ఫ్యాన్ వార్స్ ముదురుతున్నాయ్ బాసూ..

Update: 2016-05-20 17:30 GMT
తమిళనాట స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు ఓ రేంజిలో నడుస్తుంటాయి. రజినీకాంత్-కమల్ హాసన్ మంచి మిత్రులైనా వారి అభిమానులు మాత్రం కొట్టుకు చచ్చేవాళ్లు. ఐతే కొంత కాలానికి వాళ్లిద్దరి అభిమానుల మధ్య గొడవలు తగ్గిపోయాయి. ఇప్పుడంతా విజయ్-అజిత్ అభిమానుల మధ్యే రచ్చ నడుస్తోంది. ఈ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గొడవలు మామూలుగా ఉండవు. మరీ దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి పరస్పరం తిట్టిపోసుకుంటూ ఉంటారు. ఆపోజిట్ హీరోల్ని కించపరుస్తుంటారు అక్కడి ఫ్యాన్స్.

వాళ్లతో పోలిస్తే మన అభిమానులు చాలా బెటర్ అన్నట్లుండేది పరిస్థితి. మెగా-నందమూరి అభిమానుల మధ్య విభేదాలున్నా.. అది మరీ హెచ్చుస్థాయిలో ఏమీ ఉండేది కాదు. ఐతే ఈ మధ్య మన అభిమానులు కూడా హద్దులు దాటిపోతున్నారు. ప్రతి హీరోకూ యాంటీ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. సోషల్ మీడియా అనే ఒక ఫ్లాట్ ఫామ్ తగలడింది వీళ్ల కోసం. ఇక ఎవరి క్రియేటివిటీ వాళ్లు చూపిస్తూ అవతలి హీరో మీద విషం కక్కడం మామూలైపోయింది.

ఈ మధ్య ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాపైన నేపథ్యంలో మహేష్ అభిమానులు.. పవన్ కళ్యాణ్ ను.. అతడి అభిమానుల్ని కించపరుస్తూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేశారు. దానికి ప్రతీకారంగా ఈ మధ్య ‘ఇల్లిటరేట్ మహేష్’ అనే ట్యాగ్ పెట్టి పవన్ ఫ్యాన్స్ పైశాచిక ఆనందం పొందారు. లేటెస్టుగా అల్లు అర్జున్ హాట్ టాపిక్ అయిపోయాడు. అతను పవన్ మీద చేసిన కామెంట్లను దృష్టిలో పెట్టుకుని ‘చెప్పను బద్రర్’.. ‘చూస్కుంటాం బ్రదర్’.. అనే హ్యాష్ ట్యాగులతో పవన్ ఫ్యాన్స్ అతడి మీద దారుణమైన కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. మరోవైపు అల్లు అర్జున్ మద్దతుదారులు.. పవన్-పవన్ ఫ్యాన్స్ మీద యుద్ధానికి దిగారు. ఇలా సోషల్ మీడియాను బేస్ చేసుకుని అవతలి హీరోలు-అభిమానుల మీద విషం కక్కే బ్యాడ్ కల్చర్ టాలీవుడ్లో రోజు రోజుకూ ముదిరిపోతోంది. మొన్న ‘ఒక మనసు’ ఆడియో వేడుకలో బన్నీ ఓపెన్ గా ఈ ఫ్యాన్ వార్స్ గురించి మాట్లాడాడు. ఇలాంటివి సరికాదన్నాడు. అయినా ఎవరో చెప్పారని ఆగే టైపా ఈ అభిమానులు?
Tags:    

Similar News