోలేదు. సినిమాలోని మిగతా పాత్రల్లో ఒకటిలాగే అనిపిస్తుంది తప్ప తన క్యారెక్టర్లో ఏ ప్రత్యేకతా లేదు. మంత్రి పాత్రలో మురళీ శర్మ ఓకే. శ్రీకాంత్ అయ్యంగార్ అవసరానికి మించిన నటనతో అసహనం కలిగించాడు. మిగతా ఆర్టిస్టులు పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

‘కల్ట్’కు సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. పాటల్లేని ఈ సినిమాలో రవి బస్రూర్ బీజీఎం ఆకట్టుకుంటుంది. సినిమా థీమ్ కు తగ్గట్లు స్టైలిష్ స్కోర్ ఇచ్చాడు రవి. ద్వితీయార్ధంలోని కొన్ని సన్నివేశాల్లో బీజీఎం ఊపు ఇస్తుంది. అరవింద్ విశ్వనాథన్ కెమెరా పనితనం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఒకే. తరుణ్ భాస్కర్ డైలాగులు రాశాడు అంటే ఏదో స్పెషాలిటీ ఉంటుందనుకుంటాం. కానీ కొన్ని పంచులు పేలినా.. చాలా వరకు సంభాషణలు సాధారణంగా అనిపిస్తాయి. ఇక స్క్రిప్ట్ రైటర్- డైరెక్టర్ విశ్వక్సేన్ విషయానికి వస్తే.. తన చివరి డైరక్టోరియల్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’లో మాదిరే ఇక్కడ కూడా ట్విస్టుల మీద.. అలాగే బ్యాక్ స్టోరీ మీద ఎక్కువ ఆధారపడ్డాడు. కానీ తాను తీసిన తొలి రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో సరైన పాత్రలు- సన్నివేశాలు రాసుకోలేకపోయాడు. ఏమాత్రం ఎమోషన్ లేకుండా హింసాత్మక సన్నివేశాలను పేర్చుకువెళ్లడంతో ‘కల్ట్’ కంగాళీగా తయారైంది.

చివరగా: కల్ట్.. కనెక్ట్ అవ్వలేని ‘కోత’

రేటింగ్ - 2/5

Tags:    

Similar News