4 ఏళ్ల ఎదురు చూపులు... ఇలా ఉన్నావేంటన్నా?

కన్నడ స్టార్‌ యశ్‌ చివరగా 2022లో కేజీఎఫ్‌ : చాప్టర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.;

Update: 2026-02-21 11:30 GMT

కన్నడ స్టార్‌ యశ్‌ చివరగా 2022లో కేజీఎఫ్‌ : చాప్టర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2 సినిమాలు బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో యశ్‌ నుంచి తదుపరి రాబోతున్న సినిమా సైతం ఆ స్థాయిలో ఉండాలని ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు బలంగా కోరుకున్నారు. అందుకు తగ్గట్లుగానే యశ్‌ తన తదుపరి సినిమా ఉండాలనే ఉద్దేశంతో దాదాపుగా ఏడాదిన్నర రెండేళ్లు వెయిట్‌ చేసి టాక్సిక్ సినిమాకు కమిట్‌ అయిన విషయం తెల్సిందే. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేశారు. మొదట ఈ సినిమాను ఏడాదిలో పూర్తి చేసి విడుదల చేయాలని భావించారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా ఏకంగా రెండేళ్లు మేకింగ్‌ జరిగింది. యశ్‌ నుంచి సినిమా కోసం ప్రేక్షకులు నాలుగు ఏళ్లుగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

యశ్‌ నుంచి రాబోతున్న టాక్సిక్ సినిమా...

కేజీఎఫ్‌ 2 తర్వాత యశ్‌ ఏడాది గ్యాప్‌ తీసుకున్న సమయంలో అభిమానులు మరీ ఇంత గ్యాప్‌ ఎందుకు భయ్యా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ తదుపరి సినిమాను వెంటనే మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కానీ యశ్‌ మాత్రం స్క్రిప్ట్‌ విషయంలో తాను పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే కెమెరా ముందుకు వెళ్లాడు. సినిమాలతో వార్తల్లో లేకున్నా ఏదో ఒక పర్సనల్‌ ఇష్యూ లేదా ఇతర సినిమాల ప్రమోషన్‌ సమయంలో యశ్‌ కనిపిస్తూ వచ్చాడు. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా యశ్ ఎక్కువ గడ్డంతోనే కనిపించాడు. కేజీఎఫ్ మొదలైనప్పటి నుంచి దాదాపుగా ఆరు ఏడు ఏళ్లుగా యశ్‌ ను గడ్డం లేకుండా చూడలేదు. ఆయన కెరీర్‌ ఆరంభంలో గడ్డం లేకుండా నటించిన సినిమాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు గడ్డం లేకుండా ఆయన్ను ఊహించుకోవడం కష్టంగా ఉందని అభిమానులు పలు సందర్భాల్లో మాట్లాడుకున్నారు.

కేజీఎఫ్‌ 2 సినిమా తర్వాత...

తాజాగా టాక్సిక్ సినిమా నుంచి వచ్చిన టీజర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా అందరి అంచనాలు అందుకునే భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా నిలువబోతుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్‌ స్థాయికి యాక్షన్‌ తగ్గదని తాజా టీజర్ ను చూస్తే అనిపిస్తోంది. అయితే ఈ టీజర్‌ లో యశ్‌ కొన్ని షాట్స్ లో గడ్డం లేకుండా కనిపించడం ను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. మరీ ఇలా నటించేందుకు ఒప్పుకున్నావు భయ్యా అంటూ సోషల్‌ మీడియా ద్వారా యశ్‌ ను ప్రశ్నిస్తున్నారు. టీజర్‌ లో ఆ షాట్స్ ను స్క్రీన్‌ షాట్‌ తీసి మరీ సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. మళ్లీ పాత యశ్‌ ను చూడబోతున్నామని కొందరు అంటే, బాబోయ్ మళ్లీ యశ్‌ పాన్ ఇండియా నుంచి లోకల్‌ స్టార్‌గా మారుతాడా అని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తూ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉన్నారు.

గడ్డంతో కనిపించిన యశ్‌...

యశ్‌ వంటి స్టార్‌ ఇంత గ్యాప్‌ తీసుకోవడం అస్సలు కరెక్ట్‌ కాదు అనేది ఆయన అభిమానులు మాత్రమే కాకుండా అందరూ అంటున్న మాట. ఎందుకంటే యశ్‌ కు ఉన్న మార్కెట్‌ స్టామినాకి ఏడాదికి కనీసం ఒక సినిమాతో అయినా వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీలో ఉన్న వారు బాగుంటారు అనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. టాక్సిక్ సినిమా తర్వాత అయినా యశ్‌ వరుసగా సినిమాలు చేస్తాడా అనేది చూడాలి. టాక్సిక్ సినిమాలో గడ్డం లేకుండా ఎక్కువ సమయం కనిపించక పోవచ్చు. ఒకవేళ ఆ సీన్స్ కి మంచి స్పందన వస్తే కచ్చితంగా యశ్‌ ముందు ముందు మళ్లీ గడ్డం లేకుండా నటించే అవకాశాలు లేకపోలేదు అని ఆయన సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి నాలుగు ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు గడ్డం లేకుండా కనిపించి కాస్త గందరగోళంలో పడేసినట్లు యశ్‌ చేశాడు అనేది చాలా మంది అభిప్రాయం. మరి టాక్సిక్‌ ఫలితంతో ఈ విమర్శలన్నింటిని యశ్‌ తూడ్చి పెడుతాడా అనేది కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News