ఏజ్ ఈజ్ జ‌స్ట్ ఎ నెంబ‌ర్.. మ‌రోసారి ప్రూవ్ చేసిన లాలెట్ట‌న్

స్టేజ్‌పై ఆయన చూపించిన చలాకీతనం, హావభావాలు, డ్యాన్స్‌లో కనిపించిన ఈజ్ చూసి అక్కడి ప్రేక్షకులు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో వీడియోలు చూసిన అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Update: 2026-06-27 12:29 GMT

సినీ పరిశ్రమలో వయసు పెరిగేకొద్దీ స్టార్ హీరోలు యాక్షన్, డ్యాన్స్ వంటి అంశాల్లో కాస్త నెమ్మదించడం సహజం. కానీ కొంతమంది మాత్రం ఆ సాంప్రదాయానికి పూర్తిగా భిన్నంగా నిలుస్తారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అలాంటి వారిలో ముందుంటారు. 66 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం, అదే ఎనర్జీతో స్టేజ్‌పై సందడి చేస్తూ ఏజ్ ఈజ్ జ‌స్ట్ ఎ నెంబ‌ర్ అనే మాటను మరోసారి నిజం చేశారు. రీసెంట్ గా జర్మనీలో నిర్వహించిన ఓ లైవ్ ఈవెంట్‌లో మోహన్‌లాల్ చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాహుబలి తో పాటు పలు హిట్ సాంగ్స్‌కు ఆయన వేసిన స్టెప్పులు ఆడియ‌న్స్ ను ఉర్రూతలూగించాయి. స్టేజ్‌పై ఆయన చూపించిన చలాకీతనం, హావభావాలు, డ్యాన్స్‌లో కనిపించిన ఈజ్ చూసి అక్కడి ప్రేక్షకులు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో వీడియోలు చూసిన అభిమానులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ వైరల్ వీడియోల ప్రత్యేకత కేవలం ఆయన డ్యాన్స్ మాత్రమే కాదు. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్ సాగించిన స్టార్ ఇప్పటికీ అదే ఉత్సాహంతో ప్రేక్షకులను అలరించగలగడం విశేషం. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం, స్టేజ్‌పై పూర్తి ఎనర్జీతో పెర్ఫార్మ్ చేయడం, ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం వంటి అంశాలు ఆయనను ఇప్పటికీ పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా నిలబెడుతున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ విష‌య‌మేంటంటే, గత కొంతకాలంగా మోహన్‌లాల్ పాత సినిమాల్లోని డ్యాన్స్ క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో వరుసగా వైరలవుతున్నాయి. ఒకప్పుడు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఆయన స్టెప్పులు ఇప్పుడు రీల్స్, షార్ట్ వీడియోల రూపంలో మ‌ళ్లీ బ‌య‌ట‌కు రావ‌డం విశేష‌మ‌నే చెప్పుకోవాలి. దీంతో ఒకప్పుడు ఆయన సినిమాలు చూసి పెరిగిన 90స్ ఆడియ‌న్స్ తో పాటూ Gen Z యూత్ కూడా లాలెట్టన్ డ్యాన్స్ స్టైల్‌పై ఆసక్తి చూపిస్తోంది.

సాధారణంగా పాత తరానికి చెందిన స్టార్‌లకు ఈ జెన‌రేష‌న్ ఫ్యాన్స్ ను సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. కానీ మోహన్‌లాల్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఆయన గ‌త సినిమాల పెర్ఫార్మెన్స్‌లు, తాజా స్టేజ్ షోలు రెండూ ఒకే స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటమే ఇందుకు నిదర్శనం. ఒక తరం జ్ఞాపకాల్లో నిలిచిన హీరో, మరో తరానికి కొత్తగా పరిచయమవుతున్న పెర్ఫార్మర్‌గా ఆయన మారుతున్నారు.

జర్మనీ స్టేజ్‌పై స్టెప్పులేసిన మోహన్‌లాల్ వేసిన మరోసారి ఆయన పాన్ ఇండియా ఇమేజ్‌ను గుర్తు చేస్తున్నాయి. భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించే సామర్థ్యం, వయసును మరిపించే ఎనర్జీ, తరాల మధ్య గ్యాప్‌ను చెరిపేసే స్క్రీన్ ప్రెజెన్స్... ఇవే మోహన్‌లాల్‌ను ఇప్పటికీ భారతీయ సినీ రంగంలోని అత్యంత అభిమానించబడే నటుల్లో ఒకరిగా నిలబెడుతున్నాయి.



Tags:    

Similar News