నెగెటివిటీని పారిపోయేలా చేయాలంటే..!
క్వీన్ కంగనకు ఉన్న ఏకైక ఆప్షన్ సరైన బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం. ఒకే ఒక్క హిట్టు అన్నిటినీ మార్చేస్తుంది. వ్యాపారవర్గాలను, ఇండస్ట్రీ సహచరులను తనవైపునకు తిప్పుకునే బలం ఇస్తుంది.
ఎటు చూసినా నెగెటివిటీ.. ఏలిన్నాటి శని వెంటాడుతుంటే ఎవరైనా ఏం చేయగలరు? అసలు కంగన అంటేనే నెగెటివిటీ స్ప్రెడ్ అయిపోతోంది. అనవసరంగా నోరు పారేసుకుంటుందని, ఎంత పెద్ద స్థాయి వ్యక్తులను అయినా ఎదురిస్తుందని... నోటి దురుసు ఎక్కువ అని రకరకాలుగా పరిచయం అవుతోంది. ఇప్పటివరకూ ఇండస్ట్రీలో చాలామందితో విరోధం పెట్టుకోవడం తనకు మైనస్ గా మారింది. సినీపరిశ్రమలోనే కాదు.. రాజకీయంగాను శత్రువులున్నారు. తాను ఏం చేస్తున్నా వ్యతిరేకత... అయితే వీటన్నిటికీ అసలైన సమాధానం ఏది? పరిస్థితుల్ని తిరిగి తనవైపు తెచ్చుకునేలా పాజిటివిటీని పెంచుకోవాలంటే ఏం సాధించాలి! ...అంటే...
క్వీన్ కంగనకు ఉన్న ఏకైక ఆప్షన్ సరైన బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం. ఒకే ఒక్క హిట్టు అన్నిటినీ మార్చేస్తుంది. వ్యాపారవర్గాలను, ఇండస్ట్రీ సహచరులను తనవైపునకు తిప్పుకునే బలం ఇస్తుంది. ఇప్పుడు క్వీన్ సీక్వెల్ తో ఇది సాధ్యమవుతుందని కంగన నమ్ముతోంది. తాజా సమాచారం మేరకు... వరుస పరాజయాల నుంచి తనను బయట పడేసేంత సక్సెస్ ని `క్వీన్ 2` ఇస్తుందని కంగన నమ్ముతోంది. తాజా సమాచారం మేరకు `క్వీన్ 2` షూటింగ్ శరవేగంగా సాగుతోంది. జూలై మొదటి వారానికి టాకీ పార్ట్ సహా చిత్రీకరణ మొత్తం పూర్తి కానుందని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం తగినంత సమయం కేటాయించి, ఈ సీక్వెల్‌ను 2027లో భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మొదటి భాగంలో లండన్, పారిస్ వంటి విదేశీ నగరాలలో ఒంటరిగా ప్రయాణించి తనను తాను ఆవిష్కరించుకునే అమ్మాయిగా కంగనా కనిపించారు. అయితే ఈ సీక్వెల్‌లో కథాంశం భారతదేశంలోని పలు మహా నగరాల చుట్టూ తిరగబోతోంది. విభిన్న సంస్కృతులను, సరికొత్త జీవిత అనుభవాలను క్వీన్ పాత్ర ఎలా స్వీకరించిందనే కోణంలో కథ సాగుతుంది. ఈ చిత్రంలో కంగనా, తన స్నేహితులపై ఒక ప్రత్యేకమైన `దాండియా సాంగ్` ను కూడా మేకర్స్ గ్రాండ్‌గా చిత్రీకరించారు. ప్రస్తుతం కేవలం కొన్ని సీన్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి.
బాలీవుడ్ లో అసాధారణ నట ప్రతిభ ఉన్న కంగన రనౌత్ కి ఇన్నాళ్లు కాలం కలిసి రాలేదు. వరుసగా అరడజను భారీ ఫ్లాపులు రావడం నిరాశపరిచింది. అయితే ప్రతి ఒక్కరికీ ఇలాంటి ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. ప్రతిభ ఉన్నా కాలం కలిసి రాదు. ఒకసారి సరైన విజయం వరిస్తే, అదే హుషారులో వరుస పెట్టి జోష్ తో అనుకున్నది సాధించుకునే వీలుంటుంది. అలాంటి ఒక మంచి హిట్టు కోసం కంగన ఇప్పుడు తపిస్తోంది. తనపై ఉన్న నెగెటివిటీని పూర్తిగా చెరిపేయడమే ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం.