2025 లో మాలీవుడ్ రికార్డ్ బ్రేకింగ్ హిట్స్
మంచి ఆలోచనలతో నిండిన ఫాంటసీ కథలు అయినా, హృదయాల్ని కదిలించే మెలో డ్రామాలు, పొలిటికల్ థ్రిల్లర్లు.. జానర్ ఏదైనా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద లాభాల్ని అందించిన సినిమాలు వచ్చాయి.;
2025 మలయాళ సినిమాకి కలిసొచ్చిన సంవత్సరం. కొన్ని భారీ బాక్సాఫీస్ హిట్లు వచ్చాయి. మలయాళీలు స్వభాషలోనే కాదు, ఇరుగు పొరుగునా భారీ ప్రభావం చూపారు. మంచి ఆలోచనలతో నిండిన ఫాంటసీ కథలు అయినా, హృదయాల్ని కదిలించే మెలో డ్రామాలు, పొలిటికల్ థ్రిల్లర్లు.. జానర్ ఏదైనా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద లాభాల్ని అందించిన సినిమాలు వచ్చాయి. ఈ ఏడాది భారీగా ఆర్జించిన టాప్ 10 మలయాళ సినిమాల వివరాల్లోకి వెళితే..
`లోకః చాప్టర్ వన్: చంద్ర`.. 2025లో విడుదలైన మొదటి మలయాళ చిత్రమిది. కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫాంటసీ-థ్రిల్లర్ అద్భుతమైన కథ, నటీనటుల అసమాన ప్రదర్శన కారణంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 303 కోట్లు వసూలు చేసింది. ఒక నాయికా ప్రధాన చిత్రం ఇంత పెద్ద హిట్టవ్వడం ఊహించనిది.
`L2: ఎంపురాన్`.. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. లూసిఫర్ సిరీస్ లో రెండో భాగమిది. రాజకీయాల నేపథ్యంలో రక్తి కట్టించే థ్రిల్లర్ చిత్రంగా మనసులు గెలుచుకుంది. అగ్ర తారల నట ప్రదర్శన కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రూ. 263.6 కోట్లు వసూలు చేసింది.
తుడరుమ్.. మోహన్‌లాల్ - శోభన ప్రధాన పాత్రధారులగా నటించిన ఈ చిత్రం మరో పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. భావోద్వేగాలను పలికించే చక్కని థ్రిల్లర్ చిత్రమిది. ఇది చాలా కాలం పాటు థియేటర్లలో ప్రదర్శితమైంది. 2025 లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 231.3 కోట్లు వసూలు చేసింది.
`డైస్ ఇరే` .. ఈ సంవత్సరపు అతిపెద్ద సర్ ప్రైజ్‌లలో ఇది ఒకటి. ప్రణవ్ మోహన్‌లాల్ ఇందులో ప్రధాన పాత్రధారి. మంచి కథ, అర్థవంతమైన సన్నివేశాలతో ఈ సినిమా రక్తి కట్టించింది. ఈ హారర్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 81.85 కోట్లు వసూలు చేసింది.
`కలం కావల్`.. ఈ చిత్రంలో మమ్ముట్టి మునుపెన్నడూ లేని విధంగా ఒక సీరియల్ కిల్లర్ పాత్రలో నటించారు. ఇది ఆయన వయస్సు, హోదాకు భిన్నమైన రిస్కీ ప్రయత్నం. అతడి సాహసం ఫలించింది. కలం కావల్ 2025 సంవత్సరంలో టాప్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 76.07 కోట్లు వసూలు చేసింది.
హృదయపూర్వం.. ఈ చిత్రంలో మోహన్‌లాల్-యు మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళ ప్రజలకు ఈ ఫ్యామిలీ డ్రామా బాగా నచ్చింది. ఇది ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచి రూ. 41.32 కోట్లు వసూలు చేసింది.
`అలప్పుజ జింఖానా`... నస్లెన్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా గురించి చాలా మంచి టాక్ రావడంతో 2025లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది విమర్శకుల ప్రశంసలు పొందింది. బాక్సాఫీస్ వద్ద కూడా బాగా రాణించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్లు వసూలు చేసింది. అనస్వర రాజన్ ప్రధాన పాత్రలో నటించిన `రేఖాచిత్రం` ఒక సరదా కథ. ఆసక్తికర పాత్రలతో రక్తి కట్టించడంతో బాక్సాఫీస్ వద్ద చాలా బాగా ఆడింది. ఈ చిత్రం (ప్రపంచవ్యాప్తంగా) రూ. 49.3 కోట్లు వసూలు చేసింది. `పొన్మన్` ఈ సంవత్సరం అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం భారతదేశంలో రూ. 10.5 కోట్లకు పైగా వసూలు చేసింది. `బ్రోమాన్స్`.. బడ్జెట్‌కు తగ్గట్టుగా బాగా రాణించింది. ఇది థియేటర్లలో బాగా రాణించడంతో టాప్ టెన్‌లో కొనసాగింది. ఈ చిత్రం (భారతదేశంలో) రూ. 8.45 కోట్లకు పైగా వసూలు చేసింది.