గుబురు గ‌డ్డం.. పిల‌క‌ముడి.. స్టైలిష్ రేబాన్.. చియాన్ క్యారే!

Update: 2023-02-17 22:47 GMT
గుబురు గ‌డ్డం పిల‌క‌ముడి స్టైలిష్ రేబాన్ తో బాడీ బిల్డ‌ర్ ఇదిగో ఇలా కొల‌నులో జ‌ల‌మాడుతూ ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. ఇలాంటి విల‌క్ష‌ణ‌త చియాన్ విక్ర‌మ్ నుంచి ప‌దే ప‌దే ఆశించ‌వ‌చ్చు. పా రంజిత్ తాజా ప్ర‌యోగంలో చియాన్ మెరుపులు మెరిపించ‌బోతున్నాడా? అంటే అవున‌నే ఈ కొత్త లుక్ చెబుతోంది.

సామాజిక ఇతివృత్తాల‌తో బ‌ర్నింగ్ స‌మ‌స్య‌ల‌పై పోరాటం సాగించే క‌థాంశాల‌తో సినిమాలు తీయ‌డంలో శంక‌ర్ -ఏ.ఆర్.మురుగ‌దాస్ లాంటి ద‌ర్శ‌కులు ఎప్పుడూ ముందుంటారు. ఈ ద‌ర్శ‌కుల‌కు స‌హాయ‌కులు అలాంటి క‌థాంశాల‌ను ఎంపిక చేసుకుని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక వీరి బాట‌లోనే సామాజిక సమస్యలను తెర‌పై చిత్రీకరించడంలో ఆస‌క్తిని క‌న‌బ‌రిచే ద‌ర్శ‌క‌నిర్మాత పా.రంజిత్ త‌దుప‌రి `తంగలన్‌` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన క‌థానాయ‌కుడిని అత‌డు పూర్తి భిన్నమైన లుక్ తో చూపిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం సెట్స్ నుండి విక్ర‌మ్ తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసాడు. పొడవాటి గడ్డం .. జుట్టుతో విక్ర‌మ్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఈ కొత్త రగ్డ్ లుక్స్ కి త‌గ్గ‌ట్టే అత‌డు ఒక జాతిని న‌డిపించే పోరాట యోధుడిగా చాలా ఇంటెన్స్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని కొన్ని నెలల క్రితం విడుదలైన టైటిల్ టీజర్ వెల్ల‌డించింది.

అప‌రిచితుడు- పితామ‌గ‌న్ త‌ర‌హాలోనే డీప్ ఇంటెన్స్ పాత్ర‌లో అద్భుత భావోద్వేగాల‌ను తెర‌పై పంచుతాడ‌ని తాజాగా షేర్ చేసిన ఫోటోల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఈ భారీ బ‌డ్జెట్ పీరియడ్ యాక్షన్ డ్రామాను ప్రముఖ స్టూడియో గ్రీన్ బ్యానర్ - నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మాళవికా మోహనన్ చియాన్ స‌ర‌స‌న క‌థానాయిక‌. జివి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. తంగళన్ తెలుగు-త‌మిళం స‌హా బహు భాషల్లో విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News