ఈసారి రాజమౌళి ప్లాన్ ఎలా ఉందంటే..
| మహేశ్ బాబు ‘వారణాసి’ షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించిన నేపథ్యంలో రాజమౌళి టీమ్ పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టింది. 2027 జనవరి నాటికి సీజీ, రీరికార్డింగ్, డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుండగా, ముందుగానే పనులు ముగించి ఫిబ్రవరి, మార్చిలో ప్రమోషన్లకు సమయం కేటాయించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.
మహేశ్ బాబు 'వారణాసి' షూటింగ్ పూర్తయిందని ప్రకటించిన తర్వాత రాజమౌళి టీమ్ మరో వర్క్ లో బిజీ అయింది. ఏప్రిల్ రిలీజ్‌కు ఇంకా నాలుగు నెలలకు పైగా సమయం ఉన్నా, ఆఖరి వరకు టెక్నికల్ పనులు పెట్టుకోవాలని జక్కన్న అనుకోవడం లేదట. 'ఆర్ఆర్ఆర్' తర్వాత విదేశాల్లోనూ రాజమౌళి సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఈసారి రిలీజ్ ముందు హడావుడి తగ్గించుకునేందుకు జక్కన్న టీమ్‌కు ఓ డెడ్‌లైన్ కూడా పెట్టారట.
పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం జనవరి 2027 నాటికే పూర్తి చేయాలన్నది ప్లాన్. ఈ విషయాన్ని నిర్మాత ఎస్‌ఎస్ కార్తికేయ గతంలోనే చెప్పారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీజీ వర్క్, రీరికార్డింగ్ జరుగుతున్నాయి. డబ్బింగ్ మాత్రం ఇంకా మొదలుపెట్టాల్సి ఉంది. ఈ పనులన్నీ అనుకున్న టైమ్‌కు పూర్తయితే రిలీజ్‌కు రెండు నెలలకు పైగా ముందే సినిమా ఫైనల్ కాపీ సిద్ధమవుతుంది.
'వారణాసి' మామూలు యాక్షన్ సినిమా కాదు. కథలో టైమ్ ట్రావెల్‌తో పాటు వివిధ దేశాల బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అందుకే విజువల్ ఎఫెక్ట్స్‌పై ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తోంది. షూటింగ్ జరుగుతున్నప్పుడే కొన్ని సీజీ పనులను మొదలుపెట్టినట్లు కార్తికేయ వివరించారు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో అన్ని షాట్స్ పూర్తయ్యాకే వీఎఫ్ఎక్స్ మొదలుపెడితే విడుదల తేదీ దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా ముందే పనులు డివైడ్ చేసుకున్నారు.
ఐమ్యాక్స్ రిలీజ్ కూడా ఉంది. నార్మల్ థియేటర్లతో పాటు పెద్ద స్క్రీన్లపై సినిమా ఎలా కనిపించాలనేది కూడా చూసుకోవాలి. వేర్వేరు భాషల్లో డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, ఫైనల్ వెర్షన్లు సిద్ధం చేయడం మరో పని. ఒక దేశంలో రిలీజ్‌కు కావాల్సిన ఏర్పాట్లు, మరో దేశంలో అవసరమయ్యే పనులు ఒకేలా ఉండవు. అందుకే సినిమా రెడీ చేశాక వీలైనంత త్వరగా పంపిణీదారులకు కూడా మెటీరియల్ అందించాల్సి ఉంటుంది.
మరోవైపు ప్రమోషన్స్‌కు జక్కన్న కాస్త ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత హాలీవుడ్ మీడియా నుంచి కూడా రాజమౌళి సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి అంతర్జాతీయంగా ప్రచారం చేయడానికి వీలుంది. చివరి వరకు సీజీ, మిక్సింగ్ పనుల్లో మునిగిపోతే ఈవెంట్లకు టైమ్ తగ్గుతుంది. జనవరి టార్గెట్ అందుకుంటే ఫిబ్రవరి, మార్చిలో ప్రచారానికి ఎక్కువ వెసులుబాటు దొరుకుతుంది.
'వారణాసి' రిలీజ్ డేట్ 2027 ఏప్రిల్ 7. ఈ తేదీని ఈ ఏడాది జనవరిలోనే అధికారికంగా ప్రకటించారు. మద్యలో వాయిదా అనే రూమర్స్ వచ్చినా అందులో నిజం లేదని ఎప్పటికప్పుడు మేకర్స్ ఏదో ఒక విధంగా క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. మహేశ్ బాబు రుద్ర పాత్రలో, ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన సందర్భంలో త్వరలో మరో అప్‌డేట్ ఇస్తామని మేకర్స్ చెప్పారు.