100% నవ్వులు పక్కా.. 'విష్ణు' నమ్మకం ఎలా ఉందంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు.. ఇప్పుడు విష్ణు విన్యాసం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.;
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు.. ఇప్పుడు విష్ణు విన్యాసం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తనదైన శైలిలో అనేక చిత్రాలతో ఇప్పటికే అలరించిన ఆయన.. ఇప్పుడు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. డెబ్యూ డైరెక్టర్ యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఆ సినిమా.. శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
దీంతో మేకర్స్ రీసెంట్ గా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో శ్రీవిష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా కంటెంట్ పై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సూపర్ హిట్ మూవీ అంటూ అంచనాలు పెంచారు. ఫ్యామిలీతో హ్యాపీగా రెండు గంటలు నవ్వుకోవడానికి రండి అని, 100 శాతం నవ్వుకుంటారని అన్నారు. ఆ బాధ్యత తనదని చెప్పారు.
థియేటర్స్ కు ఫ్రెండ్స్ తో గానీ.. ఫ్యామిలీతో గానీ.. సింగిల్ గా అయినా రావొచ్చని చెప్పారు. ఎవరు వచ్చినా ఎంటర్టైన్ చేసి పంపుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మూవీ టీమ్ తో పాటు టెక్నీషియన్లపై ప్రశంసల వర్షం కురిపించారు. విష్ణు విన్యాసం ప్రాజెక్ట్ చారి గారి వల్లే మొదలైందని, సుమంత్ గారు, సుబ్రహ్మణ్యం గారితో కలిసి ఈ సినిమా కోసం పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
విష్ణు విన్యాసం సినిమా ప్రొడక్షన్ హౌస్ కు కచ్చితంగా ఒక మంచి పేరు తీసుకువస్తుందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, అద్భుతమైన సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ రాధన్ కు కృతజ్ఞతలు తెలిపారు. షార్ప్ ఎడిటింగ్ తో ఆకట్టుకున్న ఎడిటర్ కార్తికేయన్ కు ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు. ఎడిటర్ కార్తికేయన్ భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సినిమాలో నయన్ సారిక చాలా అద్భుతంగా నటించిందని, ఆమె రోల్ సినిమాకు స్ట్రాంగ్ ఎలిమెంట్ అని చెప్పారు విష్ణు. సినిమా ఆద్యంతం ఆమె ఆటపట్టిస్తూ, ఇబ్బంది పెడుతూనే ఉంటుందని అన్నారు. నయన్ ఇలాగే మంచి కథలను ఎంచుకుంటే, ఆమె కెరీర్ లో కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదని వెల్లడించారు.
ఏదైమైనా సినిమా ఫస్టాఫ్ అంతా యూత్ ను ఆకట్టుకునేలా సాగుతుందని, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ డ్రామాపైకి చేంజ్ అవుతుందని తెలిపారు. ఇది కచ్చితంగా ఒక సూపర్ హిట్ సినిమా అని చెప్పారు. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను రెండు గంటల పాటు పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన మూవీ ఎప్పుడు వచ్చినా డ్రై సీజన్ ఉంటుందని, వచ్చే మూడు- నాలుగు వారాల పాటు సినిమా అలరిస్తుందని తెలిపారు.