రవితేజపై విమర్శలా.. అన్యాయం

Update: 2017-07-02 09:53 GMT
తమ్ముడు భరత్ చనిపోతే రవితేజ కడసారి చూపుకు వెళ్లకపోవడం.. అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై సోషల్ మీడియాలో.. ఇతర మీడియాల్లో వచ్చిన వార్తలు.. జరిగిన ప్రచారం అన్యాయమని అన్నాడు అతడితో ‘రాజా ది గ్రేట్’ సినిమా చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. భరత్ మరణంతో రవితేజ ఎంతగా ఆవేదన చెందాడో తమకు తెలుసని అనిల్ చెప్పాడు. నిర్మాతకు నష్టం వాటిల్లకూడదని భరత్ మరణానికి సంబంధించిన బాధను దిగమింగుకుని మరుసటి రోజే షూటింగుకి వచ్చిన గొప్ప వ్యక్తి రవితేజ అని.. ఆ సమయంలో రవితేజ ఎంతగా లోలోన కుమిలిపోయాడో సెట్లో అందరికీ తెలుసని అనిల్ చెప్పాడు. దీనిపై అనిల్ ఇంకా ఏమన్నాడంటే..

‘‘మామూలుగా రవితేజ గారు చాలా సరదాగా ఉంటారు. మాకు తెలిసిన రవితేజ గారంటే అంతే. కానీ ఇప్పుడు మరో వ్యక్తిని చూస్తున్నాం. భరత్‌ అంటే రవితేజ గారికి చాలా ఇష్టం. షూటింగుకి వస్తున్నప్పటికీ ఆయన లోలోపల ఎంత బాధపడుతున్నారో మాకు అర్థమవుతోంది. రవి గారికి సన్నిహితంగా ఉంటాం కాబట్టి ఆయన.. వాళ్ల అమ్మానాన్న ఎంత బాధలో ఉన్నారో మాకు తెలుసు. కొడుకు ముఖం చూసే ధైర్యం లేదా తల్లికి. వాళ్ల జీవితంలో భరత్‌ ఓ మంచి జ్ఞాపకం. ఆ జ్ఞాపకం అలాగే జీవితాంతం ఉంచాలనుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత భరత్‌ ను చూసేందుకు వాళ్ల అమ్మగారు భయపడిపోయారు. కేవలం ఆ ఒక్క కారణంతోనే ఆవిడ అక్కడికి వెళ్లలేకపోయారు. తల్లితో పాటే ఉండిపోయారు రవితేజ. జరిగిన వాస్తవం ఇది. నాలుగు గోడల మధ్య వారు పడే బాధను అర్థం చేసుకోకుండా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఏమైనా జరిగితే మన బాధ్యత మన అమ్మానాన్నలకు సమాధానం చెప్పడం వరకే ఉండేది. కానీ ఇప్పుడు ఫేస్ బుక్.. ట్విట్టర్.. యూట్యూబ్.. ఇలాంటి సామాజిక మాధ్యమాలకు చెప్పుకోవాలి. విషయం తెలుసుకోకుండా సోషల్‌ మీడియాలో కొందరు రెచ్చిపోయారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడమని రవితేజగారితో అన్నాం. కానీ ఆయన బాధలో ఉండి స్పందించలేకపోయారు. అసలే బాధలో ఉన్నవారి గురించి లేనిపోనివి కల్పించి.. రాసి.. ఇంకా బాధపెట్టడం తప్పు’’ అని అనిల్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News