డైలమాలో స్టార్ డైరెక్టర్లు..
వరుస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అగ్ర దర్శకులు కొందరిప్పుడు డైలమా లో కనిపిస్తున్నారు.;
వరుస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అగ్ర దర్శకులు కొందరిప్పుడు డైలమా లో కనిపిస్తున్నారు. గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంతోనే ఈ డైలామకు తెర తీసింది. బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, మారుతి , కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్ల తదుపరి ప్రాజెక్టులపై సందిగ్ధత నెలకొంది. ఏ హీరోతో సినిమా పట్టాలెక్కుతుందో? అసలు తదుపరి కథ ఏమిటో? అనే విషయంలో స్పష్టత లేకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బోయపాటి శ్రీను `స్కంద` పరాజయంతో ఒక్కసారిగా రేసులో వెనుకబడ్డారు.
అనంతరం బాలయ్య తో తెరకెక్కించిన `అఖండ 2` పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో విఫలమైంది. దీంతో బోయపాటి నెక్స్ట్ హీరో ఎవరవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది. బోయపాటికి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పేరున్నా సరైన హిట్ పడితే తప్ప ఆయన మళ్ళీ ఫామ్‌లోకి రావడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి స్క్రిప్ట్‌ను మరింత పక్కాగా సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది. పవర్ ఫుల్ డైలాగ్స్ , కమర్షియల్ ప్యాకేజీకి పెట్టింది పేరైన హరీష్ శంకర్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది.
`మిస్టర్ బచ్చన్` ఫలితం ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో దర్శకుడిగా రెండేళ్లు గ్యాప్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ దయ తలచడంతో? `ఉస్తాద్ భగత్ సింగ్` కి అవకాశం వచ్చినా? తాజాగా రిలీజ్ అయిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించని సంగతి తెలిసిందే. దీంతో హరీష్ శంకర్ రైటింగ్ స్టైల్ మారాలన్నది నెట్టింట చర్చగా మారింది. ప్రస్తుతం హరీష్ హీరో కంటేముందు సరైన కథపై దృష్టి పెడితే తప్ప లాభం లేదు. చిన్న సినిమాలను పెద్ద హిట్లుగా మార్చిన దర్శకుడు మారుతి. `ది రాజాసాబ్` రూపంలో మారుతికి కూడా గట్టిగానే దెబ్బ పడింది. ప్రస్తుతం ఈయన కూడా బౌన్స్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
దీనిలో భాగంగా కథపై కసరత్తులు చేస్తున్నాడు. అలాగే సెన్సిబుల్ పాయింట్స్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చెప్పడంలో దిట్ట అయిన కొరటాల శివకు `ఆచార్య` రూపంలో తొలి పరాజయం నమోదైంది. అనంతరం ఎన్టీతార్ తో తెరకెక్కించిన `దేవర` మొదటి భాగం మిశ్రమ ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. అయినా కొరటాల అన్ని లెక్కలు `దేవర 2 `తో సరి చేస్తాను అన్న కాన్పిడెన్స్ తో ఉన్నాడు. కానీ తారక్ సీన్ లోకి వచ్చే వరకూ గానీ పట్టాలెక్కుతుందా? లేదా? అన్నది చెప్పలేం. అగ్ర హీరోలంతా తమ కాల్‌షీట్లను రెండు మూడేళ్ల వరకు లాక్ చేసుకోవడం ఇలాంటి వారిపై కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం ఈ దర్శకులంతా ఇప్పుడు ఒకే సూత్రాన్ని నమ్ముతున్నారు. అదే నిరంతర ప్రయత్నం. ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే మరో ఛాన్స్. లేదంటే? ఈ పోటీలో నెట్టుకురావడం కష్టమని వారికీ బాగా తెలుసు.