టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు ఎన్టీఆర్ శ్రీకారం చుడతాడా?

ఒకవైపు భారీ కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు పరిమిత బడ్జెట్‌తో బలమైన కథలున్న సినిమాల్లో నటించడానికి పలువురు స్టార్ నటులు ముందుకు వస్తున్నారు.

Update: 2026-06-28 04:05 GMT

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌లో స్టార్ హీరోలంతా వందల కోట్ల బడ్జెట్‌లతో తెరకెక్కుతున్న భారీ సినిమాల‌కే ప్రాధాన్యం ఇస్తున్న వేళ, ఎన్టీఆర్ చేసిన తాజా కామెంట్స్ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. లో బడ్జెట్‌తో, కేవలం 40 వర్కింగ్ డేస్‌లో పూర్తయ్యే ఒక చిన్న సినిమా చేయాలనుంద‌ని, అవసరమైతే ఆ సినిమాను తానే రిలీజ్ చేసుకుంటాన‌ని, ఏదొక రోజు కచ్చితంగా ఆ కలను నిజం చేసుకుంటాన‌ని ఆయన చెప్పడం విశేషంగా మారింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నుంచి ఇలాంటి ఆలోచన రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ కామెంట్స్ చూస్తే, స్టార్‌డమ్ ఎంత పెరిగినా కథకు, యాక్టింగ్ కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు చేయాలనే కోరిక ఆయనలో ఇంకా బలంగానే ఉందని అర్థమవుతోంది.

గత కొన్నేళ్లుగా భారతీయ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఒకవైపు భారీ కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు పరిమిత బడ్జెట్‌తో బలమైన కథలున్న సినిమాల్లో నటించడానికి పలువురు స్టార్ నటులు ముందుకు వస్తున్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహాద్ ఫాసిల్, విజయ్ సేతుపతి వంటి నటులు ఈ విషయంలో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌ల మధ్య కూడా చిన్న కథలకు అవకాశం ఇస్తూ నటుడిగా తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.

టాలీవుడ్‌లో మాత్రం ఈ తరహా ప్రయత్నాలు స్టార్ హీరోల స్థాయిలో ఇంకా పెద్దగా కనిపించలేదు. ఒకసారి పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత హీరోల షెడ్యూల్స్, మార్కెట్ అంచనాలు, బిజినెస్ ఒత్తిళ్లు అన్నీ భారీ సినిమాల‌ చుట్టూనే తిరుగుతున్నాయి. అలాంటి సమయంలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఫ్యూచ‌ర్‌లో కొత్త చర్చకు నాంది పలికే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ఆయన చెప్పిన 40 రోజుల షూటింగ్, లో బడ్జెట్ అనే అంశాలు సాధారణ కామెంట్స్ లాగా కాకుండా, ఒక నటుడిగా తన ప‌ర్స‌న‌ల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ఉన్న స్పష్టమైన ఆలోచనను ప్రతిబింబిస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కమర్షియల్ లెక్కల కంటే కథపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దృష్టంతా డ్రాగన్‌తో పాటూ తదుపరి భారీ ప్రాజెక్టులపైనే ఉన్నప్పటికీ, ఫ్యూచ‌ర్ లో ఆయన నిజంగానే ఇలాంటి చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే, అది టాలీవుడ్ స్టార్ హీరోల ఆలోచనా విధానంలో కొత్త మార్పుకు శ్రీకారం చుట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేం. స్టార్ హీరోలు భారీ సినిమాల‌తో పాటు మధ్యస్థాయి లేదా లో బడ్జెట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేయాలనే కొత్త ట్రెండ్‌కు ఎన్టీఆర్ నాంది పలుకుతాడా? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం రానున్న రోజుల్లోనే తెలుస్తుంది.

Tags:    

Similar News