మా అమ్మ పై నుంచి చూస్తూనే ఉంటుంది.. గౌరీ ప్రియ ఎమోష‌న‌ల్ స్పీచ్!

సినీ కెరీర్‌లో భారీ స‌క్సెస్ ను అందుకునే క్షణం ఏ నటుడికైనా, నటికైనా ఎంతో ప్రత్యేకం. ఆ ఆనందాన్ని ముందుగా పంచుకోవాలనిపించే వ్యక్తి ఎక్కువ మందికి తల్లిదండ్రులే.

Update: 2026-07-25 11:20 GMT

సినీ కెరీర్‌లో భారీ స‌క్సెస్ ను అందుకునే క్షణం ఏ నటుడికైనా, నటికైనా ఎంతో ప్రత్యేకం. ఆ ఆనందాన్ని ముందుగా పంచుకోవాలనిపించే వ్యక్తి ఎక్కువ మందికి తల్లిదండ్రులే. అయితే ఆ క్షణంలో తల్లి తన పక్కన లేకపోవడం ఎంతటి బాధో, ఆ బాధను మాటల్లో చెప్పలేని భావోద్వేగంగా మార్చేశారు యంగ్ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ. చెన్నై లవ్ స్టోరీ స‌క్సెస్ మీట్ లో మాట్లాడిన ఆమె, సినిమా సక్సెస్ కంటే తన లైఫ్ లో ఒక లోటు ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. తన తల్లి భౌతికంగా తనతో లేకపోయినా, ప్రతి స‌క్సెస్ ను పైనుంచి చూస్తూ ఆశీర్వదిస్తోందనే నమ్మకమే తనకు బలమని ఆమె ఎంతో ఎమోష‌న‌ల్ గా వెల్లడించారు.

సెట్స్‌లో పనిచేసే టైమ్ లో చాలా మంది తనను తల్లి లాగే ఆదరిస్తూ, ధైర్యం చెప్పేవారని గౌరీ ప్రియ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు సినిమా స‌క్సెస్ అయ్యాక ఈ సక్సెస్‌ను మీ అమ్మ చూసి ఉంటే ఎంత సంతోషించేదో అని అందరూ చెబుతున్నారని, కానీ తనకు మాత్రం అమ్మ ఎక్కడో దూరంలో లేదని, తన ప్రతి అడుగును చూస్తూనే ఉందనే నమ్మకం ఉందని అన్నారు. ఈ స‌క్సెస్ ను పూర్తిగా తన తల్లికే అంకితం చేస్తున్నానని, ఆమె ఇచ్చిన పెంపకమే తనకు అసలు బలం అని చెప్పిన మాటలు అంద‌రి గుండెల్ని తాకాయి.

తల్లి ప్రేమతో పాటు తన తండ్రి అందించిన అండ కూడా తన జ‌ర్నీలో ఎంతో కీలకమని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫ్యామిలీ ఇచ్చిన విలువలు, ప్రోత్సాహమే ఈ స్థాయికి తీసుకొచ్చాయని, అందుకే ఈ స‌క్సెస్ లో తన కుటుంబానికే మొదటి స్థానం ఉంటుందని చెప్పారు. దాంతో పాటూ తనతో కలిసి పనిచేసిన చిత్రబృందంపై కూడా గౌరీ ప్రియ ప్రశంసలు కురిపించారు. కథపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన రైట‌ర్, డైరెక్ట‌ర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, కిరణ్ అబ్బవరంతో కలిసి పనిచేసిన అనుభవాన్ని కూడా సంతోషంగా గుర్తు చేసుకున్నారు. షూటింగ్ మొత్తం తనను ఎంతో గౌరవంగా, స్నేహపూర్వకంగా చూసుకున్నారని చెప్పారు.

ఒక తెలుగు అమ్మాయిగా మంచి కథ, బలమైన పాత్రతో ప్రేక్షకుల ఆదరణ పొందడం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని గౌరీ ప్రియ అన్నారు. అయితే ఈ స‌క్సెస్ తన పేరుతో కాకుండా, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లి జ్ఞాపకంతో చిరస్థాయిగా మిగిలిపోతుందని ఆమె చెప్పిన మాటలు సక్సెస్ మీట్‌లో అత్యంత ఎమోష‌న‌ల్ మూమెంట్ గా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా గౌరీ ప్రియ స్పీచ్ వైరల్ అవుతుండగా, అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ అభినందనలు తెలియజేస్తున్నారు.



Tags:    

Similar News