పవన్ ఓజీ.. సుజీత్ ఈసారైనా..

సాధారణ ప్రేక్షకులను పూర్తిగా మెప్పించేలా సుజీత్ కథను మరింత బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

Update: 2026-06-27 10:30 GMT

పవన్ కళ్యాణ్ అభిమానులను మరోసారి జోష్ నింపేలా ఓజీ 2 ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, మూవీ టీమ్ విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియోతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఈసారి అభిమానుల అంచనాలను అందుకోవడమే కాదు, సాధారణ ప్రేక్షకులను పూర్తిగా మెప్పించేలా సుజీత్ కథను మరింత బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఓజీతో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో భారీ విజయాన్ని అందించిన దర్శకుడు సుజీత్, ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌ ను సిద్ధం చేస్తున్నారు. మొదటి భాగం చివర్లోనే సీక్వెల్ ఉంటుందని సిగ్నల్ ఇచ్చిన మూవీ టీమ్, తాజాగా ప్రత్యేక వీడియోతో రెండో భాగాన్ని అధికారికంగా ప్రకటించింది. "తుఫాను వచ్చే ముందు ప్రశాంతత" అంటూ విడుదల చేసిన వీడియో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో గంభీర అనే పాత్రకు సంబంధించిన తెలియని కథను ఓజీ 2లో చెప్పబోతున్నామని స్పష్టం చేశారు.

వీడియోలో దర్శకుడు సుజీత్ కథను పవన్ కళ్యాణ్‌ కు వివరిస్తూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా కాన్సెప్ట్‌ ను రిఫ్లెక్ట్ చేసేలా రూపొందించిన చిత్రాలతో కూడిన పుస్తకాన్ని చూపించగా, పవన్ ఆసక్తిగా పరిశీలించిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. "మీ పేరు ఏంటి?" అనే ప్రశ్నకు ఓజాస్ గంభీర అనే ఆన్సర్ రావడం, అదే సినిమా తొలి సీన్ అని సుజీత్ చెప్పడం విశేషం.

వీడియోలో కనిపించిన విజువల్స్‌ ను బట్టి చూస్తే, ఓజీ 2 కథలో మెయిన్ పార్ట్ జపాన్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్లు అర్థమవుతోంది. గంభీర ఫ్యామిలీ భారత్ నుంచి జపాన్‌ కు వెళ్లడం, అక్కడ సమురాయ్‌ గా ఎదగడం, ఎదురైన సవాళ్లను అధిగమించి చివరకు భారత్‌ కు రావడం వంటి అంశాల చుట్టూ కథ తిరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఓజీగా గంభీర ఎలా మారాడనే అంశాన్ని సీక్వెల్ లో క్లియర్ గా చూపించనున్నట్లు అర్థమవుతోంది.

ఇప్పటికే విడుదలైన వీడియో సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చింది. షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఈ స్థాయిలో చర్చ జరగడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులకు పెద్దగా కమిట్ కాకపోవడంతో, ఓజీ 2నే ఆయన నెక్స్ట్ మూవీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెకండాఫ్ లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అయితే ఓజీ విజయాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అభిమానులు సినిమాను విపరీతంగా ఆదరించినప్పటికీ, సాధారణ ప్రేక్షకుల్లో మాత్రం అదే స్థాయి రెస్పాన్స్ కనిపించలేదనే అభిప్రాయం ఉంది. స్టైలిష్ మేకింగ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌ ను ఉర్రూతలూగించాయి. కానీ అందరికీ ఒకే స్థాయిలో కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, కథలోని బలం మరింత ఉండాల్సిందనే చర్చ అప్పట్లో జరిగింది. అందుకే ఓజీ 2 విషయంలో సుజీత్ ముందున్న అసలు సవాలు అదే. కేవలం అభిమానులను మెప్పించడం కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్ల నుంచి సంతృప్తిగా బయటకు వచ్చేలా కథను రాసుకుంటే సీక్వెల్ మరో స్థాయికి చేరుతుంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News