పుష్ప 3 వెనుక మేకర్స్ బ్రహ్మాస్త్రం లాంటి ఐడియా
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే బన్నీ సుకుమార్ కాంబోలో మరొక కొత్త సినిమా రాబోతోందట. ఇది పుష్ప ఫ్రాంచైజీకి ఏమాత్రం సంబంధం లేని ఒక సరికొత్త కథ అని తెలుస్తోంది.;
గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన 'పుష్ప 2: ది రూల్' బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అంచనాల ప్రకారం సుమారు 1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మైత్రీ మూవీ మేకర్స్ కు ఈ సినిమా కనీవినీ ఎరుగని లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ఈ కాంబినేషన్ మీద అంచనాలు మరో లెవెల్ కి వెళ్లాయి. ఇప్పుడు అందరి కళ్లు వీరి తదుపరి ప్రాజెక్ట్ మీదే ఉన్నాయి.
సహజంగా ఇంత పెద్ద హిట్టు కొట్టిన తర్వాత ఫ్యాన్స్ వెంటనే 'పుష్ప 3' ఉంటుందని ఆశించారు. సినిమా క్లైమాక్స్ లో ఇచ్చిన లీడ్ కూడా అలాగే ఉంది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అసలు ప్లాన్ వేరేలా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే బన్నీ సుకుమార్ కాంబోలో మరొక కొత్త సినిమా రాబోతోందట. ఇది పుష్ప ఫ్రాంచైజీకి ఏమాత్రం సంబంధం లేని ఒక సరికొత్త కథ అని తెలుస్తోంది.
సుకుమార్ ఈసారి ఒక యునీక్ స్టోరీ లైన్ తో, హై ఎండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో బన్నీని చూపించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ గా అలరించిన బన్నీని, ఈ కొత్త సినిమాలో ఒక డిఫరెంట్ అవతార్ లో ప్రెజెంట్ చేసే ఆలోచనలో ఉన్నారట. పుష్ప 3 కంటే ముందే ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు తరువాతనే బన్నీతో మరో కొత్త సినిమా ఉంటుందని టాక్. చేతిలో 'పుష్ప 3' లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు దాన్ని హోల్డ్ లో పెట్టడం వెనుక మేకర్స్ లో మాస్టర్ మైండ్ ఉందని టాక్ వినిపిస్తోంది. వారి లెక్కల ప్రకారం 'పుష్ప 3' అనేది ఒక 'బ్రహ్మాస్త్రం' లాంటిది. సినిమా ఇండస్ట్రీలో హిట్లు, ప్లాపులు సహజం. ఎప్పుడు ఎవరి గ్రాఫ్ ఎలా ఉంటుందో చెప్పలేం.
ఒకవేళ భవిష్యత్తులో హీరోకి గానీ, దర్శకుడికి గానీ అలాగే నిర్మాతలకు గానీ అనుకోని ప్లాపులు వచ్చి కెరీర్ డల్ అయితే, అప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయాలని డిసైడ్ అయ్యారట. పుష్ప బ్రాండ్ కు ఉన్న క్రేజ్ వల్ల ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసినా మినిమం గ్యారంటీ బిజినెస్ జరుగుతుంది. కళ్లు మూసుకొని వెయ్యి కోట్లు కొట్టే సత్తా ఆ టైటిల్ కు ఉంది.
అందుకే ఆ సేఫ్ ప్రాజెక్ట్ ను ఇప్పుడే వాడేయకుండా, క్లిష్ట పరిస్థితుల్లో వాడుకోవడానికి రిజర్వ్ లో ఉంచుకున్నట్లు సమాచారం. ఎవరైనా డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు ఈజీగా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి పుష్ప 3 ఒక ఆయుధంలా పనికొస్తుంది. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా, వెనకాల కాపాడటానికి పుష్ప 3 ఎలాగూ సిద్ధంగా ఉంటుంది. అందుకే ధైర్యంగా ఈ కొత్త ప్రాజెక్ట్ వైపు అడుగులు వేస్తున్నారు.