నెల్లూరు జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న 30 మంది చిత్ర బృందం

Update: 2021-11-21 11:32 GMT
ఒక వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో విడవకుండా కురుస్తున్న వానలు పెడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే చిత్తూరు.. కడప జిల్లాల్లో భారీ ప్రాణ.. ఆస్తి నష్టాన్ని మిగిల్చిన పాడు వర్షాల కారణంగా వాననీరు వరద రూపంలో పోటెత్తుతోంది. దీంతో.. వాగులు.. వంకలు ఏకమైన పరిస్థితి. ఎక్కడికక్కడ వరద నీరు చొచ్చుకొని రావటంతో రవాణా సౌకర్యాలతో పాటు అన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్న వారెందరో. ఇలాంటివేళ.. ఒక చిత్ర బృందం సినిమా షూటింగ్ లోకి వెళ్లి వరద నీటిలో చిక్కుకుపోయిన వైనం తాజాగా బయటకు వచ్చింది.తాము వరద నీటిలో చిక్కుకుపోయి ఉన్నట్లుగా వీడియోలో మాట్లాడిన వ్యక్తి పేర్కొన్నారు.

తన పేరు నవీన్ కుమార్ అని.. తాము షూటింగ్ కోసం నెల్లూరుకు వచ్చామని చెప్పారు. కొవ్వూరు దగ్గర్లోని వెంకటేశ్వర బ్రిడ్జి దగ్గర తాము చిక్కుకుపోయినట్లుగా పేర్కొన్నారు. చుట్టూ నీళ్లు ఉన్నాయని.. తాము వరద నీటి మధ్యలో చిక్కుకుపోయామని.. తమను సేవ్ చేయాలని ఆ యువకుడు అభ్యర్థిస్తున్నాడు.

తాము మొత్తం 30 మందిమి ఉన్నామని.. తమను కాపాడాలని కోరుతున్నాడు. తాము బయటకు వచ్చే పరిస్థితి లేదని.. తమకు సాయం అవసరమని చెప్పారు. ప్లీజ్ తమకు హెల్ప్ చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీసి పోస్టు చేశారు. అదికార యంత్రాంగం సత్వరమే స్పందించి వారికి సాయం చేయాలన్న వేడుకోళ్లు వాట్సాప్ గ్రూపుల్లో కనిపిస్తున్నాయి. మరి.. అధికారులకు ఈ సమాచారం అందాలని కోరుకుందాం.
Tags:    

Similar News