'పుష్ప' నన్ను మామూలుగా వెంటాడలేదు!

Update: 2022-01-08 04:41 GMT
'పుష్ప' .. ఎక్కడ ఎవరి నోటి నుంచి విన్నా ఇదే పేరు. ఎవరిని కదిలించినా ఈ సినిమా గురించే చెప్పారు. ఈ సినిమాకి నాకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా, ఒక రేంజ్ లో నన్ను ఇబ్బంది పెట్టేసింది .. నన్ను వెంటాడేసింది అంటూ తమిళ దర్శకుడు పాండిరాజ్ చెప్పడం విశేషం. కోలీవుడ్ లో పాండిరాజ్ కి దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన ఎంచుకునే కథలు ఎంతో వైవిధ్య భరితంగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా సూర్య కుటుంబంతో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. సూర్య .. కార్తిలతో ఆయన కొన్ని సినిమాలను రూపొందించాడు.

ఇప్పుడు కూడా సూర్య కథానాయకుడిగా ఆయన 'ఈటీ' అనే ఒక సినిమాను రూపొందించాడు. విభిన్నమైన  కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా తన కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని సూర్య భావిస్తున్నాడు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.  అలాంటి దర్శకుడు 'పుష్ప' సినిమాను గురించి ప్రస్తావించాడు. "నాకు సుకుమార్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలను నేను తప్పకుండా చూస్తుంటాను.

సుకుమార్ గారు కథలను తయారు చేసుకునే పద్ధతి .. తెరపై వాటిని ఆవిష్కరించే విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆయన దర్శకత్వం వహించిన 'పుష్ప' సినిమా మాత్రం నన్ను బాగానే ఇబ్బంది పెట్టింది. ఈ సినిమా కోసం ముందుగా రష్మికను అనుకున్నాము .. ఆమె కూడా ఓకే అనేసింది. కానీ ఆ తరువాత 'పుష్ప' సినిమా కోసం స్లాంగ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి .. తనకి కుదరదని చెప్పేసింది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ కోసం 'రామ్ - లక్ష్మణ్' ను అనుకున్నాము. 'పుష్ప' సినిమా షూటింగులో ఉన్నామనీ, ఇప్పట్లో బయటకి రాలేమని చెప్పారు.

ఇక సినిమాకి ఎడిటర్ గా రూబెన్ ను అనుకుని ఆయనకి కాల్ చేస్తే, 'పుష్ప' సినిమా పనుల్లో తాను చాలా బిజీగా ఉన్నానని ఆయన చెప్పాడు. ఇలా ఎవరికి ఏ పని కోసం కాల్ చేసినా తనకి 'పుష్ప' సినిమాను గురించే చెబుతూ రావడంతో, ఒకానొక సమయంలో అసలు ఏం చేయాలనేది తనకి పాలుపోలేదని అన్నాడు. ఇక తన సినిమాకి కెమెరా మెన్ గా పనిచేసిన రత్నవేలు .. లొకేషన్లో ఎప్పుడూ 'పుష్ప' గురించి మాట్లాడుతుండేవాడని చెప్పాడు. అందువలన 'పుష్ప' నన్ను ఎప్పుడూ వెంటాడుతున్నట్టుగానే అనిపించింది.

ఇంతమంది 'పుష్ప' గురించి ఇన్ని రకాలుగా చెబుతున్నారు .. అంతగా అసలు ఆ సినిమాలో ఏవుందని చూశాను. నిజంగానే ఆ సినిమా అద్భుతంగా అనిపించింది. సుకుమార్ కి మరోసారి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయాను. ఈ సినిమా సక్సెస్ మీట్ కి నన్ను గెస్టుగా పిలిచినప్పుడు మాత్రం, ఈ సినిమాకి .. నాకు మధ్య ఏదో తెలియని సంబంధం ఉందని అనిపించింది" అని చెప్పుకొచ్చాడు. తన గురించి .. తన సినిమాను గురించి పాండిరాజ్ అలా మాట్లాడటం పట్ల సుకుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.  
Tags:    

Similar News