మూవీ రివ్యూ : వృషభ
మోహన్ లాల్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఈ ఏడాది ఆయన ఇప్పటికే ఎల్2-ఎంపురాన్.. తుడరుం.. హృదయపూర్వం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు.;
‘వృషభ’ మూవీ రివ్యూ
నటీనటులు: మోహన్ లాల్- సమర్జిత్ లంకేష్- నయన్ సారిక- రాగిణి ద్వివేది- అజయ్- నేహా సక్సేనా- వినయ్ వర్మ- ఆలీ- గరుడ రామ్ అయ్యప్ప పి.శర్మ- కిషోర్ తదితరులు
సంగీతం: సామ్ సీఎస్
ఛాయాగ్రహణం: ఆంటోనీ శాంసన్
నిర్మాతలు: శోభ కపూర్- ఏక్తా కపూర్- సీకే పద్మకుమార్- వరుణ్ మాథుర్- సౌరభ్ మిశ్రా- అభిషేక్ వ్యాస్- ప్రవీర్ సింగ్- విశాల్ గుర్నాని- జుహి పరేఖ్
రచన-దర్శకత్వం: నందకిశోర్
మోహన్ లాల్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఈ ఏడాది ఆయన ఇప్పటికే ఎల్2-ఎంపురాన్.. తుడరుం.. హృదయపూర్వం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఏడాది చివర్లో ఆయన ‘వృషభ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం.. అన్ని ప్రధాన భాషలతో పాటే తెలుగులోనూ ఈ రోజే విడుదలైంది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ఆదిదేవ్ వర్మ (మోహన్ లాల్) పెద్ద బిజినెస్ మ్యాన్. అతడికి తన కొడుకు తేజ్ వర్మ (సమర్జిత్ లంకేష్) అంటే ప్రాణం. కొడుక్కీ తండ్రి అంటే అంతే ఇష్టం. ఐతే ఆదికి తరచుగా కలలో రాజులు.. రాజ్యాలు గుర్తుకొచ్చి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడు. తండ్రి సమస్యను పరిష్కరించడం కోసం తన తండ్రి సొంత ఊరికి వెళ్లిన ఆదికి అక్కడ విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. తండ్రి తరహాలో అతనూ మానసిక సమస్యలతో ఇబ్బంది పడతాడు. దంతో ఆదిదేవ్ రంగంలోకి దిగి ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే తమ పూర్వ జన్మలకు సంబంధించిన అంశాలు తెలుస్తాయి. ఇంతకీ గత జన్మల్లో ఆదిదేవ్.. తేజ్ జీవితాల్లో ఏం జరిగింది.. వర్తమానంలో తమకు ఎదురైన ఇబ్బందులను ఆ ఇద్దరూ ఎలా అధిగమించారు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
మోహన్ లాల్ దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఆయన ఒక సినిమా చేశాడు అంటే ఆ కథలో ఏదో ప్రత్యేకత ఉంటుందని.. ఆయన పాత్రలోనూ దమ్ము ఉంటుందని నమ్ముతారు. అలా నమ్మి ‘వృషభ’ థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులందరికీ ఆ భ్రమలు విడిపోవడానికి ఎంతో సమయం పట్టదు. సాధారణంగా ఒక సినిమా బాలేదు అనే ఫీలింగ్ అని రావడానికి ఓ అరగంట అయినా సమయం పడుతుంది. అలా అర్థం అవుతున్నపుడు తర్వాతైనా బాగుంటుందిలే అనే ఆశతో ముందుకు సాగుతాం. కానీ పట్టుమని పావుగంట కూడా అవ్వకుండానే ఇదేం సినిమారా బాబోయ్ అనిపించి.. మున్ముందు కూడా కూడా ఏం మార్పు ఉండదనే సంకేతాలు ఇచ్చి.. చివరి వరకు కూర్చోవడం సాహసదదదదమే అనిపించడం ‘వృషభ’కే చెల్లింది. వేరే ఎవరి సినిమా అయినా ఇలా తయారైతే ఓకే కానీ.. కథల ఎంపికలో గొప్ప అభిరుచి ఉందని గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ నుంచి ఇలాంటి చిత్రం రావడమే ఆశ్చర్యం. 400కు పైగా సినిమాలు చేసిన లాలెట్టన్ కెరీర్లో అట్టడుగున నిలవడానికి అన్ని అర్హతలూ ఉన్న చిత్రంగా ‘వృషభ’ను చెప్పొచ్చు అంటేనే ఇది ఏ స్థాయిలో టార్చర్ పెడుతుందో అర్థం చేసుకోవచ్చు.
‘వృషభ’ అనే పవర్ ఫుల్ టైటిల్ చూసి.. మోహన్ లాల్ రాజు వేషంలో ఉన్న పోస్టర్లు చూసి ఏదో ఊహించుకుని వెళ్లే ప్రేక్షకులకు కొన్ని నిమిషాలకే భ్రమలు విడిపోయేలా చేస్తాడు దర్శకుడు. అసలీ సినిమాలో హీరో మోహన్ లాల్ కాదు. ఎవరో సిమర్జిత్ లంకేష్ అట. అతణ్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఏమో కానీ.. ముఖంలో ఏ చిన్న హావభావం కూడా పలకని అతనే ఇందులో హీరో. తన బ్యాగ్రౌండ్ ఏంటో కానీ.. ఏకంగా పది మంది దాకా నిర్మాతలు కలిసి ఈ కుర్రాడిని నిలబెట్టడానికి కోట్లు పోసి చేసిన వ్యర్థ ప్రయత్నం.. వృషభ. అసలు ఏం చెప్పి మోహన్ లాల్ ఈ సినిమాను ఒప్పించారో కానీ.. ఈ సినిమా చూసిన ఆయన అభిమానులు మాత్రం లాలెట్టన్ ఎలా దీన్ని ఓకే చేశాడని తల పట్టుకోవడం ఖాయం. ఆరంభ సన్నివేశంలో రాజుగా మోహన్ లాల్ ను చూసి.. ఎగ్జైట్ అయ్యేలోపే తలాతోకా లేకుండా ఆ ఎపిసోడ్ ను ముగించి పెద్ద షాకిస్తాడు దర్శకుడు. ఆ తర్వాత కథ వర్తమానంలోకి వస్తుంది. అక్కడ లాల్ కొడుకుగా లంకేష్ విశ్వరూపం మొదలవుతుంది. సన్నివేశమేంటో తెలియకుండా అతడి ఎక్స్ప్రెషన్ చూసి.. అది అతను ఏ రసం పలికిస్తున్నాడో చెప్పగలిగిన వాళ్లకు అవార్డులివ్వొచ్చు. ఓపక్క తండ్రీ కొడుకుల ఎమోషన్.. ఇంకోపక్క హీరో హీరోయిన్ల రొమాన్స్ అంటూ ప్రథమార్ధంలో ఏవేవో సీన్లు పేర్చారు. ఏవీ కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేదు. అప్పుడే పరిచయం అయిన హీరోతో హీరోయిన్ క్యాజువల్ గా మాట్లాడుతూ.. అతడి నుదుటిన ముద్దు పెట్టి డ్యూయెట్ వేసుకోవడం చూసి కళ్లు బైర్లు కమ్ముతాయి.
‘వృషభ’లో ఏ క్యారెక్టర్ ఎందుకొస్తుందో.. ఏం మాట్లాడుతుందో.. ఏ ఎపిసోడ్ ఎందుకు పెట్టారో అర్థం చేసుకోవడమే పెద్ద పజిల్. తొలి పది నిమిషాల రాజుల ఎపిసోడ్ కు కొనసాగింపుగా ద్వితీయార్ధంలో మళ్లీ ఒకపెద్ద ఎపిసోడ్ పెట్టారు. అది మొదలైన దగ్గర్నుంచి ‘వృషభ’ టార్చర్ పతాక స్థాయికి చేరుకుంటుంది. అసలు ఆ ఎపిసోడ్ మొత్తం నుంచి ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కాదు. అర్థం పర్థం లేని సన్నివేశాలు.. బుర్ర చించుకున్నా బోధపడని కాని డైలాగులు.. ఇలా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ప్రేక్షకులకు నరకం చూపిస్తుంది. ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తెర మీద మోహన్ లాల్ ఉండగా.. కొన్ని నిమిషాలు కూడా భరించలేనట్లుగా సన్నివేశాలు సాగుతాయంటే ‘వృషభ’ ఎంత పేలవమైన సినిమానో అర్థం చేసుకోవచ్చు.
నటీనటులు:
మోహన్ లాల్ కెరీర్లో ఫ్లాపులు లేవని కాదు. కానీ ఆ ఫ్లాప్ సినిమాల్లో కూడా ఆయన పెర్ఫామెన్స్ గురించి వంకలు పెట్టడానికి అవకాశముండదు. కానీ ‘వృషభ’ మాత్రం అందుకు మినహాయింపు. లాలెట్టన్ పెర్ఫామెన్స్ సైతం ప్రేక్షకులను ఎంగేజ్ చేయదు. ఆయన చాలా అన్యమనస్కంగా ఈ సినిమా చేశాడని చాలా చోట్ల తెలుస్తూనే ఉంటుంది. పతాక సన్నివేశంలో ఒక్క చోట మాత్రమే లాల్ ముద్ర కనిపిస్తుంది. ఇక సమర్జిత్ లంకేష్ గురించి ఏం చెప్పాలి? కనీస స్థాయిలో కూడా హావభావాలు పలికించలేకపోయాడు. కొన్ని చోట్ల సన్నివేశంతో సంబంధం లేకుండా ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చాడు. ‘ఓయ్’ చిత్రంతో ఆకట్టుకున్న నయన్ సారిక ఇందులో క్లూ లెస్ గా కనిపించింది. మోహన్ లాల్ కు జోడీగా నటించిన రాగిణి ద్వివేది నటన కూడా పేలవం. అజయ్.. ఆలీ.. కిషోర్.. వినయ్ వర్మ.. ఇలా పేరున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నా.. ఎవ్వరికీ సరైన పాత్ర లేదు. వాళ్ల పెర్ఫామెన్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు.
సాంకేతిక వర్గం:
సినిమా ఎలా ఉన్నా సామ్ సీఎస్ నేపథ్య సంగీతం మాత్రం ఓకే అనిపిస్తుంది. ఇందులో తన ప్రత్యేకతను అతను చాటుకున్నాడు. ఆంటోనీ శాంసన్ ఛాయగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువల విషయంలో ఏమీ ఢోకా లేదు. బాగానే ఖర్చు పెట్టారు. కానీ ఆ ఖర్చును దర్శకుడు నందకిషోర్ ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. తలా తోకా లేని కథ రాసి.. దానికి గజిబిజి స్క్రీన్ ప్లేను జోడించి.. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని సన్నివేశాలతో ప్రేక్షకులను టార్చర్ పెట్టాడు నందకిషోర్.
చివరగా: వృషభ.. వృథా
రేటింగ్- 1.5/5