విశ్వక్ 'కల్ట్'.. టీజర్ ఎలా ఉందంటే?
యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.;
యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంతో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కల్ట్ టీజర్ విడుదలై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుంటూ మెప్పిస్తోంది.
రా, బ్లడీ, స్టైలిష్ విజువల్స్ తో కల్ట్ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే దర్శకుడిగా ఫలక్ నామా దాస్, దాస్ కా ధమ్కీ చిత్రాలతో విశ్వక్ మాస్ టచ్ చూపించారు. ఆ సినిమాలు ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు కల్ట్ అనే టైటిల్ కే తగ్గట్టు, ఈసారి మరింత బోల్డ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు టీజర్ ను తీసుకొచ్చారు.
అయితే టీజర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. లా, లిమిట్స్ లేని అన్ లిమిటెడ్ పార్టీ పేరుతో యువతను గోవాకు ఆహ్వానిస్తారు. అక్కడ మొదట సరదాగా మొదలైన వేడుకలు క్రమంగా మలుపు తిరుగుతాయి. ఒక్కసారిగా హోలోగ్రామ్ రూపంలో ఓ వాయిస్ కనిపించి గేమ్స్ ఆడాలని ప్రకటిస్తుంది. ఆ గేమ్స్ లో ఓడిపోయిన వారిని హతమార్చడం మొదలవుతుంది. దీంతో సినిమా స్లాషర్ థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్తుంది.
ఈ తరహా స్లాషర్ జానర్ ఇండియన్ సినిమాల్లో చాలా అరుదు. అందుకే ఈ ప్రయత్నం కొత్తగా కనిపిస్తోంది. వయోలెన్స్, యాక్షన్, థ్రిల్ అంశాలను విశ్వక్ సేన్ తన స్టైలిష్ ఫ్రేమింగ్ తో చూపించడం టీజర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. భయపెట్టే సన్నివేశాల మధ్య కూడా ప్రేక్షకుడు ఎక్కడా ఇబ్బంది పడకుండా మేకింగ్ చేయడం విశేషం. విశ్వక్ ఎంట్రీ కూడా స్పెషల్ గా ఉందనే చెప్పాలి.
తరుణ్ భాస్కర్ అందించిన డైలాగ్స్.. పరిస్థితులకు తగ్గట్టు ఉండి టీజర్ కు మరింత బలం చేకూర్చింది. హీరోయిన్ గా గాయత్రి భరద్వాజ్ నటిస్తుండగా, ఏకంగా 40 మంది కొత్త నటీనటులను పరిచయం చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఒకే సినిమాలో ఇంతమంది కొత్తవారికి అవకాశం ఇవ్వడం టాలీవుడ్ లో అరుదైన విషయం అని అంతా చెబుతున్నారు.
హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న కల్ట్ మూవీని నిర్మాత సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. రిచ్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మెయిన్ అసెట్ గా మారింది. ఆయన మ్యూజిక్ సీన్స్ కు థ్రిల్ యాడ్ చేసింది. ఏదేమైనా కల్ట్ నార్మల్ కమర్షియల్ మూవీ కాదని టీజర్ స్పష్టంగా చెబుతోంది. మరి సినిమా నిజంగానే కల్ట్ హిట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.