మూవీ లవర్స్‌ లో కన్ఫ్యూజన్.. పార్కింగ్ ఫీజు సంగతేంటి?

ఇటీవల హైదరాబాద్ దిల్‌సుఖ్‌ నగర్‌ లోని కోణార్క్ థియేటర్‌ లో ఒక ప్రేక్షకుడి నుంచి రూ.20 పార్కింగ్ ఫీజు వసూలు చేయడం వివాదానికి దారి తీసింది.;

Update: 2026-03-19 18:19 GMT

సినిమా అభిమానుల్లో మరోసారి గందరగోళం నెలకొంది. థియేటర్లలో పార్కింగ్ ఫీజుల విషయంలో ఇటీవల వచ్చిన కోర్టు తీర్పులు మూవీ లవర్స్‌ ను అయోమయంలోకి నెట్టాయి. మొన్నటి వరకు పార్కింగ్ ఫీజు రద్దు అవుతుందనే ఆశతో సంతోషించిన ప్రేక్షకులు.. ఇప్పుడు మళ్లీ అదే ఫీజు చెల్లించాల్సి రావడంతో నిరాశ చెందుతున్నారు.

ఇటీవల హైదరాబాద్ దిల్‌సుఖ్‌ నగర్‌ లోని కోణార్క్ థియేటర్‌ లో ఒక ప్రేక్షకుడి నుంచి రూ.20 పార్కింగ్ ఫీజు వసూలు చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా, మొదట విచారణ చేసిన సింగిల్ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. మల్టీప్లెక్స్‌ లు, షాపింగ్ మాల్స్‌ ల మాదిరిగా టికెట్ లేదా బిల్ చూపిస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ఉచిత పార్కింగ్ కల్పించాలని పేర్కొన్నారు.

ఆ తీర్పుతో రాష్ట్రవ్యాప్తంగా మూవీ లవర్స్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు! సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. తమ వాదనల్లో ఆ ఆదేశాలు థియేటర్ల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు.

అలాగే అసలు పిటిషన్ కేవలం ఒకే థియేటర్‌ కు సంబంధించినదని, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఆ వాదనలను పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను పూర్తిగా నిలిపివేయకుండా, వాటిని కేవలం కోణార్క్ థియేటర్‌ కే పరిమితం చేస్తూ స్టే విధించింది.

దీంతో కోణార్క్ థియేటర్‌ను మినహాయించి, రాష్ట్రంలోని మిగతా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే మార్గం మళ్లీ సుగమమైంది. ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఇప్పటికే సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో ఆహార పదార్థాల ఖర్చులు పెరగడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో వెనుకంజ వేస్తున్నారు.

ఇప్పుడు పార్కింగ్ ఫీజు అదనపు భారంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు థియేటర్ యాజమాన్యాలు మాత్రం కోర్టు నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇచ్చిన జీవో 121 ప్రకారం పార్కింగ్ ఫీజు వసూలు చేసే అవకాశం అవసరమని వారు చెబుతున్నారు. ఆదాయం లేకుండా థియేటర్ల నిర్వహణ కష్టమవుతుందని పేర్కొంటున్నారు.

మొత్తానికి, కోర్టు తాజా నిర్ణయంతో ఒకవైపు థియేటర్ యజమానులకు ఊరట లభించగా, మరోవైపు మూవీ లవర్స్ మాత్రం కన్ఫ్యూజన్‌ లో పడిపోయారు. ఏ థియేటర్‌ లో ఫీజు వసూలు చేస్తారు? ఎక్కడ ఉచితం ఉంటుంది? అనే సందేహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుది తీర్పు వచ్చేవరకు గందరగోళం కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా చూడటానికి వెళ్లే సాధారణ ప్రేక్షకుడికి మాత్రం పార్కింగ్ ఫీజు వ్యవహారం ఇంకా తలనొప్పిగానే ఉంది.

Tags:    

Similar News