గుడి ముందు అడుక్కుని తింటూ 100 సినిమా కథలు రాశాడట

Update: 2019-09-17 07:39 GMT
సినిమాలపై మోజుతో ప్రతి రోజు ఎంతో మంది హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌ లో అడుగు పెడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియదు.. ఎవరిని కలవాలో తెలియదు.. ఎవరిని నమ్మాలో తెలియదు. కాని ఏదో ఒకటి సాధించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా ప్రతిభను నలుగురికి చూపించుకుని ఛాన్స్‌ లు దక్కించుకునే వీలుంది. కాని ఒకప్పుడు సినిమాపై మోజుతో వచ్చిన వారు జీవితాలను నాశనం చేసుకుని రోడ్డున పడి చాలా కష్టపడ్డ వారు ఉన్నారు. అందులో ఒకరు కొండా రామారావు.

ఈయన గత 55 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో గుర్తింపు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు విఫలం అవ్వడంతో ప్రస్తుతం గుడి ముందు అడుక్కుని తింటూ ఫుట్‌ పాత్‌.. బస్టాండ్‌ లో జీవనం సాగిస్తున్నాడు. ఈయన నటుడిగా ప్రయత్నాలు చేసి విఫలం అవ్వడంతో కథల రచయితగా మారాడు. రోడ్డు మీద కూర్చుని పదుల కొద్ది కథలను ఈయన రాశాడు. ఇప్పటి వరకు తాను 100 కథలు రాశానని.. కాని ఏ ఒక్కరు కూడా నా కథను వినేందుకు ముందుకు రాలేదంటూ రామారావు చెప్పుకొచ్చాడు.

సినిమాల్లో అవకాశాల కోసం మొదట్లో చెన్నై వెళ్లిన రామారావు అక్కడ ఎన్టీఆర్‌.. ఏయన్నార్‌.. గీతాంజలి.. జయలలిత వంటి వారి ఇంట్లో పని చేస్తూ సినిమాల్లో ఛాన్స్‌ ల కోసం ప్రయత్నించే వాడు. చిన్న పాత్ర అయినా చేసి గుర్తింపు దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎంతగా కష్టపడ్డా నటుడిగా ఛాన్స్‌ దక్కలేదు. చెన్నై నుండి హైదరాబాద్‌ కు సినిమా ఇండస్ట్రీ తరలి రావడంతో రామారావు కూడా హైదరాబాద్‌ చేరాడు. జూనియర్‌ ఆర్టిస్టుగా మారిన రామారావు చిన్న చిన్న వేషాలు వేసేవాడు. కాని వాటి వల్ల అతడికి వచ్చిన గుర్తింపు ఏమీ లేదు. అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే భార్య అంజమ్మ చనిపోవడం.. ఆ తర్వాత ఇద్దరు బిడ్డల పెళ్లిలు చేసి పంపడంతో రామారావు ఒంటరి అయ్యాడు.

రామారావు రోడ్డున పడ్డా కూడా సినిమాలపై మోజు మాత్రం తగ్గలేదు. నటుడిగా రాణించాలనే ఆశ వదిలేసి రచయితగా పేరు దక్కించుకోవాలని పెన్ను పేపర్‌ పట్టాడు. రోడ్డు మీద.. ఫుడ్‌ బోర్డ్‌ మీద ఇలా ఎక్కడ కూర్చున్నా కూడా కథలు రాస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు 100 కథలు రాశానంటూ స్వయంగా రామారావు చెప్పుకొచ్చాడు. వర్షం వచ్చిన సమయంలో నేను రాసిన కథలు చాలా వరకు తడిచి నాశనం అయ్యాయి. అయినా ఇంకా రాస్తూనే ఉన్నాను. నాకు అవకాశం రాకున్నా పర్వాలేదు కాని నేను కథలు రాస్తున్నందుకు చాలా సంతృప్తిగా అనిపిస్తుందన్నాడు.
4

ఫిల్మ్‌ నగర్‌ లోని రాజరాజేశ్వరీ దేవాలయం వద్ద ప్రతి రోజు మూడు గంటలు కూర్చుని అడుక్కుంటానని.. 50 రూపాయలు రాగానే అక్కడ నుండి లేచి పోతాను. ప్రతి రోజు తినడానికి ఆ 50 రూపాయలు సరిపోతాయి. అంతకు మించి నాకు అక్కర్లేదని రామారావు అంటాడు. ప్రతి రోజు దిన పత్రికలు చదవడంతో పాటు సామాజిక విషయాలను తెలుసుకుంటూ నేను కథలు రాస్తూ ఉంటాను. ఇప్పటి వరకు సాంఘీక.. పౌరాణిక.. బయోపిక్‌ కథలు ఎన్నో రాశానని రామారావు అన్నారు. ఇంకొన్నాళ్లకైనా నా కథల కోసం.. నాకు దర్శకత్వం అవకాశం ఇచ్చేందుకు ఏ నిర్మాత అయినా వస్తాడేమో అనే ఆశ ఉందని.. ఆశతోనే నేను జీవిస్తున్నాను అన్నాడు.
Tags:    

Similar News