ట్రెండీ టాక్‌: క్రిస్మ‌స్ సంక్రాంతి పైనే ఆశ‌లు

Update: 2020-06-20 16:30 GMT
``సంక్రాంతి వ‌చ్చింది.. సంద‌డి తెచ్చింది.. వ‌రుస‌గా సినిమాలొచ్చాయి.. కొన్ని విజ‌యాలు సాధించాయి``. ఆ త‌ర్వాత ప‌రీక్ష‌ల కాలం వ‌చ్చింది. సైలెంట్ అయ్యారు. స‌మ్మ‌ర్ ఉందిగా అనుకున్నారు. కానీ ఇంత‌లోనే వ‌చ్చింది మాయ రోగం. మ‌హాంకాళి మ‌హ‌మ్మారీ ఉన్న ఫ‌లంగా విరుచుకుప‌డింది. దీంతో ఏం చేయాలో తెలీని సందిగ్ధ‌త‌. ఎప్ప‌టికి థియేట‌ర్లు తెరిచేను? ఎప్ప‌టికి రిలీజ్ చేసేను! అన్న‌ట్టే ఉంది సీను. మ‌హ‌మ్మారీ అంత‌కంత‌కు విజృంభిస్తుంటే ఒక‌టే భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

ప్ర‌థ‌మార్థం ముగింపు భ‌యాన‌కం. స‌రిలేరు నీకెవ్వ‌రు.. అల వైకుంఠ‌పుర‌ములో.. భీష్మ ఈ మూడూ బ్లాక్ బ‌స్ట‌ర్లు. ఇదొక్క‌టే సంతోషించే విష‌యం. ఆ త‌ర్వాత అస‌లు ఊపిరాడ‌నివ్వ‌ని ట్రీటిచ్చింది కొవిడ్ మ‌హ‌మ్మారీ. థియేట్రిక‌ల్ రిలీజ్ కి రావాల‌నుకున్న వారికి ఊహించ‌ని ఉత్పాతంలా అడ్డు త‌గిలింది. లాక్ డౌన్ల‌తో అట్టుడికింది స‌న్నివేశం. ఇంత జ‌రిగినా ఇంకా ఏదో ఆశ‌.

టాలీవుడ్ నిర్మాతలు వేసవి రిలీజ్ ని మిస్స‌యినా క‌నీసం అక్టోబ‌ర్ లో ద‌స‌రా పండ‌గ‌ను అయినా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని అనుకున్నారు. కానీ వైరస్ క‌నిక‌రించ‌డం లేదు. వ్యాక్సిన్ ప్ర‌యోగాలు స‌ఫ‌లం కావ‌డం లేదు. దీంతో ద‌స‌రా పండ‌గ కూడా మిస్స‌యిన‌ట్టేనా?   రిలీజ్ లు ఉండ‌వా? అన్న సందేహాలు నెల‌కొన్నాయి.

దాదాపు 20 చిత్రాలు రేసులో ఉన్నాయి. ఇవ‌న్నీ రిలీజ‌య్యేదెపుడు?  అంద‌రూ విడుదల కోసం వేచి ఉన్నాయి. ప్ర‌థ‌మార్థం అయిపోయింది ద్వితీయార్థంలో అయినా ఎలాగైనా గ‌ట్టెక్కాల‌ని అనుకున్నారు. అయితే  థియేటర్లు డిసెంబరులో మాత్రమే తిరిగి తెరిచే వీలుంటుంద‌ని తాజాగా భావిస్తున్నారు. అది కూడా అప్ప‌టికి వైర‌స్ కి ప‌రిష్కారం ల‌భిస్తే. సమ్మర్ కి రావాల్సిన జాబితా మొత్తం ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి విడుదలకు షిఫ్ట‌వుతోంద‌ట‌. అంటే డిసెంబ‌ర్ జ‌న‌వ‌రిలోనే రిలీజ్ ల‌కు ఆస్కారం ఉంద‌ని అంతా ముందే ప్రిపేర‌వుతున్నార‌ని దీనర్థం. డిజిట‌ల్లో రిలీజ్ కి సిద్ధంగా లేనోళ్లు అంతా అప్ప‌టివ‌ర‌కూ వేచి చూడాల్సిందే. నిర్మాత‌లు స‌హా పంపిణీ వ‌ర్గాలు ఎగ్జిబిట‌ర్ల‌లోనూ దీని పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News