'#RRR' ముందే రానుందా?

Update: 2019-11-29 06:04 GMT
తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండియన్‌ సినీ అభిమానులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రం గురించి సోషల్‌ మీడియాలో ఆసక్తికర వార్త ఒకటి ప్రచారం జరుగుతోంది. కొన్ని వారాల క్రితం వరకు సినిమా షూటింగ్‌ చాలా మెల్లగా జరుగుతుంది.. విడుదల అనుకున్న తేదీకి అవ్వడం కష్టమే అంటూ పుకార్లు పుట్టించారు. హీరోలకు గాయాలు ఇతరత్ర కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా భావించారు.

కాని ఇటీవల జక్కన్న రాజమౌళి నుండి వచ్చిన ఒక ప్రకటన అందరిని ఆశ్చర్య పర్చింది. ఎన్టీఆర్‌ కు జోడీని ప్రకటించిన సమయంలో సినిమా 70 శాతం పూర్తి అయ్యిందని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు. సినిమా అనుకున్నదాని కంటే చాలా స్పీడ్‌ గా తెరకెక్కినట్లుగా ఆయన ప్రకటనతో తేలిపోయింది. మిగిలి ఉన్న బ్యాలన్స్‌ 30 శాతం షూట్‌ ను కేవలం నెల లేదా నెలన్నర రోజుల్లో అంటే జనవరి రెండవ లేదా మూడవ వారం వరకు పూర్తి చేసే అవకాశం ఉంది అంటున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జనవరిలోనే సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారట.

జనవరిలో సినిమా పూర్తి అవుతుంది కనుక అయిదు నెలలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఉండదని.. ఇది గ్రాఫిక్స్‌ ప్రధానమైన సినిమా కాదు కనుక రెండు మూడు నెలల్లోనే ఆ వర్క్‌ ను పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్దం చేస్తారని అంటున్నారు. సినిమాను నెల లేదా నెలన్నర రోజులు ముందే విడుదల  చేయాలని జక్కన్న భావిస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని.. జక్కన్న సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలకు చాలా సమయం పడుతుంది. అలాగే నెల రోజులు పూర్తిగా ప్రమోషన్‌ కార్యక్రమాలకు జక్కన్న కేటాయించే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా సినిమాను ప్రమోట్‌ చేయాలి కనుక అంత స్పీడ్‌ గా హడావుడిగా విడుదల చేయక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News