ఆ సినిమా మనం తీస్తే ఒక్కరోజూ ఆడదట

Update: 2015-07-02 06:56 GMT
కాకాముట్టై.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న తమిళ సినిమా. అవ్వడానికిది చిన్న సినిమా, పిల్లల సినిమానే కానీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం పెద్ద సినిమాలకు దీటుగా అదరగొడుతోంది. హైదరాబాద్‌లో కూడా ఓ మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా ఆడుతోంది. ఈ సినిమా గొప్పదనం గురించి తెలుసుకుని తెలుగు ఆడియన్స్‌ కూడా సినిమా చూస్తున్నారు. ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావో అనుకుంటున్నారు. ఐతే మంచు లక్ష్మి మాత్రం 'కాకా ముట్టై' లాంటి సినిమాలు తెలుగులో ఒక్క రోజు కూడా ఆడవంటూ కుండబద్దలు కొట్టేసింది. 'కాకాముట్టై' నిజంగా అద్భుతమైన సినిమా అని.. కానీ తెలుగులో ఇలాంటి మంచి సినిమాలు ఆడే పరిస్థితి లేదని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.

తాను నటించిన 'చందమామ కథలు' కూడా చాలా మంచి సినిమా అని.. కానీ అది అనుకున్నంత బాగా ఆడలేదని లక్ష్మి చెప్పింది. వేరే భాషల్లో విభిన్నమైన సినిమాలు వస్తున్నాయని.. అవి కమర్షియల్‌గా కూడా సక్సెస్‌ అవుతున్నాయని.. కానీ మనదగ్గర అలాంటి పరిస్థితి లేదని చెప్పింది లక్ష్మి. గుండెల్లో గోదారి, చందమామ కథలు సినిమాలకు వరుసగా రెండు సంవత్సరాల్లో రెండు ఫిలిం ఫేర్‌ అవార్డులు అందుకోవడం ఆనందాన్నిచ్చిందని.. ఐతే అవార్డుల కంటే కూడా ప్రేక్షకుల రికార్డులే చాలా ముఖ్యమని.. సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకోవాలని ఎవరూ అనుకోరని.. కమర్షియల్‌ సక్సెస్‌ సాధించినప్పుడే ఎక్కువ ఆనందం కలుగుతుందని చెప్పింది మంచు వారమ్మాయి.

Tags:    

Similar News