మూవీ రివ్యూ : ‘బైకర్’
‘బైకర్’ మూవీ రివ్యూ
నటీనటులు: శర్వానంద్- మాళవిక నాయర్- రాజశేఖర్- అతుల్ కులకర్ణి- బ్రహ్మాజీ- తులసి తదితరులు
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: యువరాజ్
నిర్మాతలు: వంశీ- ప్రమోద్
రచన-దర్శకత్వం: అభిలాష్ రెడ్డి
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడతడు ‘బైకర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడని ఫుల్ లెంత్ మోటో క్రాస్ మూవీ ఇది. ‘లూజర్’ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించిన అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన ీ చిత్రంతో శర్వా మెప్పించాడా.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడా.. తెలుసుకుందాం పదండి.
కథ:
వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ (శర్వానంద్) హైదరాబాద్ లో ఒక కార్టింగ్ జోన్ నడుపుతూ భార్య అనన్య (మాళవిక నాయర్).. కొడుకు ఇషాన్ తో కలిసి జీవిస్తుంటాడు. సాధారణ జీవితం గడుపుతున్న అతను.. గతంలో ఒక గొప్ప బైక్ రేసర్. అనివార్య కారణాల వల్ల రేసింగ్ విడిచిపెట్టి మామూలుగా బతికేస్తుంటాడు. ఐతే రేసింగ్ కోచ్ అయిన అతడి తండ్రి సునీల్ నారాయణ్.. తాను పని చేసే కార్పొరేట్ సంస్థ చేతిలో దారుణంగా దెబ్బ తిని మీడియాలో మోసగాడిగా ముద్ర వేయించుకున్న సంగతి తెలిసి వికాస్.. తాను తిరిగి రేసర్ గా మారాలనుకుంటాడు. ఇంతకీ సునీల్ మీద అలాంటి ముద్ర పడడానికి కారణాలేంటి.. వికాస్ రేసింగ్ ఎందుకు వదిలేశాడు.. గతంలో వీరి మధ్య ఏం జరిగింది.. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ బైక్ రేసింగ్ లోకి వెళ్లిన విక్కీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. అతను అనుకున్నది సాధించాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
తెలుగులో కల్ట్ స్పోర్ట్స్ డ్రామాగా పేరు తెచ్చుకున్న ‘జెర్సీ’ కానివ్వండి.. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించి భారీ విజయాన్నందుకున్న ‘ఎఫ్-1’ కానివ్వండి.. వాటిలో ప్రధానంగా కథేంటి? గొప్ప క్రీడాకారుడు అయిన హీరో అనివార్య కారణాలతో ఆటను పక్కన పెట్టి సాధారణ జీవితం గడుపుతుంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అతను మళ్లీ ఆటలోకి అడుగుపెడతాడు. ముందు అందరూ అతణ్ని తక్కువ అంచనా వేసినా.. తన కష్టంతో- ప్రతిభతో అందరి నోళ్లూ మూయించి తిరిగి విజేతగా నిలుస్తాడు. స్పోర్ట్స్ డ్రామాల్లో ప్రేక్షకులకు బాగా అలవాటైపోయిన ఫార్మాట్ ఇది. ఐతే ఈ క్రమంలో ఎమోషన్లను ఎంత బాగా పండించారు.. ఆటకు సంబంంధించిన సన్నివేశాలను ఎంత పకడ్డందీగా ప్రెజెంట్ చేశారు.. పెర్ఫామెన్సులు ఎలా ఉన్నాయి అన్నది కీలకం. యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి ‘బైకర్’లో కథ పరంగా అలవాటైన టెంప్లేటే ఫాలో అయినా.. మిగతా విషయాల్లో నిరాశ పరచలేదు. తెలుగు వాళ్లకే కాదు.. భారతీయ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అయిన బైక్ రేసింగ్ నేపథ్యాన్ని ఎంచుకోవడం ద్వారా సినిమాకు ఒక కొత్త కలర్ తీసుకొచ్చిన అతను.. ఎమోషన్లను కూడా బాగానే హ్యాండిల్ చేశాడు. సాంకేతిక అంశాలు.. పెర్ఫామెన్సులు కూడా బాగా కుదరడంతో ‘బైకర్’ ప్రేక్షకులను మెప్పించే సినిమాగా తయారైంది. కాకపోతే కథ పరంగా ఏ సర్ప్రైజులూ లేకపోవడం.. పైన చెప్పుకున్న ‘జెర్సీ’.. ‘ఎఫ్-1’ చిత్రాల్లో మాదిరి ఎమోషనల్ హై ఇచ్చే మూమెంట్స్ లేకపోవడం ‘బైకర్’కు ఉన్న ప్రతికూలతలు. కానీ ఒకసారి చూడ్డానికి ఢోకా లేని చిత్రమిది.
ఈ మధ్య ‘బరి’ అనే సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా.. వాలీబాల్ మన దగ్గర అంతగా పాపులర్ కాని ఆట కదా.. ఆ నేపథ్యంలో సినిమా తీసి ఎలా మెప్పిస్తారు అని అడిగితే.. ఏమాత్రం పరిచయం లేని రగ్బీ నేపథ్యంలో ‘సై’ సినిమా తీసి రాజమౌళి అలరించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆట మనకు తెలిసినా తెలియకపోయినా.. దాన్ని ప్రెజెంట్ చేయడమే కీలకమంటూ చక్కటి ఉదాహరణ చెప్పాడు ఆ చిత్ర దర్శకుడు యదువంశీ. ‘బైకర్’లో ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని బైక్ రేసుల నేపథ్యాన్ని అభిలాష్ రెడ్డి ప్రెజెంట్ చేసిన తీరే హైలైట్. దీని వల్లే సినిమాకు ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది. కొత్త ఆటను ఎంచుకోవడం ద్వారా ఒక ఫ్రెష్ ఫీల్ తీసుకురాగలిగాడు అభిలాష్. ఆ ఆటను ప్రెజెంట్ చేసిన తీరే ‘బైకర్’లో హైలైట్. బైక్ రేసుల్లో సాంకేతిక అంశాలను పాఠం అప్పజెప్పినట్లు కాకుండా.. కథకు తగ్గట్లు వాడుకున్న తీరు.. ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగేలా రేసులను ప్రెజెంట్ చేసిన వైనం ఆకట్టుకుంటాయి. ఆటకు సంబంధించి ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాల్లో కనిపించే టెక్నికల్ బ్రిలియన్స్ ‘బైకర్’లో చూడొచ్చు. రేసుల నేపథ్యంలో సినిమాలో వచ్చే మూడు ఎపిసోడ్లనూ చాలా బాగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ముఖ్యంగా క్లైమాక్స్ రేస్ ఎపిసోడ్ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. కాకపోతే ఈ రేసుల డోస్ ఇంకొంచెం పెంచి ఉంటే బాగుండేదనిపిస్తుంది. రేసులకు సంబంధించి పాజిటివ్ ఫీల్ అయితే వస్తుంది కానీ.. ఎమోషనల్ హై.. గూస్ బంప్స్ రాకపోవడం మాత్రం కొంత ప్రతికూలతే.
‘బైకర్’లో కథ పరంగా తండ్రీ కొడుకుల ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. ఫాదర్ కమ్ కోచ్ పాత్రకు రాజశేఖర్ ను తీసుకోవడంతో ఆ పాత్రకు ఒక కొత్తదనం వచ్చింది. తండ్రి కంటే ముందు కోచ్ అన్నట్లుగా ఆ పాత్రను ప్రెజెంట్ చేసిన తీరు.. కొడుకు వల్ల ఇబ్బంది పడ్డ తండ్రి తిరిగి ఆ కొడుకు వల్ల తలెత్తుకోవడం.. ఈ థ్రెడ్ అంతా బాగా పండింది. కాకపోతే ఆరంభం నుంచి కథలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే ఒక అంచనా వచ్చేయడం.. కథలో మలుపులన్నీ సాధారణంగా అనిపించడం ‘బైకర్’కు ఉన్న పెద్ద మైనస్. హీరో బైక్ రేసింగ్ మానేయడం వెనుక ఉన్న కారణాన్ని ప్రభావవంతంగా ప్రెజెంట్ చేయలేకపోయారు. హీరో హీరోయిన్ల ట్రాక్ పండలేదు. కథానాయిక పాత్ర కథలో కీలకమే అయినా.. తన ప్రవర్తన చిత్రంగా అనిపిస్తుంది.. ఆమెతో ముడిపడ్డ సన్నివేశాలు సాధారణంగా తయారయ్యాయి. హీరో-కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు ‘జెర్సీ’ని గుర్తుకు తెస్తాయి కానీ.. అందులో ఉన్నంత ఎమోషన్ ఇక్కడ లేదు. ఇలాంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. ‘బైకర్’లో మొదట్నుంచి చివరి వరకు ఒక పాజిటివ్ ఫీల్ అయితే కంటిన్యూ అవుతుంది. కొత్తగా అనిపించే బైక్ రేసింగ్ నేపథ్యం.. సాంకేతికంగా అత్యున్నత స్థాయి సినిమాను అందించడం కోసం అభిలాష్ అండ్ టీం పెట్టిన ఎఫర్ట్ సగటు చిత్రాల మధ్య ‘బైకర్’ను భిన్నంగా నిలబెట్టింది. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిసే.
నటీనటులు:
శర్వానంద్ బైకర్ పాత్రను పకడ్బందీగా పోషించాడు. నిజంగా అతనొక రేసర్ అనిపించేలా.. ఆ పాత్ర కోసం అతను మేకోవర్ అయిన తీరు.. తనను తాను ప్రెజెంట్ చేసుకున్న తీరు వావ్ అనిపిస్తుంది. బైక్ రేసుల్లో ప్రమాదకర విన్యాసాలు డూపుల్ని పెట్టి మేనేజ్ చేయొచ్చు కానీ.. ఆ పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ చూపించడం.. ప్రేక్షకులను నమ్మించడం అంత తేలికైన విషయం కాదు. ఈ విషయంలో శర్వాకు నూటికి నూరు మార్కులు పడతాయి. ఇక కథలో కీలకమైన సన్నివేశాల్లో ఎమోషన్లు పండించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఇక తండ్రిని డామినేట్ చేసే కోచ్ పాత్రలో రాజశేఖర్ సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయనకు మంచి ఊపునిచ్చే పాత్ర ఇది. లుక్ కొన్ని చోట్ల అటు ఇటుగా అనిపిస్తుంది కానీ.. పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం వంకలు పెట్టడానికి లేదు. అనన్యగా కథలో ఎంతో ప్రాధాన్యమున్న పాత్రలో మాళవిక నాయర్ కూడా రాణించింది. పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటూనే.. కొంచెం గ్లామరస్ గానూ కనిపించి మెప్పించింది మాళవిక. హీరోను బైక్ రేసుల్లో ఢీకొట్టే అన్వర్ పాత్రలో చేసిన యువ నటుడు ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ.. తులసి సహా సహాయ పాత్రల్లో చేసిన ఆర్టిస్టులు మెప్పించారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘బైకర్’ అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కింది. కథాకథనాల్లో ఉన్న లోపాలను కవర్ చేసే స్థాయిలో సాంకేతిక అంశాలు గొప్పగా అనిపిస్తాయి. విజువల్స్ పరంగా తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ మూవీ ఇదే అనిపించేలా యువరాజ్.. అద్భుతమైన ఛాయాగ్రహణంతో కట్టిపడేశాడు. ప్రీమియం మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఈ సినిమా చూస్తే వచ్చే అనుభూతే వేరు. బైక్ రేసింగ్ సన్నివేశాలన్నీ అద్భుతంగా తీర్చిదిద్దాడు యువరాజ్. మిగతా విజువల్స్ కూడా కంటికి ఇంపుగా అనిపిస్తాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా బాగానే సాగింది. కానీ తన పాటలు మాత్రం ఆశించినంత ప్రభావవంతంగా లేవు. జాగోరే పాట ఓకే అనిపించినా.. అంతకుమించి ప్రేక్షకులను వెంటాడే పాటలు లేకపోవడం ప్రతికూలంగా మారింది. యువి క్రియేషన్స్ అద్భుతమైన నిర్మాణ విలువలతో సినిమా స్థాయిని పెంచారు. శర్వా మార్కెట్ బాగా డౌన్ అయిన సమయంలో చేసిన సినిమాలో ఏమాత్రం రాజీ పడకుండా ఇంత క్వాలిటీ చూపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి రాసుకున్న కథ సాధారణంగా అనిపించినా.. తన కథనంతో.. ముఖ్యంగా బైక్ రేసింగ్ నేపథ్యంతో మార్కులు కొట్టేశాడు. సాంకేతిక అంశాలను బాగా వాడుకున్న అతను.. ప్రధాన పాత్రధారుల నుంచి మంచి పెర్ఫామెన్స్ రాబట్టుకున్నాడు. ఎమోషన్లను బాగా పండించాడు. కథ పరంగా ఇంకొంచెం వైవిధ్యం చూపించగలిగి ఉంటే.. షాకులు ఇచ్చి ఉంటే.. ‘బైకర్’ను వేరే స్థాయిలో నిలబెట్టగలిగి ఉండేవాడు.
చివరగా: బైకర్.. ఫ్యామిలీ కథ లో స్పోర్ట్స్ డ్రామా
రేటింగ్ - 3/5