హాస్య బ్రహ్మ నోట.. కన్నీటి మాట!

Update: 2020-04-25 07:30 GMT
టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఎన్నో ఏళ్లుగా వెండితెర పై ఆయన నటనతో ప్రేక్షకులు ముఖాలలో నవ్వులు పూయిస్తున్నారు. ఎన్నో వందల సినిమాలు చేసిన బ్రహ్మి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. అంతటి స్టార్ నటుడు కొంతకాలంగా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన బ్రహ్మి ఇటీవలే మహాకవి శ్రీశ్రీ బొమ్మ గీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక తాజాగా బ్రహ్మి తన జీవితంలో జరిగిన చిన్ననాటి సంఘటనలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. లాక్ డౌన్ నేప‌థ్యంలో ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. చిన్నప్పటి ఆకలి రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘జీవితంలో పూట భోజనం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా ఆకలికి అలమటించిన రోజులు చాలా ఉన్నాయి.

మా నాన్న భోజనం పెట్టే వరకూ మా ఆరుగురు అన్నదమ్ముల ఎదురు చూపులు నాకింకా గుర్తున్నాయి. కొన్నిసార్లు కేవలం మంచినీళ్లు తాగి పడుకొన్న రోజులు ఉన్నాయి. రెక్కాడితో కానీ డొక్కాడదనే పరిస్థితి నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు. అలాంటి పరిస్థితులను దాటి ఎంఎ చదివి లెక్చరర్‌ ఉద్యోగం లో చేరాను. ఈరోజు ఇంతటి స్థాయికి వచ్చానంటే.. సహనం, ఓర్పుతోనే సాధ్యం అని తెలిసు కాబట్టి చెప్తున్నా. ఆకలితో కడుపు మాడే రోజులు భయంకరంగా ఉంటాయి. 18 రోజులు తిండి తినకపోతే చనిపోతారంటారు. 17 రోజులు ఎవరి ముందు చేతులు చాచొద్దు. 18వ రోజు అడుక్కోరా.. లేకపోతే చచ్చిపోతావు అని మా నాన్న నాకు చెప్పేవారు’’ అని బ్ర‌హ్మి ఎమోషనల్ అయిపోయారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో మనకోసం పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, పోలీసుల్ని, పాత్రికేయుల్ని అభినందించాలని.. బ్ర‌హ్మి అన్నాడు.
Tags:    

Similar News