క్లాసిక్ డే లీక్: చిరంజీవిపై హ‌త్యాయ‌త్నం?

Update: 2020-02-07 06:50 GMT
మెగాస్టార్ చిరంజీవిపై ఒకానొక ద‌శ‌లో విష ప్ర‌యోగం జ‌రిగిందా? ఆయ‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందా? అంటే అవున‌నే ప్రచారానికి సంబంధించిన ప్రూఫ్‌ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అందుకు సంబంధించిన వార్త‌ను ప్ర‌చురించిన ఓ పాత‌ పేప‌ర్ క్లిప్ ఇన్నాళ్ల త‌ర్వాత బ‌య‌ట‌ప‌డ‌డం మెగాభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అస‌లింత‌కీ ఆ వార్త‌లో నిజం ఎంత‌? ఆ పేప‌ర్ క్లిప్ ఇన్నాళ్ల త‌ర్వాత బ‌య‌ట‌ప‌డ‌డ‌మేమిటి? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

1988 లో జ‌రిగిన ఘ‌ట‌న అది. ఒక అభిమాని అత్యుత్సాహం.. ఆపై పొర‌పాట్లు కార‌ణం ఏదైనా మెగాస్టార్ పై విష ప్ర‌యోగం జ‌రిగింది! ఇదంతా ఆయ‌న ఎదుగుద‌ల‌ను స‌హించ‌లేని వాళ్ల కుట్ర!! అంటూ ప్ర‌చారం సాగిపోయింది. అప్ప‌ట్లో అన్ని దిన‌ప‌త్రిక‌లు హైలైట్ గా ఈ వార్త‌ను ప్ర‌చురించడం తో నాడు ప్ర‌జ‌ల్లో హాట్ టాపిక్ అయ్యింది. అప్ప‌టికే నంబ‌ర్ 1 హీరో గా వెలుగుతున్న చిరంజీవి 1988లో మ‌ర‌ణ మృదంగం చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. ఆ రోజు మ‌ద్రాస్ బేస్ కోర్ట్ లో షూటింగ్ జ‌రుగుతోంది. అక్క‌డికి 200 మంది పైగా అభిమానులు వ‌చ్చారు . ఇక అభిమానులంతా చిరుతో ఆటోగ్రాఫ్ కోసం పోటా పోటీగా ప్ర‌య‌త్నించారు. అయితే అందులోని ఒక అభిమాని ఈరోజు నా పుట్టిన‌రోజు.. ఎప్ప‌టినుంచో మీ స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేయాల‌ని అనుకుంటున్నాను! అంటూ .. ముందుకొచ్చాడు. దానికి చిరు సంతోషం గా ఆహ్వానించారు. ఒక కేక్ ముక్క క‌ట్ చేసిన అభిమాని దానిని వెంట‌నే చిరుకి తినిపించ‌ బోయాడు. అయితే అతడిని వారించిన చిరు.. ఈరోజు బ‌ర్త్ డే బోయ్ నువ్వు క‌దా.. నువ్వే తినాలి! అంటూ ఆ కేక్ ను త‌న‌కే తినిపించ‌ బోయారు. అయితే ఆ అభిమాని మొండిగా చిరు నోట్లోనే కేక్ పెట్టేసేందుకు చాలా ట్రై చేశాడు. దాంతో అది కాస్తా రసాబాస అయ్యి కేక్ నేల‌పాలైంది.

అలా నేల‌పై ప‌డిన ఆ కేక్ ముక్క‌లో గోధుమ రంగులో ఓ చిన్న ప్యాకెట్ బ‌య‌ట‌ప‌డింది. దాంతో మ‌ర‌ణ‌మృదంగం చిత్ర‌యూనిట్ కంగారు ప‌డింది. ఇదేదో విష‌ప్ర‌యోగం కాబోలు అనుకుని ఆ అభిమానిని ప‌ట్టుకుని త‌న్నారు. అంతేకాదు.. అత‌డిని పోలీసుల‌కు అప్ప‌గించారు. కింద ప‌డిన ఆ ప్యాకెట్ ని ల్యాబ్ లో చెక్ చేయించార‌ట‌. అయితే అది విష‌మా కాదా? అన్న‌ది ఎవ‌రికీ తెలీదు. అయితే అప్ప‌టి మ్యాగ‌జైన్లు దీనిపై విప‌రీతంగా ప్ర‌చారం చేశాయి. మెగాస్టార్ చిరంజీవిపై విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని.. ఆయ‌న నంబ‌ర్ వ‌న్ గా ఎద‌గ‌డం ఇష్టం లేని వాళ్లు కుట్ర ప‌న్నార‌ని అన్ని ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లు ప్ర‌చురించేయ‌డంతో అది కాస్తా వ‌ర‌ల్డ్ వైడ్ ప్రాచుర్యం పొందింది. అయితే తాను చిరంజీవి కి వీరాభిమాని ని అని ఇందులో ఎలాంటి కుట్ర లేద‌ని ఆ అభిమాని అప్ప‌ట్లో ప్రాధేయ‌ ప‌డ్డార‌ట‌. ఇక ఇందులో అస‌లు వాస్త‌వ‌మేమిటి? అన్న‌ది మెగాస్టార్ చిరంజీవి నేటి త‌రానికి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. చిరు ప్ర‌స్తుతం కెరీర్ 152వ సినిమా లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News