'దాదా ధమాకా'.. బాలయ్య స్వాగ్ లో నర్గీస్ స్టన్నింగ్ గ్లామర్
| బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ‘దాదా’ సినిమా నుంచి ‘దాదా ధమాకా’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. తమన్ స్వరపరిచిన ఈ పాటను బాలకృష్ణ, శ్రీ పూర్ణిమ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి. పాటలో బాలయ్యతో పాటు నర్గీస్ ఫక్రీ సందడి చేశారు. డిసెంబర్ 24న ‘దాదా’ థియేటర్లలో విడుదల కానుంది.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ అనగానే మాస్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. వీరిద్దరి కలయికలో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'దాదా'. ఇప్పటికే ఈ సినిమాపై డీసెంట్ బజ్ ఏర్పడగా, ఇప్పుడు 'దాదా ధమాకా' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. జీ మ్యూజిక్ సౌత్ ద్వారా వచ్చిన ఈ పాట పక్కా పార్టీ మూడ్ లో హైలెట్ అయ్యింది.
ఈ పాటకు బాలకృష్ణ పాడడం మరో హైలెట్. సింగర్ రజినీ శ్రీ పూర్ణిమతో కలిసి బాలయ్య ఈ మాస్ నంబర్ ను ఆలపించారు. ముఖ్యంగా మధ్యలో ఆయన పాడిన హిందీ, తెలుగు మిక్స్ ర్యాప్ లైన్స్ అభిమానులకు కిక్కిచ్చేలా ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యంలో 'షహరంతా అదిరిపోనే.. నిదురంతా చెదిరిపోనే' అంటూ మొదలై, 'హే బావలే బావలే.. ఇక్కడున్నోళ్లంతా నాకు సొంత బావలే' అనే హుక్ లైన్ క్యాచీగా కుదిరింది.
సంగీత దర్శకుడు తమన్ మరోసారి బాలయ్య సినిమాకు తనదైన హై వోల్టేజ్ బీట్స్ అందించారు. క్లబ్ బ్యాక్ డ్రాప్ కు తగ్గట్లుగా హెవీ డ్రమ్స్, ఎలక్ట్రానిక్ సౌండ్స్ తో పాటను ఎనర్జిటిక్ గా మలిచారు. ఎక్కడా టెంపో తగ్గకుండా సాగే రిథమ్, మధ్యలో వచ్చే ఇంటర్ల్యూడ్స్ పాటకు మంచి ఊపు తెచ్చాయి. థియేటర్లలో మాస్ ఆడియన్స్ కు ఈ బీట్ త్వరగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ కలర్ ఫుల్ గా ఉన్నాయి. స్టడెడ్ లెదర్ జాకెట్, బ్లాక్ కళ్లద్దాలతో బాలకృష్ణ స్టైలిష్ గా కనిపిస్తూనే తనదైన మార్క్ స్వాగ్ తో అలరించారు. బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ గోల్డెన్ అవుట్ ఫిట్ లో గ్లామరస్ గా కనిపిస్తూ డ్యాన్స్ ఫ్లోర్ పై సందడి చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో వీరిద్దరి మధ్య వచ్చే స్టెప్పులు బాగున్నాయి.
పాట మధ్యలో షూటింగ్ స్పాట్ విజువల్స్ ను కూడా మిక్స్ చేశారు. సెట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని, మైక్ పట్టుకుని తమన్ ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ కూడా హైలెట్ అయ్యాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్ పాటకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి.
రొటీన్ మాస్ పాటలకు భిన్నంగా కాస్త క్లబ్ టచ్ తో 'దాదా ధమాకా' రూపొందింది. బాలయ్య ఎనర్జీ, నర్గీస్ గ్లామర్, తమన్ బీట్స్ తో ఈ ఫస్ట్ సింగిల్ డీసెంట్ గా ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న 'దాదా' థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ మాస్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.