కలెక్షన్ కింగ్ సెకెండ్ ఇన్నింగ్స్.. ఈసారి అంతకుమించి?

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్‌ లో మరింత జోరు చూపిస్తున్నారు.;

Update: 2026-03-19 18:19 GMT

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్‌ లో మరింత జోరు చూపిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన వరుస సినిమాలతో బిజీగా మారి.. అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు చిత్రాలు ది పారడైజ్, శ్రీనివాస మంగాపురం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.



 


నేడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ రెండు సినిమాల నుంచి విడుదలైన గ్లింప్సెస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా, నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ది పారడైజ్ చిత్రంలో మోహన్ బాబు పవర్‌ ఫుల్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.



పారడైజ్ లో మోహన్ బాబు శిఖంజా మాలిక్ అనే క్రూరమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత కంప్లీట్ విలన్ రోల్ చేయడం విశేషం. గతంలో పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన మోహన్ బాబు.. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గ్లింప్స్ సూచిస్తోంది.

ఆ వీడియోలో ఆయన లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పొడవాటి గడ్డం, విగ్, భారీ నగలు, ఒంటిపై గాయాలతో సింహాసనం తరహా కుర్చీలో కూర్చుని సిగార్ కాలుస్తూ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. శ్రీకాంత్ ఓదెల తన రా అండ్ రస్టిక్ స్టైల్‌ ను గ్లింప్స్‌ లోనూ స్పష్టంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత హైప్ తీసుకొచ్చింది.

మరోవైపు, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం చిత్రంలో కూడా మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన వెంకటప్పయ్య నాయుడు పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన గ్లింప్స్‌ లో వైట్ అండ్ వైట్ దుస్తుల్లో మాస్ లుక్‌ లో దర్శనమిచ్చిన ఆయన, విలన్లతో పోరాడుతూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది.

ఇలా ఒకేసారి రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్న మోహన్ బాబు తన సెకండ్ ఇన్నింగ్స్‌ ను స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు పవర్‌ ఫుల్ విలన్‌ గా, మరోవైపు మాస్ యాక్షన్ పాత్రలో ఆయన చేస్తున్న రోల్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం విడుదలైన రెండు గ్లింప్సెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు మళ్లీ పాత ఫామ్‌ లోకి వచ్చి, తన రెండో ఇన్నింగ్స్‌ లో ఫస్ట్ ఇన్నింగ్స్ కు మించి అలరిస్తారా అన్న చర్చ నడుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..



Tags:    

Similar News