మణికొండలో 1000 గజాలు కొని మర్చిపోయిన డైరెక్టర్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ రౌండర్ ప్రతిభతో తనదైన ముద్ర వేసిన రఘు కుంచె కేవలం గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.;
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ రౌండర్ ప్రతిభతో తనదైన ముద్ర వేసిన రఘు కుంచె కేవలం గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా `పలాస 1978` చిత్రంలో ఆయన ప్రదర్శించిన అద్భుతమైన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టాలీవుడ్‌లో నేపథ్య గాయకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన రఘు కుంచె, పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో అనేక చార్ట్‌బస్టర్ పాటలను ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. సంగీతం, నటన అనే రెండు భిన్నమైన రంగాల్లో రాణిస్తూ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఇటీవల ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ ద్వారా రఘు కుంచె తన సినీ ప్రయాణంలోని మధుర స్మృతులను, ప్రముఖ దర్శకులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే రఘు కుంచె ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తన కెరీర్ ఆరంభ దశలో మణికొండ ప్రాంతంలో ఒక ప్లాట్ కొనుగోలు చేశారట. అయితే వరుస సినిమాలతో తీరిక లేకుండా గడిపిన పూరి.. ఆ తర్వాత కాలంలో తన ప్లాట్ ఎక్కడుందో పూర్తిగా మర్చిపోయారనే విషయాన్ని రఘు కుంచె నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాథ్ వ్యక్తిత్వం ఎంత భోళాగా, సింపుల్‌గా ఉంటుందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనం.
అదే సమయంలో మరో ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. పూరి జగన్నాథ్ మర్చిపోయిన ఆ ప్లాట్ కోసం వెతుకుతున్న తరుణంలోనే అనుకోకుండా దర్శక ధీరుడు రాజమౌళి ఆ ఫ్లాట్ ఎక్కడుందో చెప్పారట. రాజమౌళికి చెందిన ఫ్లాట్ పక్కనే పూరి కూడా కొనుగోలు చేసారు. చెరో 1000 గజాలు (1000 ఎస్.ఎఫ్.టి) కొనుక్కున్నారట. అప్పటి పరిస్థితులను రఘు కుంచె వివరించిన తీరు ఆకట్టుకుంది. టాలీవుడ్ ఇద్దరు దిగ్గజ దర్శకులకు సంబంధించిన ఈ చిన్నపాటి సన్నివేశం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని .. అప్పటి చిత్ర పరిశ్రమ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.
పూరి జగన్నాథ్‌తో తనకున్న స్నేహం తన జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని రఘు కుంచె అదే ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యారు. బంపర్ ఆఫర్, దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాల్లో రఘు కుంచెకు పాడే అవకాశాలను పూరి కల్పించారు. పాటల ఎంపికలో గానీ, సంగీత కూర్పులో గానీ దర్శకులతో కలిసి పనిచేసేటప్పుడు తాను అనుసరించే పద్ధతులు తన కెరీర్‌ను ఎలా తీర్చిదిద్దాయో గత ఇంటర్వ్యూలలో రఘు కుంచె వివరించారు.
గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్న రఘు కుంచె తన లైఫ్ టైమ్ ని సినీరంగానికే అంకితమిచ్చారు. పూరి జగన్నాథ్, రాజమౌళి సహా ఇండస్ట్రీ దిగ్గజ దర్శకులకు ఆయన సన్నిహితుడు. అయితే నవతరం దర్శకులు అతడిలోని ప్రతిభను సద్వినియోగం చేసుకోవాలని, కెరీర్ పరంగా మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిద్దాం.