ఇండస్ట్రీకి దూరం కానున్న మాస్టర్ భరత్.. వైరల్ న్యూస్ పై క్లారిటీ!
| నటనకు స్వస్తి చెప్పి డాక్టర్ వృత్తిపై దృష్టి పెట్టనున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మాస్టర్ భరత్ స్పష్టం చేశారు. తల్లి కోరిక, ప్రేక్షకుల ప్రేమతో నటుడిగా కొనసాగుతున్నానని తెలిపారు. ఒకవైపు వైద్య సేవలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తానన్నారు. మైత్రి మూవీ మేకర్స్‌లో ఓ సినిమాకు సంతకం చేశానని, మరో నాలుగైదు ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయని వెల్లడించారు. తన నటనా జీవితాన్ని వదులుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు.
సెలెబ్రిటీలు సినిమా ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చినా లేదా అవకాశాలు రాకపోయినా.. ఆ నటీనటులు మళ్లీ తెరపై కనిపించకపోయినా.. ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న మాస్టర్ భరత్ కూడా ఇండస్ట్రీకి దూరమై డాక్టర్ వృత్తిపై ఫోకస్ పెట్టనున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన తల్లి సినిమాలకు గుడ్ బై చెప్పేసి..డాక్టర్ వృత్తిపై పూర్తి ఫోకస్ పెట్టాలని చెప్పినట్లుగా ఆ వార్త తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఈ వార్తలపై ఒక వీడియోతో సహా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు మాస్టర్ భరత్.
ఒక వీడియో రిలీజ్ చేసిన భరత్ అందులో మాట్లాడుతూ.. "అమ్మకు జరిగిన ఒక విషయంపై సోషల్ మీడియాలో వచ్చిన మద్దతుకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞుడిని. ముఖ్యంగా ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు మాటలు రావడం లేదు. అలాగే ఇంకో విషయం పై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతోంది. నటనను పూర్తిగా వదిలేసి డాక్టర్ పైనే నీ దృష్టి పెట్టు.. అప్పుడే నాకు సంతోషం అని అమ్మ చెప్పినట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. నిజానికి ఆ రూమర్ వార్తలలో ఎటువంటి వాస్తవం లేదు.
దేవుడి దయవల్ల నేను చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. అయితే అమ్మ కోరిక ఏమంటే నేను ఏ సినిమాలో చేసినా సరే అది బెస్ట్ గా ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఇక సినిమా ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు.. ఆదరణకు ఉప్పొంగిపోయిన ఆమె.. నువ్వు ఒక మంచి యాక్టర్ అవ్వాలి అని నాతో చెప్పారు. అమ్మ కోరిక, దేవుడి దయ, మీ ప్రేమ కారణంగా నేను నటుడిగా కొనసాగుతున్నాను. అమ్మ ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవారు .."బాధలో ఉన్న వాళ్లకు నువ్వు నయం చేయు అని" ప్రస్తుతం దాన్ని కూడా చేస్తున్నాను ఒకవైపు అది చేస్తూనే ఇటు నటనను కూడా కొనసాగిస్తాను" అంటూ భరత్ క్లారిటీ ఇచ్చారు.
అలాగే ప్రస్తుతం మూవీ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. మైత్రి మూవీ మేకర్స్ లో ఒక చిత్రానికి సంతకం చేశాను. మరో నాలుగు ఐదు చిత్రాలు కథా చర్చల్లో ఉన్నాయి. మరో ప్రాజెక్టు విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఒక హిందీలో కథ కూడా వింటున్నాను. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే నేను మాత్రం నా నటన జీవితాన్ని వదులుకోను. ముఖ్యంగా మీ ప్రేమను అస్సలు వదులుకోను. మా అమ్మ కోరుకునేది కూడా ఇదే.. అంటూ తన కెరియర్ గురించి తన తల్లి చెప్పినట్టు వస్తున్న రూమర్స్ కి స్వయంగా స్పందించి చెక్ పెట్టారు మాస్టర్ భరత్.
2002లో నైనా సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన భరత్.. అంజి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చారు. తర్వాత రెడీ, బిందాస్ వంటి చిత్రాలలో అత్యుత్తమ నటన కనబరిచి ఉత్తమ బాల నటుడిగా రెండు నంది అవార్డులను కూడా అందుకున్నారు. పదుల సంఖ్యలో చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన భరత్.. 2019లో విడుదలైన ఏ బి సి డి అనే సినిమాలో సెకండ్ హీరోగా కూడా నటించాడు. తెలుగు, తమిళ్ మాత్రమే కాకుండా కన్నడలో కూడా నటించిన భరత్ రాజేశ్వరి, మై డియర్ భూతం వంటి సీరియల్స్ లో కూడా నటించారు.