బైలింగ్వల్స్ ట్రెండ్ మారడానికి గల కారణాలు?

టాలీవుడ్ లో ఒకేసారి రెండు భాషల్లో సినిమాలు చేయ‌డం తెలిసిందే. ఈ విష‌యంలో హీరోలు కూడా ద‌ర్శ‌కుల‌కు అలాగే స‌హ‌కారం అందించేవారు.

Update: 2026-07-25 10:30 GMT

టాలీవుడ్ లో ఒకేసారి రెండు భాషల్లో సినిమాలు చేయ‌డం తెలిసిందే. ఈ విష‌యంలో హీరోలు కూడా ద‌ర్శ‌కుల‌కు అలాగే స‌హ‌కారం అందించేవారు. బైలింగ్వ‌ల్స్ చేయ‌డం అంటే? ఆషామాషీ కాద‌న్న‌ది తెలిసిందే. ఒకే సీన్ ను రెండు భాష‌ల్లో ఏక కాలంలో చేయాల్సి ఉంటుంది. ఆ కార‌ణంగా ద‌ర్శ‌క‌, హీరోల‌తో పాటు మిగా సిబ్బంది అంతే క‌మిట్ మెంట్ తో ప‌ని చేయాల్సి ఉంటుంది. స్టోరీ...హీరో మార్కెట్ ఆధారంగా బైలింగ్వ‌ల్స్ అనేవి తెర‌పైకి వ‌స్తుంటాయి. అయితే ప్రస్తుతం ఆ ట్రెండ్ తెలుగులో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

మారుతున్న కాలం, ప్రేక్షకుల రుచికి తగినట్లుగా మేకర్స్ ఆలోచనా విధానంలో పెద్ద మార్పు వచ్చింది. రెండు పడవల మీద కాలు వేసి ఏ ఒక్క భాషకు పూర్తి న్యాయం చేయలేక.. అసలుసిసలైన నేటివిటీని కోల్పోతున్నామనే వాస్తవాన్ని నిర్మాతలు గ్ర‌హిస్తున్నారు. దీంతో కొంత మంది ద‌ర్శ‌కులు ద్విభాషా చిత్రాలుగా అప్పుడ‌ప్పుడు ముందుకొస్తున్నా? నిర్మాత‌లు ఆస‌క్తి చూపించ‌డం లేదు. దీనివల్ల వచ్చిన ప్రధాన సమస్య ఏమిటంటే? ఒకే సమయంలో రెండు భాషల్లో ఆర్టిస్టులతో షాట్లు తీయడం వల్ల దర్శకుల అసలు క్రియేటివ్ విజన్ దెబ్బతింటోంది.

తెలుగు నటులు తమిళంలోనో? తమిళ హీరోలు తెలుగులోనో? మాట్లాడేటప్పుడు వచ్చే హావభావాలు, లిప్ సింక్ సమస్యలు సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా ఏ ప్రాంతీయ ప్రేక్షకులు కూడా ఆ సినిమాను పూర్తిగా సొంత చిత్రంగా కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ లోపం గుర్తించి టాలీవుడ్ కోలీవుడ్ మేకర్స్ ప్రయోగాలకు స్వస్తి పలుకుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మేకర్స్ ప్యూర్ స్ట్రైట్ సినిమాలు తీసే విధానాన్ని బలంగా అమలు చేస్తున్నారు. ఏ భాషకు చెందిన హీరో అయితే? ఆ ప్రాంతీయ నేటివిటీ, అక్కడి కల్చర్, యాస, భాషకు పూర్తి న్యాయం చేస్తూ స్ట్రైట్ సినిమాను అత్యంత సహజంగా తెరకెక్కించడం ఉత్తమమనే నిర్ణయానికి వ‌స్తున్నారు.

కథ ఎక్కడైతే పుడుతుందో? అక్కడి నేటివిటీని ఏమాత్రం చెడకుండా తీస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం బలపడింది. `బాహుబలి`, `కేజీఎఫ్`, `పుష్ప` వంటి చిత్రాల విజయాల తర్వాత నేటివిటీ స్ట్రాటజీ పై మరింత క్లారిటీ వ‌చ్చింది. ఒకసారి సినిమాను ఏకభాషలో అత్యుత్తమ క్వాలిటీతో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి చేసిన తర్వాత, ఆ చిత్రాలను ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేయడం ద్వారా విడుదల చేయడం సరికొత్త ట్రెండ్‌గా మారింది. డబ్బింగ్ సినిమాలను కూడా నేటి ప్రేక్షకులు ఎంతో? ఆదరిస్తున్నారు.

కాకపోతే కంటెంట్ .. డబ్బింగ్ క్వాలిటీ అద్భుతంగా ఉండాలంతే. రాజమౌళి , సుకుమార్ వంటి దర్శకులు కూడా స్ట్రైట్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర భాషల్లోకి కేవలం అనువదించి విడుదల చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ విధానం వల్ల నిర్మాతలకూ ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతోంది. ఒకే సినిమాను రెండు భాషల్లో విడివిడిగా షూట్ చేయడం వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. ప్రొడక్షన్ పరంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు ఆ తలనొప్పులు తప్పుకోవడంతో పాటు దర్శకులు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్వచ్ఛమైన విజన్‌ను తెరపై ఆవిష్కరించడానికి అవకాశం దొరుకుతోంది. ఇది సినిమా అవుట్‌పుట్‌ను మరింత మెరుగుపరుస్తోంది.

Tags:    

Similar News