సీఎం గారు కూడా నా సినిమా చూసి "సూపర్ రా" అంటారు: విశ్వక్ సేన్
"మీరు మాకు వేలు చూపిస్తే.. మేము కూడా చూపిస్తాం, అప్పుడు మీకు బాధగా ఉంటుంది" అంటూ తనదైన స్టైల్‌లో క్లాస్ తీసుకున్నారు.;
యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, ఇప్పుడు 'కల్ట్' అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్‌గా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక టీజర్‌లో డ్రగ్స్ పబ్ కల్చర్ చూపించడంపై కొందరు అడిగిన ప్రశ్నలకు విశ్వక్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సినిమాలో డ్రగ్స్ వాడితే ముక్కు కోస్తా అనే రేంజ్ లో తాను ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటానని, డ్రగ్స్ వాడితే జీవితాలు ఎలా నాశనం అవుతాయనేది సినిమాలో క్లియర్ గా చూపించినట్లు వెల్లడించారు. టీజర్‌లో కనిపించేది కేవలం ఒక భాగం మాత్రమేనని, కొందరికి ఏది ఇష్టమో అవే ఎక్కువగా కనిపిస్తాయని చురకలు అంటించారు.
ఇక తాను సినిమాని ఏ ఇంటెన్షన్ తో తీశానో అది రిలీజ్ అయ్యాక అర్థమవుతుందని విశ్వక్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తన సినిమా చూసి "సూపర్ రా" అని మెచ్చుకుంటారని అంత నమ్మకంతో చెప్పారు. ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ 'కల్ట్' చిత్రాన్ని రూపొందించానని, ఎక్కడా యూత్ ను తప్పుదోవ పట్టించే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు.
అంతేకాకుండా, కొందరు మాట్లాడే భాషపై కూడా విశ్వక్ అసహనం వ్యక్తం చేశారు. గతంలో నాని గురించి మాట్లాడుతూ "అలా తయారయ్యాడు" అని అన్నారని, ఇప్పుడు తన గురించి కూడా అదే పదం వాడుతున్నారని మండిపడ్డారు. కనీస మర్యాద ఇవ్వకుండా మాట్లాడటం సరికాదని, తాము కూడా మనుషులమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూటిగా చెప్పారు.
"మీరు మాకు వేలు చూపిస్తే.. మేము కూడా చూపిస్తాం, అప్పుడు మీకు బాధగా ఉంటుంది" అంటూ తనదైన స్టైల్‌లో క్లాస్ తీసుకున్నారు. ఈ సినిమా కథ గురించి చెబుతూ, ఇది తన సొంత కథ అని, గత నాలుగేళ్లుగా స్క్రాచ్ నుండి రాసుకున్నానని వెల్లడించారు. 'ఫలక్ నామా దాస్' సినిమా తీసినప్పటి కంటే పది రెట్లు ఎక్కువ కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని విశ్వక్ అన్నారు. సోషల్ మీడియాలో ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, సినిమాల్లో ఏది మిస్ అవుతున్నారు అనేవి గమనించి ఈ కథను పర్ఫెక్ట్‌గా సిద్ధం చేసినట్లు చెప్పారు.
తరుణ్ భాస్కర్ డైలాగ్స్ తో పాటు రవి బస్రూర్ మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ అసెట్స్ అని ఆయన వివరించారు. ఇక 'కల్ట్' టీజర్ ఈవెంట్ ద్వారా విశ్వక్ సేన్ సినిమాపై ఉన్న అంచనాలను మరో లెవల్‌కి తీసుకెళ్లారు. ఇక ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ మూవీ కాదని, బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద స్కెచ్ అని విశ్వక్ మాటలను బట్టి అర్థమవుతోంది. మరి విశ్వక్ సేన్ అన్నట్టుగా ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందో లేదో చూడాలి.