8 వారాల తర్వాతే.. OTTలకు ఫిలించాంబర్ ఝలక్
ఓటీటీల కారణంగా థియేట్రికల్ బిజినెస్ సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తమవుతోంది. సినీపరిశ్రమ దిగ్గజాలు భవిష్యత్ పై మరింత ఆందోళనతో ఉన్నారు.;
ఓటీటీల కారణంగా థియేట్రికల్ బిజినెస్ సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తమవుతోంది. సినీపరిశ్రమ దిగ్గజాలు భవిష్యత్ పై మరింత ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీలపై ఉత్తరాదిన తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ 8 వారాల తర్వాతే ఓటీటీలో సినిమాని స్ట్రీమింగ్ చేయాలనే నియమం ఉంది. అయితే
ఈరోజు (25 ఫిబ్రవరి 2026) హైదరాబాద్‌లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో థియేటర్ల మనుగడను కాపాడేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గుతున్న నేపథ్యంలో సినిమాల ఓటీటీ విడుదలకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఫిలిం ఛాంబర్ ప్రతిపాదించింది. ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన 8 వారాల (56 రోజులు) తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. సినిమాలు విడుదలైన 3 లేదా 4 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని, దీనివల్ల ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఛాంబర్ అభిప్రాయపడింది.
ఈ సమావేశానికి సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, ఠాగూర్ మధు వంటి ప్రముఖ నిర్మాతలు, సుమారు 40 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఈ ప్రతిపాదనను ఫైనలైజ్ చేసే ముందు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో చర్చలు జరపాలని నిర్ణయించారు. దీనికోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు.
కట్-ఆఫ్ డేట్ రూల్ ఎప్పటి నుండి అమలులోకి వస్తుందనే దానిపై ఒక ప్రకటన చేస్తారు. ఆ తేదీ కంటే ముందు ఓటీటీ ఒప్పందాలు చేసుకున్న సినిమాలకు.. 60 శాతం పైగా షూటింగ్ పూర్తయిన సినిమాలకు కొంత మినహాయింపు ఉండవచ్చు.
ఎందుకు ఈ నిర్ణయం?
ఉత్తరాదిలో (నార్త్ ఇండియా) ఇప్పటికే పీవీఆర్ -ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ చైన్స్ 8 వారాల నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఆ నిబంధన పాటించని సినిమాలను వారు ప్రదర్శించడం లేదు. ఇప్పుడు అదే పద్ధతిని టాలీవుడ్‌లో కూడా పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల చిన్న సినిమాలకు ఇబ్బంది కలగకుండా.. బడ్జెట్ ఆధారంగా ఏవైనా మార్పులు చేస్తారా? అనేది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చర్చల తర్వాతే తెలుస్తుంది. 8 వారాల గ్యాప్ నియమం అమలైతే థియేటర్లకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఆశిద్దాం.