15 నిమిషాల తిరుమల దర్శనంపై హీరోయిన్ క్లారిటీ

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే దేవుడిని చూసేలోపు దేవుడు కనిపిస్తాడని సామాన్య భక్తులు వ్యాఖ్యానిస్తుంటారు.;

Update: 2026-02-26 04:03 GMT

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే దేవుడిని చూసేలోపు దేవుడు కనిపిస్తాడని సామాన్య భక్తులు వ్యాఖ్యానిస్తుంటారు. ఐతే సెలబ్రెటీల కోసం ఏర్పాటు చేసే వీఐపీ బ్రేక్ దర్శనం అయితే త్వరగా.. ప్రశాంతంగా జరిగిపోతుందన్న సంగతి తెలిసిందే. ఐతే జనం తోపులాట, హడావుడి లేకపోవడం సంగతి ఎలా ఉన్నా.. బ్రేక్ దర్శనాల్లో కూడా దైవదర్శనం కొన్ని క్షణాలే ఉంటుందన్నది వాస్తవం. ఐతే తాను దర్శనానికి వెళ్తే 15 నిమిషాల పాటు ఎవ్వరూ టచ్ చేయలేదని.. ఆ పావుగంట ఓవైపు గోవింద నామాలు వినిపిస్తుంటే.. ఇంకోవైపు ‘కాత్యాయనీ భోంచేశావా’ అని తాను నటించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా పాట పల్లవిని కొందరు వినిపిస్తూ ఉన్నారని హీరోెయిన్ శివాని నాగారం ఒక పాడ్ కాస్ట్‌లో చెప్పడం చర్చనీయాంశమైంది. సామాన్య భక్తులను కొన్ని క్షణాలు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకోనివ్వని టీటీడీ.. సెలబ్రెటీలకు మాత్రం పావుగంట అవకాశం ఇవ్వడం ఏంటి అంటూ సామాజిక మాధ్యమాల్లో జనాలు మండిపడ్డారు.

తన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో శివాని నాగారం ఒక వీడియో రిలీజ్ చేసింది. తన వ్యాఖ్యలు జనాల్లోకి వేరేలా వెళ్లాయని.. వాస్తవంగా తన ఉద్దేశం వేరని ఆమె వివరణ ఇచ్చింది. తాను రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగి తన తల్లితో కలిసి రూ.10,500తో శ్రీవాణి ప్రత్యేక టికెట్ తీసుకున్నానని ఆమె చెప్పింది. తాను గుడిలోకి వెళ్లాక.. దేవుడిని దర్శనం చేసుకునే వరకు కలిపి 15 నిమిషాలు అని చెప్పానే తప్ప.. దేవుడిని 15 నిమిషాల పాటు దర్శనం చేసుకుంటే తనను ఎవ్వరూ తోయలేదని ఆమె వెల్లడించింది. అందరు భక్తుల్లాగే ఐదారు క్షణాలే దేవుడిని దర్శించుకున్నట్లు శివాని చెప్పింది. తాను ఈ ఇంటర్వ్యూలో తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడానని.. 13 ఏళ్ల తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకున్నపుడు కలిగిన ఉద్వేగం గురించి తాను మాట్లాడానని ఆమె గుర్తు చేసుకుంది. శ్రీవాణి టికెట్ తీసుకున్న ఎవ్వరికైనా తన లాగే మంచి దర్శనం అవుతుందని పేర్కొంటూ తన టికెట్‌ను కూడా ఆమె ఈ వీడియోలో పంచుకుంది.



Tags:    

Similar News