విశ్వక్ సేన్ 'కల్ట్'.. ఫ్యామిలీస్ రావద్దు అంటూ..
ఈ సినిమా వెనుక ఉన్న ఇన్‌స్పిరేషన్ గురించి చెబుతూ, ఆడియన్స్ టేస్ట్‌ను తాను ఎలా గమనించారో వివరించారు.;
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అంటేనే ఒక హై వోల్టేజ్ వైబ్. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన మార్క్ చూపిస్తున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు 'కల్ట్' అనే సరికొత్త థ్రిల్లర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. రీసెంట్‌గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా హీరోలు తమ సినిమాను అందరూ చూడాలని కోరుకుంటారు, కానీ విశ్వక్ మాత్రం దీనికి భిన్నంగా కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్ ఒక షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు కొంచెం దూరంగా ఉంటేనే మంచిదని ఓపెన్‌గా చెప్పేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలను ఈ సినిమాకు అస్సలు తీసుకురావద్దని సజెస్ట్ చేస్తున్నారు. గుండె ధైర్యం తక్కువగా ఉన్నవాళ్లు కూడా తన సినిమా జోలికి రావద్దంటూ నవ్వుతూనే ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే సినిమాలో వయోలెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
'కల్ట్' సినిమా కథ గురించి కూడా విశ్వక్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ స్టోరీని ఆయన గత నాలుగేళ్లుగా సొంతంగా రాసుకుంటున్నారట. తన గత చిత్రాలైన 'ఫలక్ నామా దాస్' రీమేక్ అని, 'ధమ్కీ'కి వేరే వాళ్ళ దగ్గర కథ తీసుకున్నానని, కానీ 'కల్ట్' మాత్రం స్క్రాచ్ నుండి తనే రాసుకున్న అసలైన కథ అని స్పష్టం చేశారు. తన విజన్ క్లియర్‌గా ఉండటం వల్లే ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని డిసైడ్ అయినట్లు వెల్లడించారు.
ఈ సినిమా వెనుక ఉన్న ఇన్‌స్పిరేషన్ గురించి చెబుతూ, ఆడియన్స్ టేస్ట్‌ను తాను ఎలా గమనించారో వివరించారు. రెడిట్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో జనాలు ఏం కోరుకుంటున్నారు, సినిమాల్లో ఏది మిస్ అవుతున్నారు అనేది గమనించే ఈ కథను సిద్ధం చేసినట్లు చెప్పారు. వాటన్నింటినీ ఒక మిక్సీలో వేసి కొట్టినట్టుగా పర్ఫెక్ట్‌గా ఈ 'కల్ట్' స్క్రిప్ట్‌ను తయారు చేశానని నమ్మకంగా చెబుతున్నారు. యువతకు నచ్చే ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉండేలా జాగ్రత్త పడ్డారట.
విశ్వక్ తన కెరీర్ మొదట్లో 'ఫలక్ నామా దాస్' తీసినప్పుడు తనలో ఎంత ఆకలి, కోపం, కసి ఉన్నాయో.. ఇప్పుడు ఈ సినిమా కోసం అది పది రెట్లు పెరిగిందని అన్నారు. టీజర్‌లో చూసింది కేవలం ఒక చిన్న షాట్ మాత్రమేనని, అసలైన మజా అంతా వెండితెరపైనే ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కథకు హాలీవుడ్ మూవీ 'ప్రాజెక్ట్ ఎక్స్' కొంత ఇన్‌స్పిరేషన్ అని కూడా విశ్వక్ వెల్లడించడం విశేషం. తన కెరీర్‌లో ఇది ఒక పెద్ద స్కెచ్ అని తనదైన స్టైల్‌లో ముగించారు. ఇక 'కల్ట్' టీజర్ ఒక కొత్త రకమైన వైబ్‌ని క్రియేట్ చేసింది. ఏకంగా 40 మంది కొత్త నటీనటులను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తూ విశ్వక్ ఒక పెద్ద సాహసమే చేస్తున్నారు. మరి విశ్వక్ సేన్ అన్నట్టుగా ఈ సినిమా నిజంగానే థియేటర్లలో ఊచకోత అనేలా కల్ట్ హిట్ అవుతుందో లేదో చూడాలి.