స్టార్ హీరో కాల్ చేస్తే గుర్తుపట్టలేకపోయాను: అవసరాల

Update: 2021-09-07 08:31 GMT
త్రివిక్రమ్ .. కొరటాల .. అనిల్ రావిపూడి వంటి రచయితలు ఆ తరువాత మెగాఫోన్ పట్టేసి దర్శకులుగా మారిపోయారు. ఇక గొల్లపూడి .. తనికెళ్ల భరణి .. ఎల్బీ శ్రీరామ్ వంటి రచయితలు నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నటుడిగా .. రచయితగా .. దర్శకుడిగా కూడా అవసరాల శ్రీనివాస్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నూటొక్క జిల్లాల అందగాడు'కి అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' వేదిక ద్వారా తన కెరియర్ ముచ్చట్లు పంచుకున్నారు.

"నేను పుట్టింది కాకినాడలో .. ఆ తరువాత నాన్న ఉద్యోగ రీత్య అనేక ప్రాంతాలకు తిరగవలసి వచ్చింది. అన్నయ్య యూఎస్ లో ఉంటాడు. నేను ఇండస్ట్రీకి వచ్చింది అక్కడి నుంచే. సినిమాల పట్ల ఇంట్రెస్ట్ తోనే నేను ఇక్కడికి వచ్చాను. 'అష్టా చెమ్మా' సినిమాలో అవకాశం రావడం .. ఆ సినిమా విజయావంతం కావడం జరిగింది. దాంతో నేను అక్కడ ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చేశాను. సినిమాల్లో చేయడం .. తీయడం అంత తేలికైన విషయం కాదని నాకు చాలామంది చెప్పారు. కానీ ఆ మాటలు పట్టించుకోకుండా నేను రావడం జరిగింది.

సినిమా అంటే ఉన్న ఇష్టం కారణంగానే అలా చేశాను. నేను 'అష్టా చెమ్మా' సినిమా చేసిన విషయం, ఆ సినిమా ట్రైలర్ వచ్చేవరకూ ఇంట్లో వారికి తెలియదు. ఆ ట్రైలర్ చూడగానే 'ఇప్పుడు చేస్తే చేశావ్ గానీ .. ఇంకెప్పుడూ చేయకు' అని మా నాన్నగారు అన్నారు. సినిమాలు అందరికీ వర్కౌట్ అయ్యేవి కాదనే ఒక భయం ఆయనలో ఉండొచ్చు. నేను 'ఊహలు గుసగుసలాగే' తీసిన తరువాత, ఆ సినిమా చూసి ఆయన మెచ్చుకున్నారు. చిన్నప్పుడు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఊహతెలిసిన తరువాత .. ఒక సినిమా వెనుక ఎంతమంది పని చేస్తారనేది అర్థమైంది.

మొదట్లో ఆర్టిస్టు కావాలని ఉండేది. ఆ తరువాత ముళ్లపూడి వెంకటరమణగారు సినిమాలకి రాసే విధానం చూసిన తరువాత, రచయితగా ప్రయాణం కొనసాగించాలని అనుకున్నాను. మధ్య మధ్యలో కెరియర్ పరంగా గ్యాపులు వచ్చాయిగానీ, నటుడిగా .. రచయితగా .. దర్శకుడిగా పెద్ద కష్టాలు పడకుండానే అవకాశాలు వచ్చాయి. 'అష్టా చెమ్మా' సినిమా రిలీజ్ అయిన తరువాత నాకు ఒక కాల్ వచ్చింది. నేను ఆ సినిమాలో చాలా బాగా చేశానంటూ అవతల నుంచి ఒకతను మెచ్చుకుంటున్నారు. అంతా మాట్లాడిన తరువాత మీ పేరు తెలుసుకోవచ్చునా సార్ అన్నాను. 'నన్ను రవితేజ అంటారండి' అన్నారాయన. నిజానికి ఆయన కాల్ చేస్తారని నేను అసలు ఊహించలేదు .. అందువలన గుర్తుపట్టలేకపోయాను అంటూ నవ్వేశారు.




Tags:    

Similar News