బేబి నీకు బెవర్లీ హిల్స్ గిఫ్టిచ్చాను.. జాక్విలిన్‌కి మోసగాడు సుకేష్ లేఖ
ఈరోజు క్రిస్మస్ సందర్భంగా జాక్విలిన్ కి మరో అందమైన ప్రేమలేఖను రాసాడు. అంతేకాదు.. తన ప్రేయసి కోసం అమెరికా బెవర్లీహిట్స్ లో అందమైన భవనాన్ని కానుకగా ఇస్తున్నానని చెప్పాడు.;
సుకేష్ చంద్రశేఖర్ మాయలో పడి అతడు నేరగాడు అని తెలిసి కూడా బహుమతులు అందుకుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది జాక్విలిన్ ఫెర్నాండెజ్. ర్యాన్ బాక్సీ ప్రమోటర్ భార్యను 200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేష్ జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. అతడు జైలు నుంచే తన ప్రియురాలు జాక్విలిన్ ఫెర్నాండెజ్ కు ప్రేమ లేఖలు రాస్తున్నాడు. జాక్విలిన్ పుట్టినరోజున, పవిత్రమైన పండగ రోజులలో ప్రియురాలికి లేఖలు రాయడంలో సుకేష్ చాలా బిజీగా ఉంటున్నాడు.
ఈరోజు క్రిస్మస్ సందర్భంగా జాక్విలిన్ కి మరో అందమైన ప్రేమలేఖను రాసాడు. అంతేకాదు.. తన ప్రేయసి కోసం అమెరికా బెవర్లీహిట్స్ లో అందమైన భవనాన్ని కానుకగా ఇస్తున్నానని చెప్పాడు. దీనికి లవ్ నెస్ట్ అనే పేరు కూడా పెట్టాడు. అతడి లేఖ సారాంశం ఇలా ఉంది. ``ప్రియతమా, నీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ నాకు ఎల్లప్పుడూ నీతో గడిపిన ప్రత్యేక క్షణాలను, మధురానుభూతులను, నీపై నాకున్న అపారమైన ప్రేమను గుర్తు చేస్తుంది. ఇవన్నీ ఎప్పటికీ మరచిపోలేనివి`` అని సుకేష్ ఆ లేఖలో రాశారు. ఈ ప్రత్యేక బహుమతిని ఇచ్చేటప్పుడు జాకీ కుందేలు నవ్వును చూడలేకపోతున్నందుకు బాధగా ఉందని సుకేష్ లేఖలో పేర్కొన్నారు. ఈ పవిత్రమైన రోజున మన ఇల్లు రెడీ చేసి నీకు ఇస్తున్నాను.. కానీ నీ నవ్వును చూడలేకపోయినందుకు బాధగా ఉందని కూడా అన్నాడు. నీకోసం నేను కట్టించిన ఇల్లు ఇది.. అది పూర్తి కాదని నువ్వు అనుకున్నావు అని సుకేష్ గుర్తు చేసాడు.
ప్రియతమా నీ కోసం ఆ ఇంటిని పూర్తి చేశానని, ఈ క్రిస్మస్ రోజున ఈ రోజు నీకు ఇస్తున్నానని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇది మనం గతంలో ప్లాన్ చేసుకున్న దానికంటే పెద్దదిగా మెరుగ్గా ఉంది! అని కూడా ఈ లేఖలో రాసాడు. మన ఇంటి చుట్టూ 19 హోల్ గోల్ఫ్ కోర్సు కూడా ఉందని తెలిపాడు. ఇది మొత్తం అమెరికాలోనే అత్యంత ప్రత్యేకమైనది. సరదాగా చెప్పాలంటే మన `లవ్ నెస్ట్` మన సోదరుడు డోనాల్డ్ ట్రంప్ మార్-ఎ-లాగోను కూడా అసూయపడేలా చేస్తుంది! అని అతడు రాశాడు. అంతేకాదు నీకోసం తొందర్లోనే ఐపిఎల్ టీమ్ ని కొంటాను. ఆర్సీబీ టీమ్ ని కొనడానికి బిడ్ వేసాను! అంటూ ఈ లేఖలో ప్రస్థావించాడు సుకేష్.
ఇంతకుముందు హోలీ సందర్భంగా, ఈస్తర్ పండుగ రోజున కూడా జాక్విలిన్ కి ప్రేమలేఖలు రాసాడు సుకేష్. అయితే ఈ న్యూసెన్స్ ని భరించలేకపోతున్నానంటూ ఈ వరుస లేఖలపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన జాక్విలిన్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సుకేష్ చంద్రశేఖర్ ప్రముఖ బిజినెస్ మేన్ ని జైలు నుంచి బయటకు రప్పించేందుకు ఆయన భార్య నుంచి 200 కోట్లు అందుకున్నాడని ఈడీ గతంలో పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాక్వెలిన్‌ను సహ నిందితురాలిగా చేర్చింది. సుకేశ్ నేర కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడని తెలిసినా జాకీ అతని నుండి ఆభరణాలు, బట్టలు, ఖరీదైన కార్లు అందుకుంది. రకరకాల వస్తువుల రూపంలో రూ. 7 కోట్ల విలువైన ఖరీదైన బహుమతులను తీసుకుందని ఈడీ ఆరోపించగా, అతడి నేర ప్రవృత్తి గురించి తనకు తెలియదని జాక్విలిన్ వాదించింది.