నాని.. లేట్ చేస్తే చేశాడు కానీ
ఆ విజువల్స్.. ఆ గ్రాండియర్.. ఆ టేకింగ్.. ఆ క్రియేటివిటీ.. ఆ లిరిక్స్.. ఆ సింగింగ్.. ఆ బీట్స్.. ఆ మూమెంట్స్ చూశాక.. ఆశ్చర్యపోని వారు లేరు.;
టాలీవుడ్లో మిడ్ రేంజ్ హీరోల్లో నేచురల్ స్టార్ నానిది వేరే లెవెల్. ముందు చిన్న హీరోల్లో ఒకడిగా ఉన్న అతను.. ఆ తర్వాత మిడ్ రేంజికి ఎదిగాడు. ఇప్పుడేమో.. మిడ్ రేంజికి, టాప్ స్టార్ల లీగ్‌కు మధ్యలోకి వెళ్లిపోయాడు. ‘ది ప్యారడైజ్’ సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడితే.. అతడి రేంజ్ మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే సినిమా సినిమాకూ కొన్ని మెట్లు ఎదుగుతున్నప్పటికీ.. నాని ఎప్పుడూ స్పీడ్ తగ్గించలేదు. ఏడాదికి కనీసం ఒక్క రిలీజ్ ఉండేలా చకచకా సినిమాలు లాగిస్తూ ముందుకు సాగుతున్నాడు.
కొన్నిసార్లు నానవి ఏడాదిలో రెండు చిత్రాలు కూడా రిలీజవుతుంటాయి. ఒక సినిమా చేస్తుండగానే ఇంకో సినిమాకు ప్లానింగ్ జరిగిపోవడం.. ఒక చిత్రం మొదలైనపుడే రిలీజ్ డేట్ ప్రకటించడం.. చెప్పిన డేటుకే సినిమాను తీసుకురావడం.. ఇదీ నాని స్టైల్. అలా అని క్వాలిటీలో రాజీపడడం కూడా ఉండదు. ఐతే ‘ది ప్యారడైజ్ విషయంలో మాత్రం నాని మాట తప్పాడు. ఈ సినిమా అనుకున్న ప్రకారం పూర్తి కాలేదు. ముందు ప్రకటించినట్లు మార్చి 27న రిలీజ్ కావట్లేదు. ఇది నాని ఫ్యాన్స్‌ను ఒకింత నిరాశకు గురి చేసింది.
కానీ నాని పుట్టిన రోజు కానుకగా ‘ది ప్యారడైజ్’ నుంచి తాజాగా రిలీజ్ చేసిన ‘ఆయా షేర్’ పాటను చూశాక మాత్రం ఆలస్యం విషయంలో నేచురల్ స్టార్ అభిమానుల అసంతృప్తి అంతా ఎగిరిపోయింది. ఆ విజువల్స్.. ఆ గ్రాండియర్.. ఆ టేకింగ్.. ఆ క్రియేటివిటీ.. ఆ లిరిక్స్.. ఆ సింగింగ్.. ఆ బీట్స్.. ఆ మూమెంట్స్ చూశాక.. ఆశ్చర్యపోని వారు లేరు. గత ఏడాది వచ్చిన రామ్ చరణ్ పాట ‘చికిరి’ నెమ్మదిగా జనాల్లోకి ఎక్కింది. కానీ ‘ఆయా షేర్’ అలా కాదు. ఇన్‌స్టంట్ హిట్టయిపోయింది. నిన్నట్నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. నాని స్థాయి హీరో సినిమాలో ఈ భారీతనం, ఈ విజువల్స్ చూసి ఒక్కొక్కరికి దిమ్మదిరిగిపోతోంది. ఇలా ఒక పాటను తీయడం ఆషామాషీ విషయం కాదు.
టాప్ స్టార్ల సినిమాల్లో మాత్రమే ఈ భారీతనం, ఇంత ఎఫర్ట్ కనిపిస్తుంది. కనీసం నెల రోజులు కష్టపడితే తప్ప ఇలాంటి పాట తీయలేరు. ఈ పాటే ఇలా ఉంటే.. సినిమా ఇంకెంత గ్రాండ్‌గా ఉంటుందో అంచనా వేయొచ్చు. మరి అంత భారీగా సినిమా తీస్తున్నపుడు నాని గత సినిమాల్లో ఐదారు నెలల్లో పూర్తి చేయడం అంటే కష్టమే. దీనికి టైం పడుతుంది. అప్పుడే క్వాలిటీ వస్తుంది. ఈ పాట ఉన్న స్థాయిలోనే సినిమా కూడా ఉంటే మాత్రం.. సినిమాకు ఆకాశమే హద్దు. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసి నాని ఒకేసారి చాలా మెట్లు పైకి ఎదిగిపోవడం ఖాయం.