దుబాయ్‌లో సినీప్ర‌ముఖుల‌ పెట్టుబ‌డులు.. చెంప చెల్లుమ‌నిపించిన CM రేవంత్

దుబాయ్ లో ఒక‌వైపు ఇరాన్ మిసైల్స్, డ్రోన్స్ విధ్వంశం సృష్టిస్తున్నాయి. అక్క‌డ ఉన్న విమానాశ్ర‌యం స‌హా కీల‌క‌మైన సంప‌ద‌ల వినాశ‌నం కొన‌సాగుతోంది.;

Update: 2026-03-19 18:25 GMT

దుబాయ్ లో ఒక‌వైపు ఇరాన్ మిసైల్స్, డ్రోన్స్ విధ్వంశం సృష్టిస్తున్నాయి. అక్క‌డ ఉన్న విమానాశ్ర‌యం స‌హా కీల‌క‌మైన సంప‌ద‌ల వినాశ‌నం కొన‌సాగుతోంది. ఈ నాశ‌నం చూసాక ప్ర‌పంచం మొత్తం నివ్వెర‌పోవ‌డం త‌ప్ప చేసేదేమీ లేకుండా పోయింది. ఇంత‌కాలం దుబాయ్ బుర్జ్ ఖ‌లీఫా గురించి, అక్క‌డ త‌మ పెట్టుబ‌డులు, ఆస్తులు, సంప‌న్న హోదా గురించి మాట్లాడుకున్న చాలా మంది భార‌తీయులు స‌హా ప్ర‌పంచ దేశాల కుభేరులు అంతా బావురుమంటున్నారు. వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఇదంతా ఒకే ఒక్క యుద్ధం నేర్పిన పాఠం.

యుద్ధం అంటే ల‌క్ష‌ల కోట్లు కేవ‌లం రోజుల్లోనే హ‌రించుకుపోవ‌డం.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో యుద్ధం ముగిసేట్టు క‌నిపించ‌డం లేదు. అమెరికా-ఇజ్రాయేల్ వ‌ర్సెస్ ఇరాన్ వార్ ప్ర‌భావం భార‌త‌దేశంలోని అన్ని రంగాల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. కొన్ని నెల‌ల పాటు గ్యాస్ క‌ష్టాలు, పెట్రో ఉత్ప‌త్తుల క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని నిపుణులు అంచ‌నా వేసారు. ఇలాంటి స‌మ‌యంలో తెలంగాణ‌లోని హైద‌రాబాద్ లో శ్రీ‌ పరాభవ నామ సంవత్సర ఉగాది వేదికగా జరిగిన `తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025` కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబాయ్‌లో మ‌న‌ ప్రముఖుల పెట్టుబడుల విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దుబాయ్‌లో పెట్టుబడులు పెడుతున్న ధ‌న‌వంతులపై బిగ్ పంచ్ వేసారు రేవంత్. అది సినిమా వాళ్లు అయినా లేదా ఇత‌ర కీల‌క రంగాల్లో సంపాదించిన వ్య‌క్తులు అయినా కానీ ఆయ‌న విసిరిన పంచ్ అంద‌రినీ నోరెళ్ల‌బెట్టేలా చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఇక్కడ సంపాదించిన లాభాలను ఇతర దేశాల్లో ముఖ్యంగా దుబాయ్ వంటి చోట్ల స్థిరాస్తి రూపంలో పెట్టుబడులుగా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మన గడ్డపై సంపాదించిన సొమ్మును తిరిగి మన ప్రాంత అభివృద్ధి కోసమే వినియోగించాలని ఆయన హితవు పలికారు. అయితే ఆయ‌న సినిమా అవార్డుల ఫంక్ష‌న్ లో విసిరిన‌ పంచ్ కాబ‌ట్టి ముఖ్యంగా ఇది సినిమా వాళ్ల‌ను బ‌లంగా తాకింది. మ‌న సినిమా తార‌ల దుబాయ్ పెట్టుబ‌డులనుద్ధేశించి సీఎం బిగ్ పంచ్ విసిరారు అంటూ అంతా గుస‌గుస‌లాడుకుంటున్నారు.

హైదరాబాద్ నగరం ప్రస్తుతం ప్రపంచ స్థాయి ఫిల్మ్ హబ్‌గా ఎదుగుతోందని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రేవంత్ రెడ్డి ఈ కీల‌క‌మైన సినిమా వేదిక‌పై గుర్తుచేశారు. ``హైదరాబాద్ ఈజ్ గ్లోబల్ డెస్టినీ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ`` అని పేర్కొంటూ మన కళాకారులు, నిర్మాతలు ఇక్కడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

స్థానిక అవకాశాలను వదిలేసి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడం సరైన పద్ధతి కాదని రేవంత్ సూటిగానే హెచ్చరించారు. మన సంస్కృతిని, మన ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఇక్కడ సంపాదించి అక్కడికి తరలించడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ``చెంప చెల్లుమనిపించినట్లు`` ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు

ప్రభుత్వం సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహకరిస్తోందని.. అవార్డులను పునరుద్ధరించి కళాకారులను గౌరవిస్తోందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. దీనికి ప్రతిఫలంగా సినీ ప్రముఖులు కూడా ఇక్కడే ఉండి.. ఇక్కడి మౌలిక సదుపాయాల కల్పనలో తోడ్పడాలని ఆయన కోరారు. జపాన్ , కొరియా దేశాల్లో సినీ పరిశ్రమ అక్కడి ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేసిందో ఉదహరిస్తూ.. తెలంగాణలో కూడా అదే స్థాయి వృద్ధిని సాధించాలంటే మన వారి సహకారం అత్యంత అవసరమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News