నాన్-థియేట్రికల్ రైట్స్‌తో సేఫ్ జోన్‌లో మీడియం రేంజ్ సినిమాలు!

టాలీవుడ్‌లో మారుతున్న ఆర్థిక సమీకరణాలు .. బాక్సాఫీస్ ట్రెండ్స్ నిర్మాతలకు ఎంతో ఊరటనిస్తున్నాయి.

Update: 2026-07-25 13:30 GMT

టాలీవుడ్‌లో మారుతున్న ఆర్థిక సమీకరణాలు .. బాక్సాఫీస్ ట్రెండ్స్ నిర్మాతలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. గతంలో సినిమా విడుదలయ్యే వరకు థియేట్రికల్ కలెక్షన్ల మీదే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నేడు డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకముందే ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారానే లాభాల బాట పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధరలకు అమ్ముడుపోవడమే.

సినిమా నిర్మాణ బడ్జెట్‌లో దాదాపు 70 శాతం వరకు కేవలం నాన్-థియేట్రికల్ రైట్స్ (ఓటీటీ, డిజిటల్ స్ట్రీమింగ్, హిందీ డబ్బింగ్ శాటిలైట్ హక్కులు మరియు ఆడియో రైట్స్) ద్వారానే రికవరీ అవుతుండటం విశేషం. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెరగడం, హిందీ డబ్బింగ్ మార్కెట్లో మీడియం రేంజ్ సినిమాలకు కూడా డిమాండ్ ఉండటంతో నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్తున్నారు. సినిమా థియేటర్లలోకి రాకముందే పెట్టుబడి తిరిగి వచ్చేస్తుండటంతో నిర్మాతలు ఆర్థికంగా పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.

ఈ సరికొత్త ట్రెండ్ వల్ల మీడియం రేంజ్ హీరోలు .. యువ నిర్మాతలకు ఎంతో ధైర్యం క‌లుగుతోంది. ఒకప్పుడు అగ్ర‌ హీరోల సినిమాలకే ఈ స్థాయిలో నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు కంటెంట్ బాగుంటే చిన్న, మీడియం సినిమాలకు కూడా కోట్లలో నాన్-థియేట్రికల్ ఆఫర్లు వస్తున్నాయి. దీనివల్ల నిర్మాతలు బడ్జెట్ అదుపులో ఉంచుకుంటున్నారు. కథాబలం ఉన్న చిత్రాలను నిర్మించడానికి ముందుకొస్తున్నారు. నష్టాల భయం తగ్గడం వల్ల ప్రయోగాత్మక చిత్రాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.

అయితే ఈ పద్ధతి వల్ల కొన్నిసార్లు థియేట్రికల్ కలెక్షన్ల పట్ల కొంత నిర్లక్ష్యం జరిగే ప్రమాదం ఉందనే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. సినిమా ముందే సేఫ్ అయింది కదా? అని ప్రమోషన్స్ విషయంలో .. కంటెంట్ విషయంలో రాజీ పడితే అది లాంగ్ రన్‌లో డిజిటల్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోలేకపోవచ్చు. అయినా నిర్మాతల దృష్ట్యా చూస్తే మాత్రం నాన్-థియేట్రికల్ రైట్స్ సేఫ్టీ నెట్‌లా పని చేస్తున్నాయి. సినిమా విడుదల రోజున థియేటర్లలో నెగెటివ్ టాక్ వచ్చినా? నిర్మాతలకు వచ్చే నష్టం చాలా వరకు తగ్గిపోతుంది.

డిజిటల్ .. శాటిలైట్ మార్కెట్ మారుతున్న తీరును బట్టి నిర్మాతలు సినిమాల బడ్జెట్‌లను ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. థియేట్రికల్ మార్కెట్‌తో సంబంధం లేకుండా, నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారానే లాభాలు వచ్చేలా పక్కా వ్యాపార వ్యూహంతో ముందుకెళ్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు , నిర్మాతల మధ్య ఆర్థిక భారాన్ని పంచుకోవడానికి ఈ విధానం చక్కని వేదికగా మారుతోంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చిన్న, మధ్య తరహా నిర్మాతలకు ఇది గొప్ప వరంలాంటిని చెప్పొచ్చు.

నాన్-థియేట్రికల్ రైట్స్ ఆధారంగా మీడియం రేంజ్ సినిమాలు సేఫ్ జోన్‌లోకి వెళ్లడం అనేది టాలీవుడ్‌లో సాను కూల పరిణామం. ఇది నిర్మాతలకు ఆర్థిక భద్రతను మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో నిరంతరం సినిమాలు నిర్మించడానికి కావలసిన ఉత్సాహాన్ని కూడా ఇస్తోంది. భ‌విష్య‌త్ లో డిజిటల్ మార్కెట్ మరింత విస్తరించి కొత్త టాలెంట్‌ను వెండితెరకు పరిచయం చేయడానికి ఈ వ్యూహం ఎంతగానో దోహదపడుతుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News